యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించే భూముల ఓనర్లకు పరిహారం అందుతోంది. గడిచిన మూడు నెలల్లో రెండు విడతల్లో పరిహారం అందింది. తాజాగా మూడో విడత పరిహారం నిర్వాసితుల అకౌంట్లలో సోమవారం జమ అయింది. భూసేకరణ నోటిఫికేషన్‌ను 2022లో జారీ చేశారు. జిల్లాలోని ఐదు మండలల్లోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రోడ్డుకు 1795 ఎకరాల భూమిని సేకరించడానికి జిల్లాలో తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్ 'కాలా'లను ఏర్పాటు చేసి, వీటికి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు.
మూడో విడతలో రూ. 22 కోట్లు
సర్వే ప్రకారం చౌటుప్పల్ పరిధిలోని 900 మంది, తుర్కపల్లి కాలా పరిధిలోని 1589 మంది కలిపి 2489 మంది భూములు కోల్పోతున్నారు. వీరిలో సగానికి పై గా నిర్వాసితుల డిటైల్స్‌ను భూమి రాశి పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. పోర్టల్‌లో అప్లోడ్ అయిన డిటైల్స్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ, జీఎం వేర్వేరుగా పరిశీలించిన అనంతరం తుర్కపల్లి కాలా పరిధిలోని నిర్వాసితులకు పరిహారం విడుదల చేస్తోంది.
ఇప్పటికే రెండుమార్లు విడుదల చేయగా తాజాగా దాతరుపల్లి, వీరారెడ్డి పల్లి గ్రామాల రైతులు 221 మందికి చెందిన 94 ఎకరాలకు సంబంధించి రూ. 22 కోట్ల పరిహారం రిలీజ్ చేశారు. ఈ అమౌంట్‌ను భూములు కోల్పోతున్న వారి అకౌంట్లలో సోమవారం పరిహారం జమ చేశారు. కాగా తొలివిడతలో నవంబర్ 2025లో 49 మందికి రూ. 2.03 కోట్లు జమ చేసింది. డిసెంబర్ 2025లో 251 మంది అకౌంట్లలో రూ. 24 కోట్లు జమ చేశారు. చౌటుప్పల్ కాలా పరిధిలోని వలిగొండ మండలం పహిల్వాన్‌పురం 28 మంది రైతులకు చెందిన 12.15 ఎకరాలకు రూ 2.44 కోట్లు పరిహారం రిలీజ్ చేశారు.
తుర్కపల్లిలో సర్వేపూర్తి
తుర్కపల్లి 'కాలా' పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూ సర్వేతో పాటు బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్టక్చర్ ఎంక్వైరీ కూడా ముగిసింది. చౌటుప్పల్ పరిధిలో కొంతమేర జరగగా భువనగిరి 'కాలా' పరిధిలోని రైతులు తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఆందోళనలు నిర్వహించడం, సర్వేను అడ్డుకోవడంతో ఆగిపోయింది. కాగా తుర్కపల్లి కాలా పరిధిలో విడతల వారీగా పరిహారం విడుదల చేస్తోంది.
