
సెక్రటేరియెట్ తరలింపుపై సీఎం కేసీఆర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించారు. పాత సెక్రటేరియెట్ స్థానంలోనే కొత్తగా సెక్రటేరియెట్ నిర్మించాలని, ఈ నెల 27న నూతన సెక్రటేరియెట్ నిర్మాణానికి భూమిపూజ చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్లో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తరలింపు ఎలా, శాఖల కమిషనరేట్లో ఎంత స్పేస్ అందుబాటులో ఉంది అనే అంశాలపై సీఎస్, జీఏడీ, రోడ్లు భవనాల శాఖ అధికారుల నుంచి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. శనివారం ప్రగతిభవన్లో జరిగిన ఈ సమీక్షలో.. సెక్రటేరియెట్లో ఎక్కడ భూమి పూజ చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. భూమి పూజకు సమయం దగ్గర పడుతుండటంతో ఆ కార్యక్రమం తర్వాతే సెక్రటేరియెట్ను తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడున్న సెక్రటేరియెట్ భవనాలను మొత్తం కూల్చి వేయాలా…లేదా దశలవారీగా కూల్చి వేయాలా అన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. సెక్రటేరియెట్ చుట్టూ నాలుగు వైపుల రోడ్లు ఉండటంతో కూల్చివేత సమయంలో వెలువడే దుమ్ము వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏ చర్యలు తీసుకోవాలన్న విషయాలను అధికారులను సీఎం అడిగినట్లు సమాచారం. కొత్త సెక్రటేరియెట్ తరలింపునకు సంబంధించి రోడ్లు భవనాల శాఖ మంత్రి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల కేబినెట్ భేటీ అనంతరం సీఎం ప్రకటించినా.. ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ఈ కమిటీ ఏర్పాటుపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.