లిఫ్ట్ ఇవ్వడమే పాపమైంది.. వ్యక్తిని బెదిరించి రూ.30 వేలు వసూల్ చేసిన మహిళ

లిఫ్ట్ ఇవ్వడమే పాపమైంది.. వ్యక్తిని బెదిరించి రూ.30 వేలు వసూల్ చేసిన మహిళ

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: మహిళకు లిఫ్ట్​ఇచ్చినందుకు వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటన ఆదిలాబాద్​పట్టణంలో జరిగింది. వన్​టౌన్​సీఐ బి.సునీల్​కుమార్ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్​ పట్టణానికి చెందిన ఔట్​సోర్సింగ్​ఉద్యోగి వేష్కర్ రవికుమార్ జులై 21న కలెక్టర్​కార్యాలయం సమీపంలో ఓ మహిళకు లిఫ్ట్​ఇచ్చి కైలాస్​నగర్​సమీపంలో దింపాడు. మాటల్లోకి దింపిన ఆ మహిళ.. రవికుమార్ ఫోన్ నంబర్​తీసుకుంది. కాగా జులై 23న వాగాపూర్​గ్రామానికి చెందిన చాకటి కిరణ్​అనే వ్యక్తి రవికుమార్​కు ఫోన్​చేసి తన మరదలిని ఫోన్‎లో వేధిస్తున్నావని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. 

రూ.50 వేలు ఇవ్వాలని, లేకుంటే దాడి చేస్తామనడంతో బాధితుడు భయపడ్డాడు. అదేరోజు తన బైక్‎ను తాకట్టు పెట్టి రూ.30వేల నగదును కిరణ్‎కు ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని రవి తన తండ్రి అయిన రిటైర్డ్​ఎస్సై లక్ష్మణ్‎కు చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కిరణ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు. బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.