మునుగోడులో నన్ను ఆగం చేయకున్రి

మునుగోడులో నన్ను ఆగం చేయకున్రి

మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. బతుకు దెరువు ఎన్నిక అని కేసీఆర్ అన్నారు. మునుగోడులో బీజేపీకి ఓటు పడితే బాయికాడ మీటర్ పడ్తదని అన్నారు. మీటర్లు పెట్టే మోడీ కావాలో లేక మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు.  మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలంతా కలిసి బీజేపీకి మీటర్ పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే బీజేపీతో పోరాడుతున్నానని, తాను బలహీనపడితే మోడీపై ఎట్లా కొట్లాడాలని ప్రశ్నించారు. తెలంగాణకు కొట్లాడటం కొత్త కాదన్న ముఖ్యమంత్రి యాడ దాకైనా కొట్లాడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని, ఎవరి సంక్షేమం కోసం ఉప ఎన్నిక వచ్చిందన్న విషయాన్ని జనం గ్రహించాలని కోరారు.

కృష్ణా జలాల్లో వాటా తేల్చండి..
బీజేపీని గద్దె దించేందుకు క్రియాశీల, ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 8 ఏండ్లలో బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం జరగనున్న బీజేపీ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం  ప్రజలకు మేలు చేయకపోగా.. ప్రభుత్వ సంస్థల్ని అమ్ముతున్నరని మండిపడ్డారు. 

మీటర్ల వెనుక కుట్ర
మోటర్లకు మీటర్లు పెట్టాలనడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేసీఆర్ ఆరోపించారు. పేదలను దోచి పెద్దలకు పంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతోందని అన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు మీటర్లు పెట్టడని సీఎం స్పష్టం చేశారు. ఈడీ బోడీ అంటూ కేంద్రం భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్న ఆయన.. ఈడీ వస్తే దొంగలు భయపడుతారని అన్నారు.  మోడీని అతని అహంకారమే పడగొడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్పారు.

సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం
బీజేపీ సర్కారు దోపిడీదారులను, బ్యాంకులను వేల కోట్లు ముంచేటోళ్లను బలపరుస్తోందని కేసీఆర్ విమర్శించారు. మునుగోడు రైతులు ఓటు వేసే ముందు బోరుకాడికి పోయి దానికి దండం పెట్టాలని అన్నారు. జనం ఎవరి చేతిలో కత్తిపెడితే మంచిదో వాళ్ల చేతిలోనే పెట్టాలని కోరారు. తెలంగాణ వస్తే నల్లగొండలో ఫ్లోరైడ్ బాధ పోతుందని, 24 గంటల కరెంటు ఇస్తామన్న  మాట నిలబెట్టుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఆదుకొని రాష్ట్రాన్ని ఒక తొవ్వకు తెచ్చేందుకు పాటు పడుతున్నామని కేసీఆర్ వివరించారు. 

అనూహ్య ఫలితం రావాలె
పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని తరిమికొడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక 3,500  తండాలను పంచాయితీలుగా మార్చినట్లు చెప్పారు. అలవోకగా ఓటు వేస్తే బతుకు ఆగమైతయని హెచ్చరించిన కేసీఆర్.. మునుగోడు నుంచి అనూహ్య ఫలితం రావాలని ఆకాంక్షించారు. దేశమంతా ఏమనుకుంటుందనే విషయం మునుగోడు గడ్డ నుంచి ఢిల్లీ దాకా తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్‌కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్టే.. 

‘‘కాంగ్రెస్‌కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్టే.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది వృధా అవుతుంది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ముందు మునుగోడులో ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నో బాధలుపడిందని గుర్తు చేశారు. అయినా ఏ నాయకుడు పట్టించుకోలేదని, నల్లగొండ నో మ్యాన్ జోన్ గా మారుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం హెచ్చరించిందని  చెప్పారు. అందరి పోరాట ఫలితంగా మునుగోడును నేడు ఫ్లోరైడ్ రహితంగా మార్చుకున్నామని అన్నారు. బీజేపీపై పోరాటానికి ఐదారు నెలలుగా చర్చిస్తున్నామన్న కేసీఆర్.. వామపక్షాలను కోరగానే మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ బంధం మునుగోడు ఉప ఎన్నికకే పరిమితం కాదని.. సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్లు భవిష్యత్తులోనూ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు.