రిజిస్ట్రేషన్, కరెంటు, లిక్కర్‌‌ రేట్లు పెంచుతమన్న సీఎం కేసీఆర్

రిజిస్ట్రేషన్, కరెంటు, లిక్కర్‌‌ రేట్లు పెంచుతమన్న సీఎం కేసీఆర్

కరెంటు చార్జీల పెంపూ ఉంటది.. అవసరమైతే లిక్కర్‌‌ రేట్లు పెంచుడే
అందరం కలిసి నిరుద్యోగులను జులాయిలను చేస్తున్నం: సీఎం
ఇసుక, మైనింగ్‌‌ ఆదాయాన్ని పెంచుకుంటం
ఫీల్డ్‌‌ అసిస్టెంట్లు సమ్మె చేస్తే ఉద్యోగాలు ఊడుతయ్
అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుకు సమాధానంలో కేసీఆర్‌‌

స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్‌‌ చార్జీలు పెంచబోతున్నట్లు సీఎం ప్రకటించారు. కరెంట్​చార్జీలు కూడా పెంచుతామని, 24 గంటల కరెంట్‌‌ కావాల్నంటే చార్జీల పెంపును భరించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇప్పటికే లిక్కర్​ ధరలు పెంచామని, తాగుడును డిస్కరేజ్‌ చేయడానికి అవసరమైతే మళ్లీ ఆ రేట్లు కూడా పెంచుతామని ఆయన అన్నారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుకు సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం బస్‌‌ చార్జీలు పెంచిందని, పొద్దున 4 గంటలకే బస్‌‌ డిపోల ముందు ధర్నాలు చేశామని, స్పీకర్‌‌ పోచారం కూడా  అప్పుడు టీడీపీలోనే ఉన్నారని సీఎం గుర్తు చేశారు. తర్వాత కాంగ్రెస్‌‌ ఓడిపోయి టీడీపీ గెలిచిందని తెలిపారు. ‘‘24 గంటల కరెంట్‌‌ను ప్రజలందరూ కాపాడుకోవాలంటే చార్జీలు, కొన్ని ట్యాక్సులు పెంచుతం.. భరించాలె. చార్జీలు పెంచుతమని సభలోనే చెప్పిన. దాని నుంచి నేను వెనక్కిపోతలేను. మేమేం మాయామశ్చింద్రలం కాదు కదా. ప్రజలను మోసం చేయడం లేదు కదా?’’ అని సీఎం అన్నారు. పోడు సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని ఇప్పటికే చెప్పినట్లు గుర్తుచేశారు.

నేను చెప్పేది అబద్ధమైతే గ్రేటర్‌‌లో ఓడిస్తరు

గ్రేటర్‌‌ శివారులోని మున్సిపాలిటీలకు అద్భుతంగా తాగునీటిని ఇస్తున్నామని సీఎం తెలిపారు. ‘‘గ్రేటర్‌‌కు తాగునీటి సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నం. కేశవపూర్‌‌ రిజర్వాయర్‌‌ పనులు వేగంగా పూర్తి చేస్తున్నం. ఓఆర్‌‌ఆర్‌‌ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు భగీరథ నీళ్లు ఇస్తం. ఓల్డ్‌‌సిటీతో పాటు గ్రేటర్‌‌లో తాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు ఆస్కీని స్టడీ చేసి రిపోర్టు ఇవ్వమన్నం. నేను చెప్పేది అబద్ధమైతే గ్రేటర్‌‌ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తరు.. నిజమైతే గెలిపిస్తరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్​ చార్జీలుపెంచుతం

‘‘మీతో (కాంగ్రెస్‌‌తో) పంచాయితీ పెట్టుకోం.. మీకు పనిలేదు..మాకు ఫుల్‌‌గా పని ఉన్నది. ఆర్థిక మాంద్యం ఒక వైపు, కరోనా ఇంకోవైపు పట్టిపీడిస్తున్నయ్​.  ఈ దశలోనూ గ్రోత్‌‌ దెబ్బతినకుండా చూస్తం. ఈ యేడు రూ.1.63 కోట్ల ఆదాయం క్రాస్ అయితదని అంచనా వేస్తున్నం. పాలసీల మార్పుతో ఇంకొంచెం ఆదాయం పెంచుకుంటం.. ఆరేండ్ల నుంచి స్టాంప్స్‌‌ అండ్‌‌ రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచలేదు.. ఇప్పుడు పెంచుతం’’ అని సీఎం అన్నారు.

