దళిత బంధు వంద శాతం అమలు చేస్తాం

దళిత బంధు వంద శాతం అమలు చేస్తాం

దళితబంధును వందశాతం అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్ ఓటమి తర్వాత తొలిసారి ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజలు టీఆర్‌‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నట్టేనా అని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఎన్నికతో పోయేదేం లేదన్నారు. దేశంలో 30 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే చాలా చోట్ల బీజేపీనే ఓడిపోయిందని, అంటే బీజేపీపై దేశ ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారనా అర్థం అని కేసీఆర్ నిలదీశారు. దళితబంధుపై విపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పనుల్ని సహించేందిలేదని హెచ్చరించారు. తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఏడేళ్లలో కేంద్రం చేసిన మంచిపని ఉందా అని ప్రశ్నించారు. అట్రాసిటీ చట్టాలపై గౌరవం లేకుండా బీజేపీ  నేతలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. బావోద్వేగాలు రెచ్చగొట్టి గెలవడం తప్ప బీజేపీ ఏం చేసిందన్నారు.  ప్రభుత్వ సంస్థల్ని ఎందుకు ప్రైవేటు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి బావి దగ్గర కరెంట్ మీటర్ పెట్టాలని కేంద్రం చెబుతోందన్నారు.