ప్రజలను కూసోబెట్టి మర్యాద చేయండి

ప్రజలను కూసోబెట్టి మర్యాద చేయండి
  • పదవి వచ్చిందని సహజత్వాన్ని కోల్పోవద్దు
  • జడ్పీ చైర్​పర్సన్లకు సీఎం హితబోధ

పదవి వచ్చిన తర్వాత మన సహజత్వాన్ని కోల్పోకూడదని, అలా చేస్తే మన వెనుక ఉన్న జనం నవ్వుతారని జడ్పీ చైర్​పర్సన్లకు సీఎం కేసీఆర్​ హితవుపలికారు. లేనిపోని దర్పం తెచ్చుకోవద్దని, పదవి రాగానే మారిపోవద్దన్నారు. ‘‘మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్ గా అదే వస్తది. పెట్టుడు గుణాల కంటే, పుట్టుడు గుణం మంచిది అంటరు పెద్దలు. మన వ్యవహార శైలే మనకు లాభం” అని సూచించారు. మంగళవారం జడ్పీ చైర్​పర్సన్లు, వైస్​ చైర్​పర్సన్ల సమావేశంలో వారికి పలు సూచనలు చేశారు. పాలనలో ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు.  జడ్పీ చైర్​పర్సన్లుగా, వైస్​ చైర్​పర్సన్లుగా విజయం సాధించినందుకు వారిని అభినందించారు. ‘‘ఎవరికీ పుట్టుకతోనే అన్నీ రావు. ఒక్కో విషయం నేర్చుకుంటూ పోతరు. అజ్ఞాని ఏదో ఒక రోజు జ్ఞాని కాగలుగుతాడు. కానీ మూర్ఖుడు జ్ఞాని కాలేడు.  అన్నీ తమకే తెలుసు అనుకున్న వారికి ఏమీ చెప్పలేం. అలాంటి భావన దరిచేరనీయకుండా అన్ని విషయాల్లో అవగాహన పెంచుకున్న వాళ్లే ఎంచుకున్న రంగంలో రాణించగలుగుతరు” అని అన్నారు.

అన్ని విషయాలు ఎట్లా నేర్చుకుంటామో పంచాయతీరాజ్‌ విషయాలను అలాగే తెలుసుకోవాలని సూచించారు.  ‘‘ ప్రజలకు అనేక సమస్యలుంటయి. వాళ్లు సమస్యల పరిష్కారం కోసం మీదగ్గరికి వస్తరు. నాయకుల మంచి లక్షణం.. ఒకరు చెప్పింది వినడం. అదే మీరు చేయండి. ఓపికగా ప్రజల సమస్యలను సావధానంగా వినండి. వాళ్లను కూసోబెట్టి మర్యాద చేయండి. అప్పుడే వాళ్లకు రిలీఫ్ వస్తది. ఆ తర్వాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాల్నో  ప్రయత్నం చేయండి. సహజత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచి పేరు వస్తది. మంచిపేరుతోనే ఉన్నత స్థాయి వస్తది” అని జడ్పీ చైర్​పర్సన్లకు సీఎం హితబోధ చేశారు. ఐదేళ్ల పదవీకాలంలో అందరికీ పనిచేసే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అన్ని ఊళ్లల్లో అభివృద్ధి జరగాలంటే ఆ బాధ్యతను జడ్పీ చైర్​పర్సన్లే తీసుకోవాలని, పనితీరు కిందివాళ్లకు స్ఫూర్తిదాయకం కావాలని, ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నమో.. అట్లనే  పల్లెల అభివృద్ధి జరగాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పనిచేయాలన్నారు.

సరళంగా మాట్లాడండి

మంచి పనులు చేయడానికి పెట్టుబడి అవసరం లేదని, సరళంగా మాట్లాడటమే మనకు పెట్టని కోట అని సీఎం అన్నారు. గెలుపు, ఓటములు సర్వసాధారణమని, రాజకీయాల్లో ఉన్న వాళ్లు నిత్యం ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగాదేవిపల్లి, ముల్కనూరు, అంకాపూర్‌లా ఆదర్శ గ్రామాలుగా మారాలని సీఎం ఆకాంక్షించారు.

