
- ఎన్నికల్లో ఆగమైతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైతది
- డబ్బు, మదం, అహంకారంతో వచ్చేటోళ్లను తిప్పికొట్టాలి
- తెలంగాణ కోసం పోరాడినప్పుడల్లా జనాన్ని కాంగ్రెస్ చంపింది
- రాష్ట్ర ఏర్పాటు కోసం పక్షి లెక్క తిరిగిన.. చావునోట్ల తలకాయ పెట్టిన
- తెలంగాణ బాగు కోసం కడుపు కట్టుకొని పనిచేస్తున్నం
- నేను కిందా మీద పడి ధరణిని తెస్తే.. కాంగ్రెసోళ్లు తీసేస్తరట
- 119 నియోజకవర్గాల్లో ఒక్కో కేసీఆర్ ఉన్నడు..
- వాళ్లే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తరని వ్యాఖ్య
- అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో ప్రసంగం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే వ్యక్తిగతంగా తమకు పోయేదేమీ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘సపోజ్ మీరు ఓడగొట్టిన్రనుకో.. ఏమున్నది రెస్ట్ తీస్కుంటం.. అంతేగదా? మాకు వచ్చేదేమీ లేదు.. మాకు పోయేదేమీ లేదు. కానీ, నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణ సాధించినవాళ్లుగా, తెలంగాణను ఒక దరికి తీసుకొస్తున్నవాళ్లుగా తప్పకుండా మా కర్తవ్యం మీకు చేర్చాలె’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు ధరణిని తీసేస్తామంటున్నారని, ధరణి పోతే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందని అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ఆగమైతే కుక్కలు చింపిన విస్తరిగా తెలంగాణ మారుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే పైరవీకారుల పార్టీ అని దుయ్యబట్టారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి, నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.
మాతో పొత్తు పుణ్యమాని అప్పట్ల కాంగ్రెస్ గెలిచింది
ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, ప్రత్యేక రాష్ట్రం కావాలన్నప్పుడల్లా ఎంతో మందిని ఆ పార్టీ కాల్చి చంపిందని కేసీఆర్ మండిపడ్డారు. ఇక్కడి ప్రజల గోస పోసుకుందని ఆయన దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ కావాలన్నప్పుడల్లా ఎంతో మందిని కాంగ్రెస్ కాల్చి చంపింది. 1969లో చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడిన 400 మందిని పిట్టల్లా కాల్చిచంపిన్రు. మొన్న నేను మొదలుపెడితే.. ఊక్కుంట వచ్చి ఎగేసుకుంట వచ్చి పొత్తు కలుస్తమన్నరు..పొత్తు పుణ్యమాని గెలిచిన్రు.. ఈడ, ఢిల్లీల అధికారంలోకి వచ్చిన్రు. కానీ, తెలంగాణ ఇయ్యలే. 14ఏండ్లు ఏడిపిచ్చిన్రు. చివరికి నేను చావునోట్ల తలకాయ పెడ్తే కానీ తెలంగాణ రాలే. నేను పక్షి తిరిగినట్లు తిరిగి.. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి.. దేశం మొత్తం మాతో ఉన్నదని కాంగ్రెస్‌ను హెచ్చరిస్తే అప్పుడు తెలంగాణను ఇచ్చిన్రు. ఎంతో మంది పిల్లల చావులకు కారణమైన్రు” అని కేసీఆర్ అన్నారు.
కడుపు కట్టుకొని పనిచేస్తున్నం
తెచ్చుకున్న తెలంగాణను బాగుచేసుకోనికి కడుపు కట్టుకుని పని చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ‘‘దేశం ఊహించని అద్భుతమైన స్కీమ్‌లను పెట్టుకున్నం.. ఇంకా మంచిగ చేసుకుందం.. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మీరే గోసపడ్తరు..’’ అని అన్నారు. ఒకప్పుడు పాలమూరు అంటే వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు, అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు, తాగునీళ్ల కోసం బిందెలు నెత్తిన మోసుకుంటూ మూడు కిలోమీటర్లు తిరిగిన రోజులు ఉండేవని, ఇప్పుడు ఎటుచూసినా పచ్చగా కళకళలాడుతున్నదని కేసీఆర్ చెప్పారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్, ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్గెలిస్తే మూడు గంటల కరెంట్మాత్రమే వస్తుందని చెప్పారు. ‘‘తెలంగాణలో ఎలక్షన్లు అనంగనే పెద్దపెద్ద సిపాయిలు దిగుతరు.. సెంటర్ నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు పొడువు పొడువు ఉపన్యాసాలు చెప్పిపోతరు. కానీ వాళ్లు పాలించే రాష్ట్రాల్లో ప్రజలకు తాగేందుకు నీళ్లు, రైతులకు కరెంట్, రైతులను ఆదుకునే స్కీములు మాత్రం పెట్టరు..’’ అని దుయ్యబట్టారు.