ఆ అగ్రిమెంట్‌‌ చూపిస్తే రాజీనామా చేస్త

కాంగ్రెస్‌‌  హయాంలో 152 మీటర్ల ఎత్తులో (తుమ్మిడిహెట్టి) బ్యారేజీ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తే.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం వంద మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టిందని, ఇలాంటప్పుడు మహారాష్ట్ర చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వం విన్నట్టా.. మనం చెప్తే ఆ రాష్ట్రం విన్నట్టా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దీనికి సీఎం కేసీఆర్​ స్పందిస్తూ.. అప్పట్లో కాంగ్రెస్​ 152 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ కట్టేందుకు అగ్రిమెంట్‌‌ చేసుకున్నట్టుగా చూపిస్తే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌‌ చేశారు. ఉపాధి హామీ ఫీల్డ్‌‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని భట్టి కోరగా సీఎం స్పందిస్తూ ‘‘వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులే కారు.. కలెక్టర్లు చేసుకున్న టెంపరరీ అరెంజ్‌‌మెంట్స్‌‌ ప్రకారం పనిచేస్తున్నరు. వాళ్ల సమస్యలు కలెక్టర్లు చూసుకుంటరు. వాళ్లకు సమ్మె చేసే అధికారం లేదు. అయినా సమ్మె చేస్తే వాళ్లు ఉద్యోగాల నుంచి తొలగించబడుతరు’’ అని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతోనే అప్పులు చేస్తుందని సీఎం తెలిపారు.

దేశాన్ని డ్రామా కంపెనీలా తయారు చేసిండ్రు

కాంగ్రెస్‌‌, బీజేపీ దొందు దొందేనని, దేశాన్ని డ్రామా కంపెనీలా మార్చేశాయని దుయ్యబట్టారు. పంటలకు ఎమ్మెస్పీ నిర్ణయించేది కేంద్రమని, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటే ఏ పంటకు ఏ ధర ఇస్తే బాగుంటుందో సమీక్షించుకునేవని చెప్పారు. కందులు కొనుగోలు చేయకుండా కేంద్రం చేతులెత్తేస్తే తానే రూ.300 కోట్లు అలాట్‌‌ చేసి కొనుగోలు చేయమన్నానని తెలిపారు. తాను చెప్పిన తర్వాత ఇంకో లక్ష టన్నులు కొంటామని కేంద్రం చెప్పిందని, ఇదేం విధానమని ప్రశ్నించారు. కేంద్రం వైఖరిపై ప్రధానికి లేఖ రాస్తానని సీఎం అన్నారు. యాసంగి చరిత్రలోనే రాష్ట్రంలో అత్యధికంగా 38.19 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని చెప్పారు. వానాకాలం, యాసంగిలో కలిపి 2.25 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు. రాష్ట్రంలో పండే పంట మొత్తాన్ని కొంటామని తెలిపారు.

నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం

కాంగ్రెస్‌‌ను ఉద్దేశించి ఇటీవల కరోనా అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని భట్టి విక్రమార్క క్లారిఫికేషన్ల సందర్భంగా కోరారు. సీఎం స్పందించకుంటే స్పీకర్‌‌ ఆ మాటను రికార్డుల్లోంచి తొలగించాలని ఆయన అన్నారు. భట్టి డిమాండ్‌‌ను సీఎం పట్టించుకోలేదు. అదే సమయంలో ద్రవ్య వినిమయ బిల్లును సభామోదం కోసం ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో నిల్చుని నిరసన తెలిపారు. వారి నిరసనల మధ్యే ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

యువతను మోసగించడం మంచిది కాదు

‘‘అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలం కలిపి నిరుద్యోగులను జులాయిలను తయారుచేస్తున్నం. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచింది. ఇన్నేండ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నిచ్చినం?  1.20 కోట్ల కుటుంబాలున్న తెలంగాణలో మొత్తం ఉన్నదే 3 లక్షల చిల్లర ఉద్యోగులు. అంతకుమించి ఉద్యోగాలు ఇవ్వలేం. ఆ ఉద్యోగాలే వస్తయని అందరం భ్రమింపజేస్తున్నం.. మేం దిగిపోయి మీకు(ప్రతిపక్షాలకు) అధికారం ఇస్తం. మీరు 50 లక్షల ఉద్యోగాలు ఇస్తరా? యువతను మోసగించడం సమాజానికి మంచిది కాదు” అని సీఎం కేసీఆర్​ అన్నారు. ఉద్యమ సమయంలో ఏపీ నుంచి విడిపోతే లక్ష కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయనే తాను చెప్పానని, దాదాపు అన్ని ఉద్యోగాలు ఇచ్చామని, ఇంకొన్ని ఇచ్చేది ఉందని తెలిపారు.  సస్యశ్యామల తెలంగాణే తన ధ్యేయమని, రైతును రాజును చేసేదాకా ఎంత పెట్టుబడైనా పెడుతామని తెలిపారు.