బీజేపీ జెండా చూసి మోసపోతే గోసపడుతం

బీజేపీ జెండా చూసి మోసపోతే గోసపడుతం
  • ప్రధాన మంత్రే  ప్రధాన శత్రువు
  • బీజేపీ జెండా చూసి మోసపోతే గోసపడుతం: సీఎం కేసీఆర్
  • ప్రజలకు ఏం చేసిండో పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని చెప్పలే
  • నెత్తికో రుమాలుతో వేషం కట్టి.. గాలిమాటలు చెప్పిండు
  • చిల్లర మల్లర బీజేపీ గాళ్లు జెండాలతో నా బస్సుకు అడ్డం వచ్చిన్రు
  • దమ్ముంటే ఢిల్లీకి పోయి పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రంతో కొట్లాడాలె
  • వికారాబాద్‌‌ జిల్లాకు పాలమూరు‑–రంగారెడ్డి నీళ్లు తెస్తమని వెల్లడి
  • జిల్లా కలెక్టరేట్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీసులను ప్రారంభించిన సీఎం
  • మెడికల్‌‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన

గతంలో మోసపోయి.. పెరుగన్నం తినే రైతులు పురుగుల మందు తాగి సచ్చిపోయిండ్రు.. మన సమాజం అప్రమత్తంగా ఉండాలి. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎవలకు మేలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో సంక్షేమ పథకాలు ఇస్తే.. వాటిని రద్దు చేయాలని అంటున్నరు. బాయిలకాడ కరెంట్‌‌మీటర్లు పెట్టి రైతుల మెడ మీద కత్తి పెట్టి బిల్లులు వసూలు చేయాలని అంటున్నరు. బీజేపీ జెండాను చూసి మోసపోతే కరెంట్‌‌ బాయిలు, ట్రాన్స్‌‌ఫార్మర్ల కాడ మీటర్లు పెడుతరు. మనకు శఠగోపం పెట్టి పెద్దపెద్ద సావుకార్ల పొట్టలు నింపుతరు. ఈ జెండా, ఆ జెండా చూసి మోసపోతే మళ్ల పాత కథనే వస్తది. ఇయ్యాల గ్యాస్‌‌ సిలిండర్‌‌ ధర ఎంత? పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలు ఎంత? రైతులకు ఫ్రీ కరెంట్‌‌ ఇయ్యొద్దట. పెద్ద సావుకార్లకు రూ.20 లక్షల కోట్లు ఎన్‌‌పీఏల పేరుతోటి మాఫీలు చేస్తరట.. దీనికేనా కేసీఆర్‌‌ బస్సుకు బీజేపీ జెండాలు అడ్డం తెచ్చేది?

హైదరాబాద్‌‌, వెలుగు: దేశ ప్రధాన మంత్రే మనకు ప్రధాన శత్రువయ్యిండని టీఆర్‌‌ఎస్‌‌ అధినేత, సీఎం కేసీఆర్‌‌ మండిపడ్డారు. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వకపోగా అడుగడుగునా అడ్డం పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో ఎనిమిదేండ్లుగా అధికారంలో ఉన్నా దేశ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. మంగళవారం వికారాబాద్‌‌లో జిల్లా కలెక్టరేట్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీసులను కేసీఆర్‌‌ ప్రారంభించారు. మెడికల్‌‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనూ ప్రజలకు ఏం చేశారో ప్రధాని చెప్పలేదు. మిగిలిన రెండేండ్ల కోసం ఏమన్న చెప్తడేమోనని ఆశతోటి విన్న.. పసలేదు, గుంపులో గోవిందా.. నెత్తికో రుమాలుతో వేషం కట్టి.. గాలిమాటలు చెప్పిండు తప్ప ఆయన దేశానికి చేసిందేమైనా ఉందా. ప్రధాని ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలే.. దేశ ప్రగతి దిగజారుతున్నది.. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది.. ఈ ప్రభుత్వ పాలనలో రూపాయి విలువ పడిపోతున్నది.. గ్యాస్‌‌ సిలిండర్‌‌, పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరలు పెరిగినయ్‌‌.. ఇలాంటి దుర్మార్గులను తరిమికొట్టి అద్భుతమైన భారతదేశాన్ని తయారు చేసుకోవాలె” అని చెప్పారు. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగాలేకపోతే సాధించేదేమీ లేదని, కేంద్రంలోనూ రాష్ట్రాల సంక్షేమం చూసే ఉత్తమమైన ప్రభుత్వం రావాలని, దానికి మనం తయారు కావాలని అన్నారు. కేంద్రంలో ఇప్పుడున్న సర్కారును సాగనంపి ప్రజల ప్రభుత్వం తెచ్చే బాధ్యత తీసుకోవాలని, ఉజ్వల భారత నిర్మాణానికి కంకణ బద్ధులమవుదామని పిలుపునిచ్చారు.

