
సహాయ మంత్రి హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉన్నారని, అది కరెక్ట్ కాదని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ప్రగతి భవన్ లో సీఎం ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలతో ఎన్నికయిన ఎంపీపీలు, జడ్పీటీసీలదీ కూడా ఖాళీగా ఉన్నారని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా పాలనలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది త్వరలోనే నిర్ధారిస్తామన్నారు.
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏఏ అంశాల్లో వారి బాధ్యతలు ఎంత వరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని మంత్రి దయాకర్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు.
పంచాయతీ రాజ్ విభాగంలో పనిచేసిన అనుభవం కలిగిన నాయకులు, అధికారులు, విషయ నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలన్నారు. ముసాయిదాపై ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని, చివరికి అసెంబ్లీలో కూడా విస్తృతంగా చర్చిస్తామన్నారు.ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా తీసుకుని, ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వస్తున్న క్రమంలో దానికి సమానంగా రాష్ట్ర వాటాను కేటాయిస్తామని, ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తామన్నారు. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేసిన తర్వాతనే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.