మునుగోడులో మనమే గెలుస్తున్నాం

మునుగోడులో మనమే గెలుస్తున్నాం

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తామే గెలుస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ నిలువనున్నాయని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికలో ప్రతి రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే చొప్పున ఇంఛార్జ్ లను నియమించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గం కలియ తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి ఇంఛార్జ్ లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉండాలె

పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు 72 నుంచి 80 స్థానాలు వస్తాయని తెలిపారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శివసేన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందన్న కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు బీజేపీ ఇక్కడ చేద్దామనుకుంటే కుదరదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి లేదని, దర్యాప్తు సంస్థలకు భయపడాల్సిన అవసరం లేదని పార్టీ నేతల్లో భరోసా కల్పించారు. బీజేపీ మత పిచ్చి రాజకీయాలు చేస్తోందని, ఎప్పటికప్పుడు బీజేపీ చర్యలను తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె స్థాయికి దిగజారి మాట్లాడారని కేసీఆర్ విమర్శించారు.

నియోజకవర్గాల్లో తిరగండి

ఎమ్మెల్యేలు ఇక నుంచి తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న హామీలన్నీ నెరవేస్తామని, ఈ విషయంలో ఎవరూ కూడా నిరుత్సాహ పడొద్దని చెప్పారు. పెన్షన్లు, ఇండ్లు కట్టుకోవడానికి ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 500 మందికి దళిత బంధు ఇస్తామని, అందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. త్వరలోనే జాతీయ స్థాయిలో దళిత సంఘాల నేతలతో సమావేశం ఉంటుందని  స్పష్టం చేశారు. ఈ నెల 6,13,14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.