
రాష్ట్రంలో కరువు పరిస్థితి నెలకొని ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ. రైతాంగ సమస్యలపై సెక్రటేరియట్ లో సీఎస్ జోషీని కలిశారు దత్తాత్రేయ. మీడియాతో మాట్లాడిన ఆయన… సూర్యా పేట్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో వర్షపాతం తక్కువగా ఉండి పంటలు వేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. పాత బాకీ కడితేనే కొత్త అప్పులు ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని అన్నారు.
25లక్షల రైతుల డేటాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపకపోవడం వల్లే కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు అందడం లేదని చెప్పారు దత్తాత్రేయ. ఇదిలావుంటే… కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు ధనం కూడా కొంతమంది రైతులకు అందలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులవిషయంలో కేర్ లెస్ గా వ్వవహరిస్తుందని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుల విషయంలో కుంభకర్ణ నిద్ర పోతుందని అన్నారు బండారు దత్తాత్రేయ. రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సహాయం కావాలంటే తాము చేయడానికి రెడీ అని.. నివేధిక ఇస్తే కేంద్రంనుంచి తాము నిధులను రప్పిస్తామని ఆయన అన్నారు. రైతాంగానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. రాష్రం నుంచి రైతుల పరిస్థితిపై కేంద్రంకు రిపోర్ట్ పంపడం లేదని.. రిపోర్ట్ ఇవ్వకుండా.. కేంద్రం ఎలా స్పందిస్తుందని దత్తాత్రేయ ప్రశ్నించారు.