టీఆర్ఎస్ నేతల హడావుడి.. ట్రాఫిక్‌‌లో చిక్కుకున్న అంబులెన్స్

టీఆర్ఎస్ నేతల హడావుడి.. ట్రాఫిక్‌‌లో చిక్కుకున్న అంబులెన్స్

సీఎం కేసీఆర్ మునుగోడు పర్యటన జనాలకు చుక్కలు చూపించింది. భారీగా ట్రాఫిక్ జాం, పోలీసుల ఓవరాక్షన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గాన బయలుదేరడంతో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేశారు. సిటీలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. దీంతో వాహనదారులు నరకం చూశారు. ఆర్టీసీ బస్సులు అరగంటకుపైగా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న చిన్నారుల ఏడుపు ఆపడం ఎవరితరం కాలేదు.

పోలీసుల ఓవరాక్షన్
సీఎం కాన్వాయ్ ఎల్బీనగర్ కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు నుంచే ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్ మొదలైంది. వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. నాగోల్, ఎల్ బీనగర్ నుంచి  సాగర్ రింగ్ రోడ్డు వరకు అటు విజయావాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ అంబులెన్స్ అందులో చిక్కుకుపోయినా పోలీసులు పట్టించుకోలేదు. అంబులెన్స్లో ఉన్న వారి బాధ చూడలేక వాహనదారులే రంగంలోకి దిగి ఎలాగోలా అంబులెన్స్కు దారిచ్చి పంపారు. ఇష్టానుసారంగా ట్రాఫిక్ ను నిలిపేయడంతో జనాలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ట్రాఫిక్ జాం కారణంగా పీజీ ఎంట్రన్స్ రాసే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఎల్ బీ నగర్ ప్రాంతంలోని iON Digital Zone, iDZ  సెంటర్ల అభ్యర్థులు ప్రవేశపరీక్షకు వెళ్లే దారిలేక అవస్థ పడ్డారు. 

గంటల తరబడి నరకం
సీఎం కాన్వాయ్ హైదరాబాద్ దాటి వెళ్లిపోయినా సిటీలో మాత్రం వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో అది క్లియర్ అయ్యేందుకు చాలా సమయం పట్టింది. ఒకవైపు ఎండ మరోవైపు ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో జనం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజల గురించి పట్టించుకోకుండా సీఎం భారీ కాన్వాయ్తో వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు మార్గానికి బదులు హెలికాప్టర్లో వెళ్ళొచ్చు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హంగూ ఆర్బాటం కోసం సాధారణ జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకని నిలదీశారు.

ఉప్పల్లో తప్పని తిప్పలు
ఇటు ఉప్పల్ - వరంగల్ హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సీఎం కాన్వాయ్ వస్తుందని ఉప్పల్ సర్కిల్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆపేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా పంపకుండా ఎలా ఆపుతారని పోలీసులను ప్రశ్నించారు.