సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తం  

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తం  

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి 2గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇన్‌‌‌‌చార్జ్ గా పని చేయాలని సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశించారు. తెలం గాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభ వేడు కలు ముగిసిన వెంటనే తమ సెగ్మెంట్స్​లోని 15 మంది ముఖ్య నేతలను తీసుకొని ఎమ్మెల్యేలు మునుగోడుకు వెళ్లాలని సూచించారు. ఉప ఎన్నిక పూర్తయ్యే దాకా ఆయా గ్రామాల్లోనే ఉండి, స్థానిక లీడర్లతో కలిసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ‘‘మునుగోడులో అన్ని సర్వేల్లో మనమే ముందున్నాం. రెండో స్థానంలో ఉండేది కాంగ్రెస్‌‌‌‌ పార్టీనే. బీజేపీ మూ డో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది” అని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ఇందులో మునుగోడు ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ స్కీంలపైనే ఎక్కువగా ఫోకస్‌‌‌‌ చేశారు. కాగా, కరోనాతో హోమ్ ఐసోలేషన్‌‌‌‌లో ఉన్న కేటీఆర్‌‌‌‌ సమావేశానికి దూరంగా ఉన్నారు.

ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండాలె... 

మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని, మన రాష్ట్రంలోనూ అలాంటి ప్రయ త్నాలే చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఢిల్లీ, జార్ఖండ్‌‌‌‌లోనూ ప్రభుత్వాలను కూల్చేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ‘‘ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలనూ వేధించే చాన్స్​ ఉంది. ఎవరూ భయపడొద్దు. అందరికీ అండగా ఉంటాను. ఈడీ బోడీ, సీబీఐలకు భయపడేది లేదు. ప్రభుత్వం ఎలాంటి అవినీతి చేయ లేదు. మోడీ సర్కారు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజల్లో మత పిచ్చి లేపాలని చూస్తోంది. మనల్ని ఓడించే సత్తా బీజేపీకి లేదు. ఆ పార్టీకి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోకపోవడంతోనే బీజేపీ రెచ్చిపోతోంది. ప్రతి సెగ్మెంట్​లో ఎంత మం దికి ఏయే స్కీంలో లబ్ధి జరిగిందనే వివరాలు అందజేస్తాం. వారందరినీ కలిసి ఆయా పథకాలపై ప్రచా రం చేయాలి. ఎమ్మెల్యేలకు క్యాడర్‌‌‌‌తో ఉన్న గ్యాప్‌‌‌‌ పూడ్చుకోవాలి. ఇందుకోసం కార్యకర్తలతో కలిసి వనభోజనాలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌‌‌‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకొని నియోజకవర్గాల్లో ప్రజల మధ్యే ఎక్కువగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. 

జాతీయ రాజకీయాల్లోకి పోవుడే... 

రాష్ట్రంలో మూడోసారి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వమే రాబోతోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికిప్పు డు ఎన్నికలు జరిగితే 72 నుంచి 80 సీట్లలో గెలుస్తాం. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కష్టపడితే 90 వరకు సీట్లు గెలిచే ఆస్కారముంది. సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తాం. ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత నాదే. ఎవరైనా ఈ వాతావరణాన్ని చెడగొట్టుకుంటే నేనేమీ చేయలేను. దళితబంధు విప్లవాత్మకమైన పథకం. దీనిపై ప్రజల్లో ఎక్కువ అవగాహన కల్పించాలి. ఇటీవల నన్ను కలిసిన జాతీయ రైతు నేతల్లో యూపీకి చెందిన దళిత నాయకుడు కూడా ఉన్నారు. ఈ స్కీమ్ గురించి తెలుసుకొని తమకూ అలాంటి స్కీం ఉంటే బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ సహా అనేక స్కీంలను దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారు. త్వరలోనే జాతీయ స్థాయి దళిత నేతలతో దళిత సమ్మేళనం నిర్వహిస్తాం. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయం. నేను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను స్థాపించిన రోజు.. కొందరు నాయకులను ఎమ్మెల్యేలు అయి కార్లలో అసెంబ్లీకి వస్తారని చెప్తే అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు నిజమైంది. అలాగే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మీటింగ్‌‌‌‌లో ఉన్న వారిలోంచే కేంద్ర మంత్రులు, గవర్నర్లు, వివిధ దేశా ల అంబాసిడర్లు అవుతారు. దీన్ని జోక్‌‌‌‌గా తీసుకోవద్దు. జరిగి తీరుతుంది” అని అన్నారు.  

నియోజకవర్గానికి 3వేల ఇండ్లు 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌ తన స్థాయిని తగ్గించుకునేలా రేషన్‌‌‌‌ షాపుల్లో ఫొటోల గురించి మాట్లాడారని కేసీఆర్ మండిపడ్డారు. ఈ నెల 6న అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తామని.. నిమజ్జనం తర్వాత 12, 13 తేదీల్లో సభ జరిగే అవకాశముందని చెప్పారు. సభ ఎన్నిరోజులు నిర్వహించేది బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో 500 దళితబంధు యూనిట్లు ఇస్తామని, డిసెంబర్‌‌‌‌లోగా లబ్ధిదారులకు ఈ యూనిట్లు అందేలా ఎమ్మెల్యేలు లిస్టులు ప్రిపేర్‌‌‌‌ చేసుకోవాలని సూచించారు. దసరాకు సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఇస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని, విమర్శలకు తావివ్వొద్దని సూచించారు.