రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పైసా కూడా పక్కదారి పట్టొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పనులు నామమాత్రంగా చేసి, నిధులు కాజేసే పద్ధతి పోవాలని, ప్రతి పైసా సద్వినియోగం కావాలని చెప్పారు. ప్రస్తుతం గ్రామాల్లో వివిధ పథకాల కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 20 బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో హరితహారానికి, శ్మశాన వాటికల నిర్మాణానికి అధికప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు.
ఫుల్లు నిధులు
పంచాయతీల అభివృద్ధికి నిధులు సమృద్ధిగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నినిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తం నిధులను కేటాయిస్తుందన్నారు. ఉపాధి హామీ నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. పంచాయతీల ఆధ్వర్యంలోనే ఉపాధి హామీ పనులు జరగాలని, గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించడానికి ఉపయోగపడాలని చెప్పారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని, ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. ఇందుకోసం ఉపాధి నిధులు వినియోగించుకోవాలన్నారు. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని చెప్పారు .
శుభ్రంగా ఉంచండి
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇది గ్రామ పంచాయతీల బాధ్యత అన్నారు. ఊర్లో ఉన్న పాడుపడిన, వాడని బావులను పూడ్చేయాలని, మురికి చెట్లను, కూలిన ఇండ్ల శిథిలాలను, చెత్తాచెదారాన్ని తొలగించాలని చెప్పారు . రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.
ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉండాలని కేసీఆర్ చెప్పారు. వైకుంఠధామాల పేరిట వాటిని ఏర్పాటు చేయాలన్నారు. మూడు వేలలోపు జనాభా కలిగిన 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున, మూడు వేలకు పైగా జనాభా ఉన్న 1,300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. వాటిని కచ్చితంగా ఆరునెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలా లు సమకూర్చాలని, దాతల నుంచి స్వీకరించాలని సూచించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని చెప్పారు . ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎంపీలు బి.వినోద్ కుమార్, బండా ప్రకాశ్, ఎమ్మెల్యే లు ఈటల రాజేదర్, డీఎస్ రెడ్ యానాయక్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు.
