భారీ కాన్వాయ్ తో మునుగోడుకు బయల్దేరిన కేసీఆర్

భారీ కాన్వాయ్ తో మునుగోడుకు బయల్దేరిన కేసీఆర్

మునుగోడులో ఇవాళ టీఆర్ఎస్ నిర్వహించే ప్రజా దీవెన భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు  సీఎం కేసీఆర్  బయలుదేరారు. ప్రగతి భవన్‌ నుంచి పార్టీ  శ్రేణులతో కలిసి సీఎం బస్సులో వెళ్తున్నారు. సీఎం వెళ్లే  రూట్లలలో కార్యకర్తలు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట్, పోచంపల్లి క్రాస్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణ్ పూర్, చల్మెడ మీదుగా కేసీఆర్ మునుగోడుకు చేరుకోనున్నారు.  సాయంత్రం సభలో  సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. 

మరోవైపు సీఎం సభ కోసం 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.  ఐదుగురు ఎస్పీలు,  ఆరుగురు అదనపు  ఎస్పీలు, 25 మంది   డిఎస్పీలు, 50మంది  సీఐలు, 94 మంది  ఎస్సైలు విధుల్లో పాల్గొననున్నారు.  సీఎం సభతో  చర్లగూడెం,  కిష్టరాయిన్ పల్లి భూ నిర్వాసితులను  ముందస్తు అరెస్టులు  చేశారు పోలీసులు. ఐదురోజులుగా  మునుగోడులో దీక్ష చేస్తున్న వారిని అర్ధరాత్రి 2గంటలకు  అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభను అడ్డుకుంటారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో.. మఫ్టీలో పోలీసులను సభా ప్రాంగణంలో మోహరించారు.