ఉద్యమ నాయకులకు పలకరింపు

జడ్పీ చైర్​పర్సన్లుగా ఎన్నికైన ఉద్యమ నాయకులను సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రత్యేకంగా పలుకరించారు. వారిని మిగతా చైర్​పర్సన్లకు, వైస్​ చైర్​పర్సన్లకు, ఇతర నాయకులకు పరిచయం చేశారు. కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, ములుగు, నల్గొండ జడ్పీ చైర్మన్లు కనమల్ల విజయ గణపతి, డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌, కుసుమ జగదీశ్‌, బండ నరేందర్‌రెడ్డిని భుజం తట్టి అభినందించారు. వాళ్లు తొలినాళ్ల నుంచి తనతో కలిసి నడిచారని సీఎం చెప్పారు. సిరిసిల్ల జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణును సీఎం అభినందించారు. ఉద్యమంలో ఎంతో కష్టపడ్డ వేణుకు గుర్తింపు దక్కిందన్నారు. జడ్పీ చైర్​పర్సన్లుగా ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటారో తమ తమ జిల్లాలను అలా తీర్చిదిద్దుకోవాలని సీఎం సూచించారు. తక్కువ వయసులో జడ్పీ చైర్‌ పర్సన్లు అయిన జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ చైర్‌ పర్సన్లను కూడా సీఎం అభినందించారు. ఇదిలా ఉంటే.. సమావేశం ప్రారంభం కావడానికి ముందు సీఎం కేసీఆర్‌ జడ్పీ చైర్​పర్సన్లు, వైస్‌ చైర్​పర్సన్లు కూర్చున్న స్థానాల వద్దకు వెళ్లి అందరినీ పరిచయం చేసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఫలితాలను బట్టి కార్యదర్శుల రెగ్యులరైజేషన్​

పల్లెలను చక్కగా తీర్చిదిద్దేందుకే పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చామని, పంచాయతీలకు కార్యదర్శులను నియమించామని, అనుకున్న ఫలితాలు సాధిస్తే మూడేళ్ల తర్వాత వారిని రెగ్యులర్‌ చేస్తామని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీలతోపాటు కార్యదర్శులపైనా జడ్పీ చైర్​పర్సన్లకు సంపూర్ణ అధికారాలు ఇస్తామన్నారు. డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవో, ఈవోపీఆర్డీలతో బాగా పనిచేయించాలని సూచించారు. పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక, పరిపాలన, అజమాయిషీ అధికారులను త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. జడ్పీ చైర్​పర్సన్లు బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లోనే జిల్లాల్లో మార్పు కనబడాలని సూచించారు.

త్వరలో శిక్షణ

జడ్పీ చైర్ పర్సన్లకు, వైస్‌ చైర్ పర్సన్లకు త్వరలోనే ఎన్‌ఐఆర్ డీలో శిక్షణ ఇప్పిస్తామని సీఎం తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టం అమలులో క్రియాశీలంగా వ్యవహరించాలని సూచిం చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్‌ఐఆర్ డీ హాస్టల్ లో వారం రోజులు ఉండి పంచాయతీరాజ్‌ వ్యవస్థ మీద శిక్షణ తీసుకున్నట్లు సీఎం గుర్తుచేసుకున్నారు.తాను ఇప్పుడు ఎలా శిక్షణ ఇచ్చానో, ఎంపీపీలకు జడ్పీ చైర్ పర్సన్లు అలా శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 60శాతం ప్రజలు పల్లెల్లో నివసిస్తున్నారని, గ్రామీణ తెలంగాణను బాగుచేయడానికి శక్తియుక్తులను ఉపయోగించాలని, బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని, జీవితాలను ధన్యం చేసుకోవాలని హితవు పలికారు.