యాదాద్రి, వెలుగు: కందుల కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు ఆదేశించారు. కందుల కొనుగోలుపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు. ఫిబ్రవరి 1న జిల్లాలో కందుల కొనుగోలు ప్రారంభించాలని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణ, తేమ, తూకం, నాణ్యత పరిశీలనలో పారదర్శకత పాటించాలన్నారు. జిల్లాలో 4,400 ఎకరాలు కంది పంట సాగయిందని తెలిపారు. సుమారు 25 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు.
కందులకు క్వింటాల్‌కు రూ. 8 వేలు మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. 12 శాతం తేమ మించకుండా ఉండే విధంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మీటింగ్‌లో వ్యవసాయ అధికారి రమణారెడ్డి, మార్క్‌ఫెడ్ ఆఫీసర్ జ్యోతి, డీసీవో మురళి ఉన్నారు.
