
బీజేపీ దేశానికి చాలా ప్రమాదకరమని సీఎం కేసీఆర్ అన్నారు. 8 ఏండ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏదైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్, సంక్షేమం వంటి ఏ రంగంలోనైనా దేశం అభివృద్థి చెందిందో చెప్పాలని సవాల్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమని కేసీఆర్ ప్రకటించారు. ప్రధాని మోడీ డైలాగుల మాత్రమే కొడతాడని..పని చేయడం చేతగాదని మండిపడ్డారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్..సబ్ కా బక్వాస్ అని ఎద్దేవా చేశారు. బేటీ పడావో బేటీ బచావో అంటారని...కానీ అంగన్ వాడీ సెంటర్లకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తారని విమర్శించారు. ఇదేనా బేటీ పడావో పథకం ఉద్దేశమని చురకలంటించారు.
మోడీ వచ్చాక ..దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. ఏడాదికి వేల మంది పారిశ్రామిక వేత్తలు దేశాన్ని విడిచిపెట్టి పోతున్నారని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఎల్ఐసీ సంస్థ రూ. 35 వేల కోట్ల ఆస్తులను కలిగి ఉందని..అయినా..ఆ సంస్ధను షావుకార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రూ.14వేల కోట్ల ప్రజల ఆస్తులను మోడీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందన్నారు. దేశ సొత్తు ఇష్టం వచ్చిన వారికి అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. దేశంలోనే మేధావులు, యువకులు, ప్రజలు ఆలోచించాలని..ఈ దుష్ట సంప్రదాయం పోవాలన్నారు.