పాలమూరు, కల్వకుర్తి కలుపుదాం

పాలమూరు, కల్వకుర్తి కలుపుదాం

    అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
    ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశం‌

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో కలపాలని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌‌ జిల్లాతో పాటు ఆ జిల్లాను ఆనుకుని ఉన్న తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధంచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం ఆదివారం ప్రారంభించిన సమీక్షా సమావేశం సోమవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా నదీ ప్రవాహం అక్టోబర్ వరకే కొనసాగుతుందని, ఈలోపు రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాను వీలైనంతగా ఎత్తిపోసుకొని పాలమూరు ఎండిన బీళ్లను తడుపుకోవాలన్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నదని, అందులో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో దాని  పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టమన్నారు. మహబూబ్ నగర్ నుంచి కిందికి ఉన్న భూములకు సాగునీరందించే విధి, విధానాలపై చర్చించారు. పైకి నీళ్లను తీసుకెళ్లి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు నీరందించేలా కాల్వల నిర్మాణంపై చర్చించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, వారం వారం క్షేత్రస్థాయి పర్యటనలు కూడా జరపాలని చెప్పారు. ఇక నుంచి పర్యటనలు మొదలవుతున్నందున అనువైన చోట ఒక గెస్టు హౌజ్ ను నిర్మించాలని సీఎం సూచించారు.

ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేయాలె..

పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసుకోవాల్సి ఉందని సీఎం అన్నారు. అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీం సర్వే పనులను సత్వరమే పూర్తిచేసి, ఎస్టిమేషన్లను పరిపాలనా అనుమతులకోసం పంపాలని సూచించారు. బల్మూర్, లింగాల అమ్రాబాద్ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు నీరందించాలని, ఇందుకోసం ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కిలోమీటర్లు కాల్వ తీసి, లింగాల దగ్గర లిఫ్టును ఏర్పాటు చేయాలన్నారు.  అక్కడినుంచి మైలారం దగ్గర 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌‌ ఏర్పాటు చేయాలన్నారు. దానికి  ఉమా మహేశ్వరం అనే పేరును సూచించారు. అక్కడినుంచి చంద్రసాగర్ కు కాల్వ ద్వారా నీరందించి, అమ్రాబాద్ మండలంలోని మున్ననూరులో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి, ఎత్తిపోయాలన్నారు.