ఆర్టీసీ తో చర్చలకు సీఎం గ్రీన్​సిగ్నల్​!

ఆర్టీసీ తో చర్చలకు సీఎం గ్రీన్​సిగ్నల్​!
  • ఈరోజు కార్మిక సంఘాలతో ఈడీల కమిటీ మీటింగ్​
  • ఇన్​చార్జ్​ ఎండీ హాజరుకారు
  • 21 డిమాండ్లలో 12కు సర్కార్​ సానుకూలం!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు సీఎం కేసీఆర్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్టు తెలిసింది. శనివారం ఉదయం ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్లు(ఈడీ) సమావేశం అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం కార్మిక సంఘాలతో ఈడీలు చర్చలు జరుపుతారని తెలిసింది. ఇన్‌‌‌‌చార్జ్​ ఎండీ సునీల్‌‌‌‌ శర్మ అందుబాటులో ఉన్నా.. చర్చలకు హాజరుకారని సమాచారం.

శనివారం ఈడీలే స్వయంగా యూనియన్ల నేతలకు ఫోన్లు చేసి చర్చల గురించి చెప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ప్రగతి భవన్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, ఈడీలతో సీఎం సమీక్ష నిర్వహించారు. సుమారు 4 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈడీ కమిటీ రూపొందించిన రిపోర్ట్‌ను ఉన్నతాధికారులు సీఎంకు అందజేశారు. కార్మిక సంఘాలతో చర్చించాల్సిన అంశాలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. పెద్దగా ఆర్థిక భారంలేని డిమాండ్లు ఏమిటో విభజించాలని సీఎం సూచించినట్లు సమాచారం. మొత్తం 21 డిమాండ్లపై ఈడీల కమిటీ నివేదిక తయారు చేయగా, 12 డిమాండ్లను కేసీఆర్‌ ఓకే చేసినట్లు తెలిసింది. ఈ నెల 28న కోర్టుకు తెలియజేయాల్సిన విషయాలపై సూచనలు చేసినట్లు సమాచారం.

విలీనం చర్చే వద్దు..

‘హైకోర్టు చెప్పింది కాబట్టి చర్చలు జరుపుతున్నం. కోర్టులపై గౌరవం ఉంది. లేకుంటే చర్చలే అవసరం లేదు. వాళ్లతో మాట్లాడిన విషయాలను కోర్టుకు చెబుదాం. అంతగా ఆర్థిక భారం లేని విషయాలు మాత్రమే చర్చించండి. ఒక వేళ చర్చలు విఫలమైనా బాధపడొద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తనే ఉండాలి. వచ్చేటోళ్లు చేరుతరు. వాళ్లను చేర్చుకుందాం. రానోళ్ల గురించి ఆలోచించొద్దు’’అని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో అన్నట్లు తెలిసింది. చర్చల సందర్భంగా యూనియన్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను ప్రధానంగా ముందు పెట్టే అవకాశం ఉందని, దాని చర్చ తీసుకురావద్దని, అసలు దాన్ని చర్చించవద్దని కేసీఆర్‌ ఈడీలకు సూచించినట్లు సమాచారం. చర్చల సందర్భంగా కార్మిక సంఘాలకు ఎలాంటి లిఖిత పూర్వక హామీలు ఇవ్వవద్దని ఆదేశించారని తెలిసింది. కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫార్మాలిటీ కోసం పెడుతున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చర్చల సారాంశాన్ని సోమవారం కోర్టుకు సమర్పించనున్నారు.

CM KCR gives green signal to RTC management with employee unions