గోదావరిని సజీవ జలధారగా మార్చినం

గోదావరిని సజీవ జలధారగా మార్చినం
  • గడిచిన ఏడేండ్లలో వ్యవసాయం బాగైంది: సీఎం కేసీఆర్

సిరిసిల్ల: గడిచిన ఏడేండ్లలో తెలంగాణలో వ్యవసాయం బంగారమైందని, ఈ ఏడాది 92 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి ఇచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల స్కీమ్ ల వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన  పర్యటించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు మనకు ఏదీ చేతకాదన్నట్టు కొందరు మాట్లాడారని, ఈ రోజు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ బిల్డింగ్ లను డిజైన్ చేసింది మన తెలంగాణ బిడ్డ ఉషా రెడ్డి అని ఆయన చెప్పారు. ఇంత అద్భుతమైన బిల్డింగ్ లను మన తెలంగాణ బిడ్డలు కట్టి చూపించారని అన్నారు. పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపించామని చెప్పారు.
వలస పోయిన రైతులు వెనక్కి వస్తున్నరు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడేండ్లలో సాగు, తాగు నీరు, కరెంట్ కష్టాలను దాదాపుగా తీర్చుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం బాగైందని, ఈ ఏడాది 92 లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఎఫ్సీఐకి ఇచ్చామని చెప్పారు. గతంలో వలస పోయిన రైతులంతా మళ్లీ వెనక్కి వస్తున్నారని, ఊరిని, ఇండ్లను మంచిగా చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ తన పునాదిని తాను బలంగా చేసుకుంటోందని చెప్పారు. మిషన్ కాకతీయ స్కీమ్ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామని, గతంలో వానలు పడితే చెరువులు తెగిపోయేవని, మిషన్ కాకతీయలో పటిష్టం చేసుకున్న తర్వాత ఆ పరిస్థితి మారిపోయిందన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు లెవెల్ భారీగా పెరిగాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్ల కరెంట్ బిల్లులు కడుతున్నామని గిట్టనోళ్లు విమర్శిస్తున్నారని, అయితేనేం పది వేల కోట్ల రూపాయలైనా కడుతామని, రైతుల ఇండ్లు బంగారం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరిని ఎత్తి పోసుకుని కరీంనగర్ ను సజీవ జలధారగా చేసుకున్నామని చెప్పారు.
జనాలు మోటార్ నొక్కితే నీళ్లు ఐదు అడుగులు దుంకుతున్నాయని, కొంత మంది కేసీఆర్ నీళ్లు అని చప్పట్లు కొడుతున్నారని అన్నారు. మనం కట్టిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల స్కీమ్ లతో దాదాపు 1080 కిలోమీటర్ల గోదావరి సజీవ ధార అయిందన్నారు. ఏడాదిలో ఎప్పుడు చూసినా నీళ్లు కనిపిస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు.