జాతీయ స్థాయిలో రైతు ఐక్య వేదిక ఏర్పాటు చేయాలె

జాతీయ స్థాయిలో రైతు ఐక్య వేదిక ఏర్పాటు చేయాలె

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారా గమ్యాన్ని చేరుకోగలమని చెప్పారు. భారతదేశ రైతులకు వ్యవసాయం ఒక జీవన విధానమని,  రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగుపడుతుందని అన్నారు. దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పని చేద్దామని జాతీయ రైతు సంఘాల నాయకులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ రైతు సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రెండోరోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని శనివారం నాటి తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించింది. 

దేశంలో దశాబ్దాల కాలం నుంచి రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్ణకరమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్ ను రైతు సంఘాల నాయకులు కోరుతూ తీర్మానించారు. పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్ర్య కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలపై చర్చించారు. 

రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని, అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలని సీఎం కేసీఆర్ అన్నారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో కనిపించదన్నారు. రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు..? అని ప్రశ్నించారు. దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి రైతు సంఘాల నాయకులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారతదేశాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దామన్నారు. దేశ రైతును ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే ‘అవ్వల్ దర్జా కిసాన్’ గా తయారు చేద్దాం’’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. 

ఒకే దేశం, ఒక్కటే రైతు సంఘం అనే నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితేనే అన్నదాతల సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం అవుతాయని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని చెప్పారు. 

జాతీయ రైతు సంఘాల నేతలకు సన్మానం
జాతీయ రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డితోపాటు దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన ‘జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన’ నేటితో ముగిసింది.