చావులకు కేసీఆరే కారణం

చావులకు కేసీఆరే కారణం

ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై నెట్టాలని చూస్తున్నడు

ప్రతిపక్షాలపై సీఎం మాట్లాడిన భాష ఆక్షేపణీయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌‌ కె.లక్ష్మణ్‌‌

సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరిక

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారకుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌‌ కె. లక్ష్మణ్ అన్నారు.  సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సన్నాసులు, పనికిమాలినవాళ్లు, చిల్లరగాళ్లు, ఉన్మాదులు అని మాట్లాడటం ఆక్షేపణీయమన్నారు. సమ్మెను అడ్డం పెట్టుకొని బస్సు చార్జీలు పెంచడం పేదలపై భారం మోపడమేనని, ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా పేదలపై భారం మోపడం తగదని అన్నారు. సీఎం ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడారని, నెపాన్ని కేంద్రంపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. కేబినెట్​ భేటీ తర్వాత ప్రెస్​మీట్​లో కేసీఆర్​ మాట్లాడిన తరువాత  గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తుందని, ఫాం హౌస్‌‌కు పరిమితమైన సీఎం ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. కార్మికులకు ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్‌‌లో మానవత్వం ఉందనేది నేతి బీరలో నేయి చందమేనని లక్ష్మణ్​ అన్నారు. గుర్తింపు పొందిన యూనియన్లు రాజ్యాంగబద్ధంగానే సమ్మె నోటీసు ఇచ్చాయని గుర్తుచేశారు.

‘‘రవాణా మంత్రిగా ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్​కు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీ గుర్తుకురాలేదా? సమ్మె ఇల్లీగల్​ కాదని హైకోర్టు చెప్పినా పట్టించుకోనిమాట వాస్తవం కాదా? ఆర్టీసీ కార్మికుల బతుకులు ఆగం చేయొద్దని సాక్షాత్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీఎంను కోరారంటే కేసీఆర్‌‌ నియంతృత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది. కేంద్రం తెచ్చిన రవాణా చట్టంపై కేసీఆర్​ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలపై సీఎం కామెంట్లు సరికాదు. సింగరేణి, ఆర్టీసీలో కేంద్రానికి వాటా ఉంది. కాబట్టే సమాఖ్య స్ఫూర్తితోనే కేంద్రం వాటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది.  ప్రధానమంత్రి గ్రామ సడక్‌‌ యోజన కింద రోడ్లు వేస్తుంటే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కేసీఆర్​ మర్చిపోయారా?’’అని ప్రశ్నించారు.  బీజేపీ మొదటి నుంచి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడి మనోధైర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నించిందని లక్ష్మణ్​ చెప్పారు. 50 వేల కుటుంబాలు వీధిన పడటం, కార్మికుల ఆత్మహత్యలు చేసుకోవడంతో తానే స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌షాకు నివేదిక ఇచ్చానని, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి నితిన్‌‌ గడ్కరీని కలిసి సమస్య తీవ్రతను వివరించారని, కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి, తాను బీజేపీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ జీపీ నడ్డాకు సమస్యను వివరించామని గుర్తుచేశారు. రాష్ట్ర బీజేపీ నేతల ఒత్తిడితోనే కేంద్రం ఆర్టీసీని ప్రైవేటైజేషన్​కు ఒప్పుకోలేదన్నారు. కార్మిక సంఘాలు అవసరం లేదంటున్న కేసీఆర్​.. సింగరేణిలో కవిత, ఆర్టీసీలో హరీశ్‌‌రావు కార్మిక సంఘాలకు నాయకులుగా ఎలా కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు. వెంటనే టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ కార్మిక విభాగాన్ని రద్దు చేయాలని సూచించారు.

ఒక్కహామీనైనా నిలబెట్టుకున్నారా?

అంతకుముందు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ హెడ్​క్వార్టర్స్​లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రెండోసారి సీఎం అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలను అమల్లో ఏ ఒక్కటీ కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు.  రైతుబంధు పథకం బందయి, రుణమాఫీ అటకెక్కి, డబుల్​ బెడ్​రూమ్ ఇండ్లు ఊసులేకుండా పోయాయని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి,  ప్రజల కష్టాలు, బాధల్ని పట్టించుకోకుండా కేసీఆర్​ ఫార్మ్​హౌజ్​లో టైంపాస్​ చేస్తున్నారని మండిపడ్డారు.  రాష్ట్రప్రభుత్వం స్కూళ్లను బంద్​పెట్టి, బార్లు తెరవడం దారుణమని, ఇప్పుడున్న 26 వేల బడుల్లో 12 వేల బడులను మూసివేసి పేదలకు చదువును భారంగా మార్చారని లక్ష్మణ్ మండిపడ్డారు.  రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లుగా వున్న కాంగ్రెస్, మజ్లీస్.. టీఆర్​ఎస్​కు అమ్ముడుపోయాయని, 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కేసీఆర్​కు అమ్ముడుపోతే ఆ పార్టీ నేతలు ఏమీ చేయలేకపోయారని గుర్తుచేశారు. తెలంగాణలో వికాసం ఒక్క కమలంతోనే సాధ్యమవుతుందని స్ప అన్ని విధాలుగా వికాసం చెందాలంటే  కాంగ్రెస్ నుండి గెలిచిన 12 మంది ఎం ఎల్ ఏ లు టీ ఆర్ ఎస్ కు అమ్ముడు పోతే , ఆ పార్టీ నేతలు ఏమి చేయలేక పోయారు అన్నారు. కల్వకుంట్ల పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేది బీజేపీ ఒక్కటేనని, తెలంగాణ వికాసం కమలంతోనే సాధ్యమవుతుందని అన్నారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ అన్నివర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్నదన్న లక్ష్మణ్​.. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులను మంజూరు చేసినా, రాష్ట్ర వాటాను  టీఆర్ఎస్ సర్కార్ చెల్లించకపోవడం  వల్లే పనులు ఆగిపోతున్నాయని తెలిపారు.

బీజేపీలోకి చేరికలు

కల్వకుంట్ల  కుటుంబం నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసుకునేలా ప్రజలందరూ బీజేపీతో కలిసినడవాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆయన సమక్షంలో సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలు గురువారం  బీజేపీలో చేరారు. సూర్యాపేట జిల్లా కోదాడలో లక్ష్మణ్​ ముఖ్య​అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం బీఎస్​పీ కన్వీనర్​ ఒర్సు వెంలంగిరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ వేడుకలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనాగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అక్కిరాజు సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోలిషెట్టి. కృష్ణయ్యతోపాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. హైదరాబాద్​లోని బీజేపీ ఆఫీసులోనూ చేరికలు కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామాచేసి లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు.