టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై స్పందించని కేసీఆర్

టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై స్పందించని కేసీఆర్
  • టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై స్పందించని కేసీఆర్
  • తన ఫ్యామిలీపై ఆరోపణలు వస్తున్నా నోరు మెదపలే
  • ఆందోళనలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులకు భరోసా ఇస్తలే

హైదరాబాద్, వెలుగు : టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించడం లేదు. ఓ పక్క నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా.. మరోవైపు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నా నోరెత్తడం లేదు. ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు భరోసా కల్పించేలా ఒక్క మాటైనా చెప్పడం లేదు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పేపర్ లీక్ జరిగి మూడు వారాలైతున్నా.. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నా సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తన పార్టీని పొరుగు రాష్ట్రాల్లో విస్తరించడంపైనే ఆయన దృష్టి పెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు సీఎం తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

నిరుద్యోగులకు భరోసా ఇవ్వరా?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ హడావుడిగా ప్రెస్​మీట్ పెట్టి మరీ మీడియాకు వీడియోలు చూపించారు. రాజకీయ మైలేజ్ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్‌‌ కేసులో కవితను ఈడీ విచారించడంపై లీగల్​ టీమ్‌‌, కుటుంబ సభ్యులతో ప్రగతిభవన్​లో సమావేశాలు పెట్టారు. కానీ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశంపై ఇప్పటిదాకా నోరెత్తకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేసులో కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధముందని, ప్రభుత్వ పెద్దలు ఈ స్కామ్​లో ఉన్నారని, సీఎంవోలో పనిచేసే వ్యక్తికి లింకులున్నాయని ఆరోపణలు వస్తుంటే.. కేసీఆర్ స్పందించకపోవడమేంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి పేపర్ లీక్ వ్యవహారం​ బయటపడిన చాలా రోజులకుగానీ.. మంత్రి కేటీఆర్ స్పందించలేదు. ఆయన కూడా నిరుద్యోగులకు భరోసానిచ్చే విషయాలేవీ చెప్పలేదన్న విమర్శలు వచ్చాయి. ‘పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. ఆన్​లైన్​లో కోర్సు మెటీరియల్ ఇస్తాం’ అని చెప్పారే తప్ప.. నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదంటున్నారు. నిరుద్యోగులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పరిహారం లేదా పరీక్షలు జరిగినంత కాలం నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి.

పార్టీ విస్తరణపైనే ఫోకస్

టీఆర్ఎస్‌‌ను బీఆర్ఎస్​గా మార్చినప్పటి నుంచి ఆ పార్టీని విస్తరించడంపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పలు బహిరంగ సభలను నిర్వహించారు. తాజాగా మహారాష్ట్రలోని లోహలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. శనివారం మహారాష్ట్రకు చెందిన పలువురు రైతులు బీఆర్​ఎస్​లో చేరిన సందర్భంగా వారితో సమావేశమయ్యారు. ఇంత మంది నిరుద్యోగులు అరిగోస పడ్తున్నా పట్టించుకోని సీఎం.. పక్క రాష్ట్రానికి పోయి రైతులకు హామీలివ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహించాలని, భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

నిరసనలు తెలిపితే అరెస్టులా?

పేపర్ లీక్‌‌పై విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు నిరసనలు చేస్తుంటే.. సీఎం స్పందించి భరోసా ఇవ్వాల్సిందిపోయి అరెస్ట్ చేయిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఓయూ, కేయూల్లో విద్యార్థులను అరెస్ట్​ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 గ్రూప్​1లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. టీఎస్​పీఎస్సీ భవిష్యత్​లో నిర్వహించే పోటీ పరీక్షలపైనా నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా సరిగ్గా పరీక్షలను నిర్వహించలేదుగానీ.. మున్ముందు మాత్రం ఎలా పారదర్శకంగా నిర్వహిస్తారని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో  టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేసి.. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తామని నిరుద్యోగులకు కేసీఆర్ భరోసా ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.