మీటింగ్ ​ముచ్చట్లు బయట చెప్పొద్దు: కేసీఆర్

మీటింగ్ ​ముచ్చట్లు బయట చెప్పొద్దు: కేసీఆర్
  • 8.30 గంటల పాటు జరిగిన సమావేశం
  • రెవెన్యూ చట్టంపైనే ఎక్కువగా చర్చ
  • కలెక్టర్ల నుంచి సీఎం అభిప్రాయ సేకరణ
  • చట్టంలో ఏముంటుందో హింట్ఇచ్చిన సీఎం
  • 60 రోజుల మున్సిపల్‌, పంచాయతీ ప్లాన్పైనా చర్చ

నేడూ కొనసాగనున్న కలెక్టర్ల మీటింగ్‌కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్‌‌  ప్రగతి భవన్‌‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమీక్షించారు. మంగళవారం ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌‌లో రెవెన్యూ చట్టంలో ఉండబోయే ప్రధానాంశాలను వివరించారు. జిల్లా రెవెన్యూ బాస్‌‌లుగా ఉండే కలెక్టర్ల నుంచి వాటిపై ఫీడ్‌‌ బ్యాక్‌‌ తీసుకున్నారు. కలెక్టర్‌‌  పేరు మార్చబోతున్నామనే విషయాన్ని సీఎం అధికారికంగా ప్రకటించినట్టు తెలిసింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 60 రోజుల ప్రణాళిక అమలుపై ప్రసంగాన్ని మొదలు పెట్టిన సీఎం తొలి సెషన్‌‌‌‌ మొత్తం పట్టణాలు, గ్రామాలను ఎలా సుందరంగా తీర్చిదిద్దాలనే విషయంపైనే అవగాహన కల్పించినట్లు సమాచారం.

ఎవ్వరితో మాట్లాడొద్దు!

బుధవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టర్లంతా మళ్లీ ప్రగతి భవన్‌‌‌‌కు రావాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. మీటింగ్‌‌‌‌ కొనసాగే చోటును అప్పుడే ప్రకటిస్తామని, తాను సహా అందరం అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. మీటింగ్‌‌‌‌లో ఏం మాట్లాడాం, రెవెన్యూ చట్టంలో ఉండబోయే అంశాలేంటి, ఇతర విషయాలేవీ ఎవరితోనూ చర్చించవద్దని మంత్రులు, కలెక్టర్లను ఆదేశించినట్టు సమాచారం. రెవెన్యూ చట్టంపై త్వరలో తానే మీడియా ముందుకు వస్తానని సీఎం అన్నట్టు తెలిసింది. దీంతో మీటింగ్‌‌‌‌ ముగిశాక ఏ ఒక్క మంత్రిగానీ, అధికారి గానీ ఎవరితోనూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అధికారులకు ఫోన్లు చేసినా ఎవరూ లిఫ్ట్‌‌‌‌ చేయలేదు. కేసీఆర్‌‌‌‌ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లతో సమావేశం కావడం ఇదే తొలిసారి. సాధారణంగా సీఎం సమావేశాల తర్వాత సీఎంవో నుంచి ప్రెస్‌‌‌‌నోట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేస్తుంటారు. కానీ ఈ భేటీ తర్వాత ఎలాంటి నోట్​ రిలీజ్​ కాకపోవడం విశేషం.

60 రోజుల ప్రణాళికపై..

మంగళవారం ఉదయం 11.30 గంటలకు సమావేశం ఉండగా.. మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికారులు అరగంట ముందే ప్రగతిభవన్‌‌‌‌కు చేరుకున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే కలెక్టర్లకు భారత రాజ్యాంగం, పనితీరు మెరుగు పరుచుకునేందుకు అవసరమైన ఇతర పుస్తకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించగా.. అధికారులు వాటిని పంపిణీ చేశారు. తర్వాత పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 60 రోజుల ప్రణాళిక మాట్లాడారు. దాని అమలు కంటే ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. 60 రోజుల్లో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా చెత్తాచెదారం కనిపించకుండా చర్యలు చేపట్టాలని.. పాత కరెంటు స్తంభాలు తొలగించి కొత్తవి వేయాలని సూచించారు. లూజ్‌‌‌‌లైన్లు సరిచేసి ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు విరివిగా మొక్కలు నాటాలని, ఇందుకోసం కలెక్టర్‌‌‌‌ అధ్యక్షతన జిల్లా స్థాయిలో గ్రీన్‌‌‌‌ కమిటీలను నియమిస్తామని చెప్పారు. గ్రామాల్లోని సర్కారీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. హెల్త్‌‌‌‌ సబ్‌‌‌‌ సెంటర్ల నిర్వహణ ఎలా ఉంది,  వాటికి సొంత భవనం ఉందా, ప్రైవేటు బిల్డింగులలో హెల్త్‌‌‌‌ సెంటర్లను నిర్వహిస్తే ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, స్థానికంగా పూర్తి వసతులతో హెల్త్‌‌‌‌ సబ్‌‌‌‌ సెంటర్ల నిర్వహణకు ఉన్న వనరులేంటి, ఏఎన్‌‌‌‌ఎం, సెకండ్‌‌‌‌ ఏఎన్‌‌‌‌ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై ఫోకస్‌‌‌‌ పెట్టాలని ఆదేశించారు.

రెండో సెషన్​లో రెవెన్యూ అవినీతిపై..

మంత్రులు, అధికారులు మధ్యాహ్నం భోజనం చేశాక రెండో సెషన్​ జరిగింది. ఈ సమయంలో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి, అక్రమాలను సీఎం ఉదాహరణలతో సహా వివరించినట్టు తెలిసింది. ఉన్నతాధికారులపై పని ఒత్తిడి ఉండటంతో శాఖలోని కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రజల బాధలు ఎలా ఉంటున్నాయో పత్రికలు చూస్తే తెలుస్తుందని అన్నట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదంటే పటిష్టమైన రెవెన్యూ చట్టం ఉండి తీరాలని, అందుకోసం తానే ఎంతగానో శ్రమించి కొత్త చట్టం తయారు చేశానని సీఎం కేసీఆర్‌‌‌‌ చెప్పినట్టు సమాచారం.
చట్టంలోని కీలకాంశాలను వివరించి, వాటిపై అభిప్రాయం చెప్పాలని కలెక్టర్లను కోరారని, కలెక్టర్ల నుంచి రెవెన్యూ చట్టంపై అభిప్రాయాలు తీసుకుని నోట్​ చేసుకున్నారని తెలిసింది