
చివరికి దిల్‌కుషా గెస్ట్ హౌస్ కూడా హెరిటేజ్ అంటే ఎట్లా?: సీఎం కేసీఆర్ ప్రశ్న
ఏది ఎంతవరకు ఉండాల్నో ఆ లిమిట్స్‌లో ఉంటేనే గౌరవం
అతికి పోయి చేస్తే పద్ధతి కాదు
నిపుణుల కమిటీ వేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హెరిటేజ్ అనేది ఒక జోక్‌గా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు వ్యక్తుల ఇండ్లు, గెస్ట్‌హౌజ్‌లను కూడా హెరిటేజ్ జాబితాలో చేర్చారని, చివరకు దిల్‌కుషా గెస్ట్ హౌజ్‌ను కూడా హెరిటేజ్ అంటే ఎట్లా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో గురువారం ఉస్మానియా దవాఖాన హెరిటేజ్ బిల్డింగ్ అంశాన్ని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ లేవనెత్తారు. హెరిటేజ్ భవనాన్ని కాపాడాలని కోరారు.
దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘హెరిటేజ్‌ని, కల్చర్‌ను గౌరవిస్తున్నం. వాటిని గౌరవిస్తూనే అధునాత సమాజం అవసరాలు తీరాలె. అయితే ఏది ఎంతవరకు ఉండాలో ఆ లిమిట్స్‌లో ఉంటేనే దానికి గౌరవం, దానికి మర్యాద, దాని ప్రతిష్ట ఉంటది. ఏది కూడా అతికి పోయి మనం చేస్తే పద్ధతి కాదు” అన్నారు. తెలంగాణ వారసత్వ సంపదను కాపాడుకునేందుకు కొత్త చట్టం తీసుకొచ్చామని చెప్పారు. కొందరు దాన్ని జీవో అనుకుంటున్నారని, అది జీవో కాదని, యాక్ట్ అని స్పష్టం చేశారు. హెరిటేజ్‌పై నిపుణుల కమిటీని వేస్తున్నామని చెప్పారు. ‘‘ఏదాన్ని పరిరక్షించాల్నో వాటిని కాపాడతాం.. ఏవి అప్రధానమైనవో వాటిని తీసేస్తం. నిపుణుల కమిటీ అన్నీ చర్చిస్తది” అని పేర్కొన్నారు. ఉస్మానియా దవాఖాన భవనానికి గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉందని, దాన్ని తప్పకుండా కాపాడతామన్నారు. అయితే, అదే ప్లేస్‌లో హాస్పిటల్ కట్టాలన్న డిమాండ్ కూడా ఉందని, అంశంపై హైకోర్టులోనూ చర్చ నడుస్తోందని సీఎం తెలిపారు.
క్రమపద్ధతిలో అభివృద్ధికి కొత్త మున్సిపల్ చట్టం
క్రమ పద్ధతిలో అభివృద్ధి జరిగేలా కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త మున్సిపల్ చట్ట బిల్లును ఆయన సభలో ప్రవేశపెడుతూ మాట్లాడారు. ఇప్పటికే అనేక పాలన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రజల సౌకర్యం, సంక్షేమాన్ని కాంక్షించి పదిగా ఉన్న తెలంగాణ జిల్లాలను 33 చేశామని, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీ పెంచామని తెలిపారు. ‘‘ఈ మధ్యనే పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా పూర్తయినయ్. నూతనంగా ఎన్నికైన యువకులు ప్రజా సేవ కోసం ఉర్రూతలూగుతున్నరు. వాళ్లంతా కొత్త చట్టాలు, కొత్త గెలుపుతో ముందుకుపోతరు’’ అని అన్నారు. గతంలో కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు.. ఏదైనా సరే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసేవాళ్లని, ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలన్నా శాసనసభ ఆమోదించాల్సిందేనని పేర్కొన్నారు.
నల్లజెండాలతో కాంగ్రెస్ నిరసన
ఎమ్మెల్యేల ఫిరాయింపునకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు గురువారం నల్లజెండాలతో సభకు హాజరయ్యారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. బిల్లులపై చర్చ సందర్భంగా ఫిరాయింపుల అంశాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తారు.
దివంగత నేతలకు సంతాపం.. బిల్లులకు ఆమోదం
రెండురోజుల పాటు జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సుమారు రెండున్నర గంటలపాటు సభ నడిచింది. సభ ప్రారంభమవగానే విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సభ తరఫున స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బర్త్‌డే విషెస్ తెలిపారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలిపింది. స్పీకర్ సహా సభ్యులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరీంనగర్ జిల్లా ఇందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొమ్మా వెంకటేశ్వర్, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారా రాణి, 1995 నుంచి 2003 వరకూ నామినేటెడ్(ఆంగ్లో ఇండియన్) ఎమ్మెల్యేగా పనిచేసిన డెల్లా గాడ్ ఫ్రే, గద్వాల నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన గట్టు భీముడు, కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఎ.కృష్ణమమూర్తి ఇటీవల మరణించారు. వీరందరికీ సభ తరపున స్పీకర్ సంతాపం ప్రకటించారు. ఆ నేతలు చేసిన సేవలను స్పీకర్ గుర్తుచేసుకున్నారు. అనంతరం, సీఎం కేసీఆర్ తెలంగాణ మున్సిపాలిటీస్ బిల్-2019ను సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభ ఎజెండాను శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు. సభలో ప్రవేశపెట్టనున్నా బిల్లుల జాబితాను ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ చట్టం సవరణ బిల్లు, తెలంగాణ రుణ విమోచన కమిషన్ చట్ట సవరణ బిల్లులను సీఎం కేసీఆర్, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు సైతం ఈ బిల్లులకు ఆమోదం తెలిపాయి. అనంతరం స్పీకర్ సభను శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. మున్సిపల్ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చించనున్నారు.