ప్రధానికి కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటు

ప్రధానికి కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటు

హైదరాబాద్ కు ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేత రామచందర్ రావు విమర్శించారు. మోడీకి ముఖం చూపించడానికి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ప్రధాని లేదా రాష్ట్రపతి వస్తే ఆ రాష్ట్ర సీఎం వారికి స్వాగతం పలకాలి. ఇది ప్రోటోకాల్..దీనిని ఉల్లంఘించడం సరికాదు. దేశ ప్రధానిని పార్టీలకతీతంగా గౌరవించాలి’’ అని రామచందర్ రావు అన్నారు. కాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు స్వాగతం పలికారు. అయితే ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ రాకపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తే సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి స్వయంగా స్వాగతం పలికారు. ప్రధాని రావడానికి కొన్ని గంటల ముందే సిన్హా హైదరాబాద్ వచ్చారు. అయితే ప్రధానికి మాత్రం కేసీఆర్ స్వాగతం పలకకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాలని ఎక్కడా లేదని.. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైనా రావొచ్చని చెప్పారు.