కాంగ్రెస్.. పైరవీకారుల పార్టీ
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బాగోగులు కాదు.. పెత్తనం కావాలని కేసీఆర్ విమర్శించారు. ‘‘నేను కిందా మీద పడి ధరణి తెచ్చిన.. అలాంటి ధరణి వద్దని కాంగ్రెసోళ్లు అంటున్నరు. వాళ్లు వస్తే మళ్లీ పట్వారీలు, గిర్దావర్లు వస్తరు. ఎమ్మార్వో, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ జనం తిరగాలే. దళారులు,పైరవీకారులు చెప్పినట్లు వినాలె. అప్పుడు చేతులు తడిపితే కానీ పనికాదు. అవినీతి లేకుండా మేం పాలిస్తున్నం’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టే.. పైరవీకారుల పార్టీ, వాళ్లకు దోచుకుతినడమే పని .. అలాంటి కాంగ్రెస్ దుర్మార్గులు వస్తే రైతు బంధుకు రాంరాం, దళిత బంధుకు జైభీం అంటరు’’ అని ఆయన దుయ్యబట్టారు. ‘‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద 192 కేసులు వేసి.. కాంగ్రెస్ సన్నాసులు అడ్డుకున్నరు” అని ఆరోపించారు. నల్లమల అప్పర్ ప్లాట్‌కు సాగునీరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అడవి బిడ్డలకు పోడు పట్టాలిచ్చామని, ఆ భూములకు కూడా రైతుబంధు ఇస్తున్నామని, పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆదేశించామని చెప్పారు.
కమ్యూనిస్టు ఉద్యమాల చైతన్యాన్ని చూపెట్టాలి
‘‘నల్గొండ చైతన్యం కలిగిన జిల్లా. కమ్యూనిస్టు జెండాలు ఎగిరిన ప్రాంతం. మీ చైతన్యం మూగపోవద్దు. ఆ చైతన్యాన్ని ఎన్నికల్లో చూపెట్టాలి. డబ్బు, మదం, అహంకారంతో వచ్చేటోళ్లను తిప్పికొట్టాలి.. అప్పుడే రాజకీయ ప్రక్షాళన సాధ్యమవుతుంది..’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘మునుగోడు ఉప ఎన్ని కలో ఏ ధన ప్రవాహానికి అడ్డంగా నిలబడి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారో మళ్లీ అదే నమ్మకంతో ఇప్పుడు బీఆర్ఎస్ను గెలిపించాలి” అని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు కంప్లీట్ చేశామని, ఇంకొన్ని పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏడాదిన్నర లోగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కంప్లీట్ చేసి, మునుగోడు నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
దళితబంధును పుట్టించిందే నేను
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానిగా ఉన్న జమానాలో దళితబంధు వంటి పథకం అమలు చేస్తే ఈపాటికి దళిత బిడ్డలు మహారాజుల్లాగా ఎదిగేవారని, కానీ కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంక్‌లాగా వాడుకున్నదని కేసీఆర్ విమర్శించారు. ‘‘దళితబంధును పుట్టించిందే కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పథకాన్ని మానవీయ కోణంలో అమలుచేస్తున్నం” అని చెప్పారు. ‘‘ 24 ఏండ్ల కిందట తెలంగాణ ఉద్యమానికి బయల్దేరినప్పుడు ఎక్కడెక్కడో ఉన్నోళ్లు.. ఎవరెవరో బూట్లు మోసినోళ్లు అందరూ నామీద చాలెంజ్ చేస్తున్నరు.. కేసీఆర్ నీకు దమ్ముందా..? నువ్వు కొడంగల్‌లో పోటీ చేస్తవా..? గాంధీ బొమ్మకాడికి వస్తవా.. అని మాట్లాడుతున్నరు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో కేసీఆర్ ఉన్నడు. వారే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తరు” అని హెచ్చరించారు. తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, నవంబర్ 30 తారీఖు నాడు దుమ్మురేగాలని అన్నారు. ‘‘రాష్ట్రంలో ఇద్దరి మీద జోకులున్నయ్. మంత్రి హరీశ్ మీద ఒకటి.. మంత్రి నిరంజన్ మీద ఒకటి ఉన్నది. నిరంజన్ రెడ్డికి ఏడన్న తట్టెడంత పెండ దొరికితే పొలంల వేసుకుంటడని పేరున్నది. జనం కోసం ఆయన తండ్లాడుతడు” అని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బాగోగులు కాదు.. పెత్తనం కావాలి. నేను కిందా మీద పడి ధరణిని తెచ్చిన.. నా ఇంటి కోసమో.. నా సుట్టాల కోసమో కాదు. భూముల మీద రైతులకే అధికారం ఉండాలని తెచ్చిన. దాన్ని వద్దని రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అంటున్నరు. వాళ్లు అధికారంలోకి వస్తే మళ్లీ పట్వారీలు, గిర్దావర్లు వస్తరు.. పైరవీకారులు వస్తరు. దోచుకుతినడమే కాంగ్రెసోళ్ల పని. - కేసీఆర్