పాస్​ ఉంటేనే.. కేసీఆర్ మీటింగ్​కు ఎంట్రీ

పాస్​ ఉంటేనే.. కేసీఆర్ మీటింగ్​కు ఎంట్రీ
  • వాసాలమర్రిలో నేడు సీఎం గ్రామసభ
  • ఇంటింటికీ తిరిగి     పాసులు ఇస్తున్న సెక్రటరీలు
  • రోడ్డు పక్కల ఊళ్లన్నీ సాఫ్​  ఏర్పాట్లలో బిజీ అయిన ఆఫీసర్లు

యాదాద్రి, తుర్కపల్లి, వెలుగు : వాసాలమర్రిలో సీఎం కేసీఆర్​ పర్యటన ఆఫీసర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కలెక్టర్​ ఆకస్మిక బదిలీ నేపథ్యంలో అధికారులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. కేసీఆర్​ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 22న జరిగే గ్రామసభ కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే మోహరించింది. సీఎం రోడ్డు మార్గాన వస్తారని తెలియడంతో భువనగిరి నుంచి  వాసాలమర్రి వరకు మధ్యలో ఉన్న అన్ని గ్రామాల్లో  రోడ్లను క్లీన్​ చేస్తున్నారు. ట్రాక్టర్ల మీద మొక్కలు తెప్పించి భువనగిరి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాలమర్రి వరకు రోడ్డుకి ఇరువైపులా ఉపాధి కూలీలతో నాటిస్తున్నారు.
సీఎం ఆదేశాలతోనే..
సీఎం గ్రామసభకు పాస్​ ఉన్నవారిని మాత్రమే  అనుమతించనున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి పాస్​ ఇవ్వాలని, అందరూ మీటింగ్​కు​ అటెండ్​ అయ్యేలా చూడాలని కేసీఆర్​ ఆదేశించినట్టు తెలుస్తోంది.  దీంతో 10 మంది విలేజ్​  సెక్రటరీలు ఇంటింటికి తిరిగి పాసులు జారీ చేస్తున్నారు. పాస్​ఉన్నవారే సీఎం కేసీఆర్​తో సహపంక్తి భోజనం చేసి..  మీటింగ్​కు హాజరవుతారు. పక్కనఉన్న తుర్కపల్లి, కొండమడుగు గ్రామాల ప్రజలను కూడా ఈ సభకు అనుమతించడం లేదు. గ్రామసభ జరుగుతున్నప్పుడు వాన పడ్డా ఇబ్బంది లేకుండా వాటర్​​ప్రూఫ్​ టెంట్లు వేశారు. కరెంట్​ పోకుండా స్పెషల్​గా ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేశారు. . సీఎం మీటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్​రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి కూడా సోమవారం ​ ఏర్పాట్లను  పరిశీలించారు. వాసాలమర్రిని మొత్తం భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సీపీ మహేశ్​​భగవత్​  నేతృత్వంలో పోలీసులు డాగ్​ స్క్వాడ్, బాంబ్​ స్క్వాడ్​తో జల్లెడ పడుతున్నారు. 
వాసాలమర్రి రోల్​ మోడల్​: మంత్రి జగదీశ్​రెడ్డి
వాసాలమర్రిని రాష్ట్రంలోనే మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేయాలని కేసీఆర్ దత్తత తీసుకున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత మాట్లాడారు.  వాసాలమర్రిలో ఏఏ కార్యక్రమాలు చేపట్టేది సీఎం ​ ప్రకటిస్తారని చెప్పారు.