చాలా కోల్పోతం

తాను వికారాబాద్‌‌కు వస్తుంటే కొందరు బీజేపీ జెండాలు పట్టుకొని అడ్డం పడ్డారని, ఆ జెండాలు చూసి మోసపోతే మళ్లీ గోస పడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘‘కేసీఆర్‌‌ ఏం తక్కువ చేసిండు వికారాబాద్‌‌కు? మూడెకరాలు ఉన్న రైతు ఇయ్యాల తెలంగాణలో కోటీశ్వరుడు కాదా? వికారాబాద్‌‌ జిల్లాలోని అన్ని  నియోజకవర్గాల నుంచి 500 మంది చొప్పున ఆడోళ్లు, మొగోళ్లను తీసుకెళ్లి కర్నాటకలో ఏం జరుగుతుందో చూపించండి.. అక్కడ బీజేపీ సర్కారే ఉన్నది.. మరి వాళ్ల లెక్కనే మనగతి కావాల్నా.. మంది మాటలు నమ్మి ఎటో పోతే ఏమో అయితది అన్నట్టుగా చాలా కోల్పోతాం. కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టు అయితది మన పరిస్థితి.. నేను చెప్పేది విని నవ్వుడు కాదు సీరియస్‌‌గా ఆలోచించాలె’’ అని సీఎం హెచ్చరించారు. 

‘‘చిల్లర మల్లర బీజేపీగాళ్లు జెండాలు పట్టుకొని నా బస్సుకు అడ్డం వచ్చిండ్రు.. మనం గిన కొడితే వాళ్లు తుక్కుతుక్కు అయితరు’’ అని అన్నారు. స్వార్థ రాజకీయాలకు తెలంగాణ బలికాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఊరికే రాలేదని, 14 ఏళ్లు పోరాటం చేశానని, చావు అంచుల దాకా వెళ్లి రాష్ట్రాన్ని సాధించానని చెప్పారు.ఆనాడు మనల్ని చూసి నవ్వినోళ్లు ఇప్పుడు అడ్డంపొడుగు మాట్లాడుతున్నారని, ఆ గుంటనక్కలు వచ్చి మళ్లీ పీక్కుతినకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో అనేక సంక్షేమ స్కీంలు అమలు చేస్తున్నామన్నారు. తాను కలలుగన్న బంగారు తెలం గాణ సాకారం అవుతుందని అన్నారు. 33 జిల్లాలకు మెడికల్‌‌ కాలేజీలిస్తున్నామని, అమెరికా, లండన్‌‌తో మన పిల్లలు పోటీపడే స్థాయి రావాలన్నారు.

నీళ్లు తీసుకొస్త

వికారాబాద్‌‌, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో కృష్ణా నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు. రెండు పార్టీల నేతలే కోర్టుల్లో కేసులు వేసి ఆ ప్రాజెక్టు పనులు ఆపించారని ఆరోపించారు. ‘‘కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చమని ఎనిమిదేండ్లలో వంద దరఖాస్తులు ఇచ్చిన. నా బస్సుకు జెండా అడ్డం పట్టుకొని వచ్చినోడే తేల్చలే. ఆ పార్టీ వికారాబాద్‌‌ జిల్లా అధ్యక్షుడో.. ఇంకో సన్నాసికో దమ్ముంటే ఢిల్లీకి పోయి వాళ్ల కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువ దద్దమ్మ పని వల్ల మా ప్రాజెక్టు ఆలస్యమైతుందని కొట్లాడాలె.. నరేంద్ర మోడీని చూడంగనే లాగు తడిసిపోతది.. మీరు తెలంగాణ ప్రజలు కాదా.. మీరు జెండాలు పట్టుకొని తిరుగుతరు.. మీ ప్రధాని మన వాటా తేల్చరు.. కాలికి వేస్తే వేలికి.. వేలికి వేస్తే కాలికి వేస్తూ ఆలస్యం చేస్తరు’’ అని మండిపడ్డారు.

