అన్నా భావు సాఠేకు భారతరత్న ఇయ్యాలి: సీఎం కేసీఆర్

అన్నా భావు సాఠేకు భారతరత్న ఇయ్యాలి: సీఎం కేసీఆర్
  • ఆయనను రష్యా గుర్తించినా మన దేశం గుర్తించలే   
  • మాతంగి సమాజానికి బీఆర్ఎస్ అండగా ఉంటది
  • సాఠే 103వ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: అన్నా భావు సాఠే దేశం గర్వించదగ్గ ప్రజాకవి అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర సాంగ్లి జిల్లాలోని సాఠే సొంతూరు వాటేగావ్​లో మంగళవారం నిర్వహించిన అన్నా భావు 103వ జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గొని, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నా భావు ప్రముఖ మాతంగి దళిత కవి అని, ఆయనకు దేశ పాలకులు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళిత బిడ్డ,  దేశ మూలవాసి మాతంగి సమాజ ముద్దుబిడ్డను కేంద్రం గుర్తించాలని డిమాండ్ చేశారు. సాఠే రచనలు, సాహిత్యం, అణగారిన వర్గాల కోసం ఆయన పోరాటం చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. కమ్యూనిస్టుగా, అంబేద్కరిస్టుగా నిరంతరం సమసమాజ స్థాపన కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. రష్యాలాంటి దేశం సాఠేను గుర్తించి ఆ దేశ ప్రధాని పిలిపించుకుని సన్మానించారని కేసీఆర్ చెప్పారు. 

రష్యా లైబ్రరీలో సాఠే విగ్రహం ఉందని, ఆయనను ఇండియన్ మాక్సిమ్ గోర్కీగా పిలుస్తారన్నారు. సాఠేను భారత పాలకులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. సాఠే త్యాగాలను ఇప్పటికైనా మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ఆయన రచనలను దేశంలోని అన్ని భాషల్లోకి అనువదించాలన్నారు. మాతంగి సమాజానికి మహారాష్ట్ర పార్టీలు రాజకీయంగా సరైన గుర్తింపునివ్వలేదని, చట్టసభల్లో భాగస్వామ్యం కల్పించలేదన్నారు. బీఆర్ఎస్​పార్టీ మాతంగి సమాజానికి సంపూర్ణ మద్దతునిస్తుందని, రాజకీయంగా అండగా నిలుస్తుందన్నారు.