వస్తున్నది మన టైమే.. ఢిల్లీని డిసైడ్ చేసేది మనమే: కేసీఆర్

వస్తున్నది మన టైమే.. ఢిల్లీని డిసైడ్ చేసేది మనమే: కేసీఆర్
  • ఢిల్లీని డిసైడ్‌ చేసేది మనమే
  • మనమేందో 23న తెలుస్తది
  • ఫలితాల తర్వాత ఫెడరల్‌ ఫ్రంట్‌
  • మరికొన్ని ప్రాంతీయపార్టీలు కలిసివస్తయి
  • ఎన్డీఏ, యూపీఏలకు మెజార్టీ రాదని వ్యాఖ్య

లోక్​సభ ఎన్నికల రిజల్ట్​ తర్వాత ఢిల్లీని డిసైడ్‌ చేసేది టీఆర్‌ఎస్‌ సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలేనని సీఎం కేసీఆర్‌ ధీమాగా ఉన్నారు. టీఆర్​ఎస్​ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశాల్లో ఇదే విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. జాతీయ సర్వే సంస్థల సమాచారం ప్రకారం ఎన్డీఏ, యూపీఏల్లో ఏ కూటమికీ మెజార్టీ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నట్టు తెలిసింది. రెండు కూటములకు సమదూరంగా ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలకు 50కిపైగా సీట్లు వచ్చే అవకాశముందని, ఢిల్లీ పీఠాన్ని డిసైడ్‌ చేసేది ఈ పార్టీలేనని పేర్కొన్నట్టు సమాచారం. ‘23వ తేదీ తర్వాత మనమేంటో అందరికీ తెలిసి వస్తుంద’ని చెప్పినట్టు సమాచారం.

కొందరు కలిసొస్తారు

పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్న కీలక నేత చెప్పిన అంశాల మేరకు.. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ క్రియాశీలంగా ఉండబోతోందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నట్టు తెలిసింది. ఫలితాలు వచ్చాక కొన్ని ప్రాంతీయ పార్టీలు టీఆర్‌ఎస్‌ ఫ్రంట్‌లోకి కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్డీఏకు 230 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీ కూటమితో కొత్తగా జట్టు కట్టడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని అన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌కు సొంతంగా వంద సీట్లకు మించి రావని, యూపీఏ 180 సీట్లు దాటదని సర్వే ఫలితాలు అంటున్నాయని చెప్పినట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేడీ పార్టీలు ఎన్డీఏ, యూపీఏలకు సమదూరంలో ఉన్నాయని, ఈ పార్టీలే కేంద్రంలో కీలకం కాబోతున్నాయని కేసీఆర్​ చెప్పినట్టు తెలిసింది. వీరికి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా తోడవుతాయని, తృతీయ ప్రత్యామ్నాయం (ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌) ఒక జాతీయ పార్టీ మద్దతుతో అధికారాన్ని చేపట్టే అవకాశముందని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఫ్రంట్ల పేరుతో హడావుడి చేస్తున్న నేతల ప్రభావం.. ఎలక్షన్​ ఫలితాల తర్వాత అణా పైసా ఉండబోదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రాజకీయంగా అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తారని, టైం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తారని.. ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌‌తో పాటు మరికొన్ని పార్టీలకు టైం రాబోతోందన్నట్టు సమాచారం.

పార్టీలకు మోడల్​గా నిలుస్తం

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ నమూనా దేశానికి ఆదర్శంగా నిలిచినట్టే.. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌‌ఎస్‌‌ ప్రాంతీయ పార్టీలకు రోల్‌‌ మోడల్‌‌ అవుతుందని, దేశానికి కొత్త రోడ్‌‌ మ్యాప్‌‌ చూపిస్తుందని సీఎం కేసీఆర్​ అన్నట్టు సమాచారం. ఫలితాలు వచ్చే రోజే కాంగ్రెస్‌‌ పార్టీ మాజీ చీఫ్‌‌ సోనియాగాంధీ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరయ్యే పార్టీలు సైతం ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌కు మద్దతు పలుకుతాయని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించామని, అది లోక్​సభ ఫలితాల తర్వాత కార్యరూపం దాల్చుతుందని అన్నట్టు సమాచారం. కేసీఆర్‌‌ అభిప్రాయపడ్డట్టుగానే రిజల్ట్​తర్వాతి పరిస్థితులు ఉంటాయని టీఆర్ఎస్‌‌ జాతీయ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించే ఒక నేత తెలిపారు.