తెలంగాణ రాకుంటే వికారాబాద్‌‌ జిల్లా అయ్యేదా

తెలంగాణ ఉద్యమంలో తాను ఈ ప్రాంతాలను సందర్శించినపుడు రంగారెడ్డి జిల్లా ఆఫీసులను వికారాబాద్‌‌లో పెట్టాలని ప్రజలు కోరేవారని సీఎం అన్నారు. తెలంగాణ వస్తే వికారాబాద్‌‌నే జిల్లా చేసుకుందామని అప్పుడు చెప్పానని, ఇప్పుడు వికారాబాద్‌‌ ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్‌‌ కాంప్లెక్స్‌‌ ప్రారంభించుకున్నామని అన్నారు. ‘‘అనంతగిరి కొండల్లోని గాలి ఆరోగ్యానికి మంచి చేస్తది.. ‘వికారాబాద్‌‌కా హవా.. లాకో మరీజోంకా దవా’ అని పేరుంది. తెలంగాణ రాకుంటే వికారాబాద్‌‌ జిల్లా అయ్యేదా. మెడికల్‌‌, డిగ్రీ కాలేజీలు వచ్చేవా అని అందరూ ఆలోచించాలి. రాష్ట్రం రాకముందు తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు చర్చించాలె.. ఆలోచించాలె.. దాని ప్రకారమే ఎన్నికల్లో నిర్ణయాలు తీసుకోవాలి” అని కోరారు. ‘‘సమైక్య పాలనలో తెలంగాణ భయంకరమైన ఇబ్బందులు పడ్డది. పిల్లలు చాలా మంది చనిపోయినా ఉద్యమం గెలువలే.. సమైక్య శక్తులే గెలిచినై.. తమ భూముల ధరలు పడిపోతయని, సమైక్య పాలకుల పంచన చేరిన లీడర్లు తెలంగాణను వ్యతిరేకించేది. ఇప్పుడు రంగారెడ్డి, మేడ్చల్‌‌, వికారాబాద్‌‌ జిల్లాల్లోని భూములకే ఎక్కువ ధరలు ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చినపుడు రకరకాల వాళ్లు వస్తుంటారు.. అందరూ ఆలోచించాలే.. దేశంలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్‌‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే.. ఇప్పుడు 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం.. కొత్తగా 57 ఏండ్లు నిండినోళ్లకు 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నాం’’ అని తెలిపారు.

దుష్టశక్తులకు బుద్ధి చెప్పాలి

తాండూరు పక్కనే ఉన్న రాయచూర్‌‌ జిల్లా ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్‌‌ చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. గతంలో పది, ఇరవై ఎకరాలున్న రైతులు హైదరాబాద్‌‌ కు వచ్చి కూలీ చేసేవారని, ఇప్పుడు పల్లె సీమలన్నీ పచ్చటి పంటలతో అలరారుతున్నాయని అన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్‌‌, ప్రాజెక్టుల నీళ్లు ఇస్తున్నామని, భవిష్యత్‌‌లో ఇంకా చేసుకునేవి చాలా ఉన్నాయన్నారు. ‘‘రైతు యాక్సిడెంట్‌‌లో చనిపోతే ఆపద్బంధు అని రూ.50 వేలు ఇచ్చేవాళ్లు. వాటిలో మేసేటోళ్లు మేసి.. మిగిలినవి బాధిత కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టేవాళ్లు. ఇప్పుడు గుంట భూమి ఉన్న రైతు ఏ కారణంతో చనిపోయినా వారం రోజుల్లోనే రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్నాం. రైతుబీమా ఉండాల్నా లేదా అన్నది ఇక్కడున్న ప్రజలే చెప్పాలి. ఈ స్కీంలన్నీ ఇలాగే కొనసాగాలి. తెలంగాణ ఇంకా అద్భుతంగా ముందుకు పోవాలి” అని అన్నారు. తాను చెప్పినవి విని జోష్‌‌గా కేసీఆర్‌‌ జిందాబాద్‌‌ అని కొట్టుడు కాదని, దేశంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయాలన్నారు. వికారాబాద్‌‌ ప్రజలు చైతన్యవంతులని, దుష్టశక్తులకు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌‌‌‌ను అడ్డుకునేందుకు బీజేపీ నేతల ప్రయత్నం

వికారాబాద్/ చేవెళ్ల / పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పర్యటనలో కేసీఆర్‌‌‌‌ను అడ్డుకునేందుకు బీజేపీ లీడర్లు ప్రయత్నించారు. డీఎస్పీ కార్యాలయం ముందు సీఎం కాన్వాయి వెళ్తుండగా నినా దాలు చేస్తూ అక్కడికి వెళ్లారు. ‘ముఖ్యమంత్రి డౌన్ డౌన్’.. ‘బీజేపీపై దాడులను ఆపాలి’, ‘ఇచ్చిన హామీలను నెరవేర్చాలి’ అంటూ నినాదాలు చేశా రు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీఎం కాన్వాయ్ ముందుకు వెళ్లిపోయింది. మరోవైపు ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా కళాబృందం వేదిక కూలిపోయింది. దీంతో ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సీఎం కేసీఆర్ సభలోకి ప్రవేశించగానే అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకొని వేదికపైకి వచ్చే ప్రయత్నం చేశారు. ఇక కేసీఆర్ మాట్లాడుతుండగానే మహిళలు లేచి వెళ్లిపోవడంతో చాలా చోట్ల కూర్చీలు ఖాళీ అయ్యాయి.

ముందస్తు అరెస్టులు

సీఎం కేసీఆర్ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీజేపీ నేతలు చంద్రశేఖర్, సదానంద్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా, మండల స్థాయి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మండలాల వారీగా కాంగ్రెస్ కీలక నేతలను కూడా అరెస్టు చేశారు. సుమారు 300 మందిని అదుపులోకి తీసుకుని, మంగళవారం సీఎం పర్యటన ముగిసిన తర్వాత విడిచిపెట్టారు.