దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’

దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’

సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం వల్ల తెలంగాణ పౌరులు కనీస జీవన భద్రత కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఖ్యాతి పొందిందని చెప్పారు. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లను రాష్ర్టం ప్రభుత్వం అందజేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని గుర్తు చేశారు. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. 

దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని, అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో కొంత మేర వెలుతురు ప్రసరించింది కానీ, ఆ తర్వాత గొప్ప ప్రయత్నమేదీ జరగలేదని అన్నారు. దేశంలో దళితవర్గం పట్ల సామాజిక వివక్ష, అణచివేత నేటికీ కొనసాగుతుందని, దాంతో దళితవాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే మిగిలిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళితజాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా రాష్ర్ట ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతిరేఖగా దళితబంధు దేశానికి దిశా నిర్దేశనం చేస్తోందని చెప్పారు. దళితబంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే కాకుండా సామాజిక ఉద్యమంగా అమలు పరుస్తున్నామని చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో ప్రభుత్వం అందిస్తోందన్నారు. 

ఆర్థిక సాయానికి అదనంగా లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ని కూడా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వ్యాపార రంగంలోనూ పైకి ఎదగాలనే సంకల్పంతో, ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే లాభదాయక వ్యాపారాలలో దళితులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు అందజేస్తామన్నారు. గత ఏడాది దళితబంధు పథకం ద్వారా  దాదాపు 40 వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది బడ్జెట్ లో దళితబంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.

గ్రామీణ వృత్తులకు అండగా.. 
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 11 లక్షల 24 వేల 684  మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు 1 లక్షా 116 రూపాయల చొప్పున 9 వేల 716 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి బలోపేతం చేసే దిశగా అనేక చర్యలను చేపట్టిందన్నారు. గ్రామీణ వృత్తులను ప్రోత్సహించడం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. గొల్ల, కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నామని, దీంతో గొల్ల, కుర్మల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందన్నారు. గొర్రెల పెంపకంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 

అన్ని వర్గాలకు చేయూత
మత్స్యకారులకు లబ్ది చేకూర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాల్లో చేప పిల్లలను వదలటంతో బ్లూ రెవల్యూషన్ సంతరించుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 25 వేల 782 కోట్ల మత్స్య సంపద సృష్టించబడిందన్నారు. గౌడ సోదరుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం చెట్ల పన్నును బకాయిలతో సహా రద్దు చేసిందని, మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. దోభీ ఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, వివిధ వృత్తులకు ప్రేరణనిస్తూ ఆయా వర్గాల వారి ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడుతున్నామని తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంలో జాతీయ చేనేత దినోత్సవం నాటి నుండీ నేతన్నకు బీమా సదుపాయాన్ని రాష్ర్ట ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. చేనేత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్మును రాష్ర్ట ప్రభుత్వం అందిస్తుందని, ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. 

కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యుత్ కోతలతో, పవర్ హాలిడేలతో చాలా బాధలు అనుభవించిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కిందన్నారు. ఇవాళ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. విద్యుత్తు రంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్ల అద్భుతమైన విజయం సాధ్యమైందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ రాష్ర్టం దేశంలోని పెద్ద రాష్ట్రాలలో  ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగిందన్నారు.

ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం
ఒకప్పుడు గుక్కెడు నీళ్ళ కోసం మైళ్ళు నడిచి పడరాని పాట్లు పడ్డ తెలంగాణ, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి  స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తోందన్నారు. మిషన్ భగీరథతో 100 శాతం మంచి నీరందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కొనియాడిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టామని చెప్పారు. 

వ్యవసాయ రంగంలో భళా
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయ స్థిరీకరణను సాధించడం ద్వారా తెలంగాణ భారతదేశ వ్యవసాయ రంగంలోనే అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చిందన్నారు. నేడు రాష్ట్రం ‘సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణ’ గా ఆవిర్భవించిందన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా రైతురుణ మాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, రైతుబంధు, రైతుబీమా పథకాలు వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితుల ఏర్పాటుతో అద్భుతమైన పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చిమని వివరించారు. రైతులకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 2014, 15లో తెలంగాణ మొత్తం సాగు విస్తీర్ణం 1 కోటి 34 లక్షల ఎకరాలని, రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయరంగంలో నెలకొల్పిన కృషితో 2020, 21 నాటికి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. 

రైతుబంధు, బీమాతో అన్నదాతలకు ధీమా
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 57 వేల 880 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఐక్యరాజ్య సమితి రైతుబంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడిందన్నారు. రైతుబీమాతో అన్నదాతలకు ధీమా అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో రైతులతో పాటు వారి కుటుంబాల సంక్షేమాన్ని, భద్రతను సైతం ఆలోచించిన ఒకే ఒక్క ప్రభుత్వం తమదే అన్నారు. అరగుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5 లక్షల బీమాను అందిస్తున్నామని చెప్పారు. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 84 వేల 945 మంది రైతు కుటుంబాలకు 4 వేల 247 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించిందన్నారు. 

వరి సాగులో తెలంగాణ రికార్డు
తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో 2021 నాటికి కోటికి పైగా ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించించామని సీఎం కేసీఆర్ చెప్పారు. సాగునీటి రంగ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత భారీ ఆయకట్టును సృష్టించిడం మునుపెన్నడూ జరగని అద్భుతమని చెప్పారు. 2014 లో తెలంగాణలో 68 లక్షల టన్నుల వరి ధాన్యం పండితే, రాష్ర్ట ప్రభుత్వం కల్పించిన వివిధ సౌకర్యాల వల్ల నేడు సుమారు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతుందన్నారు. పంజాబ్ తర్వాత దేశంలో అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందన్నారు. 11.6 శాతం వ్యవసాయ వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. జి.ఎస్.డి.పిలో  18.6 శాతం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతుందని చెప్పారు. 

గురుకుల విద్యకు పెద్దపీట
బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం గురుకుల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో అత్యధికంగా గురుకులాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. గ్రామీణ విద్యార్థులు గురుకులాల్లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాటవాలను చాటుకుంటున్నారని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు ‘మన ఊరు – మన బడి’ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 289 కోట్ల రూపాయల వ్యయంతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా మహిళా, అటవీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీలలోని  5 వేల 111  అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయాలని ఇటీవలనే నిర్ణయించామన్నారు. 

పల్లె ప్రగతితో గ్రామాల్లో పచ్చదనం
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా గొప్ప పురోగతిని సాధించాని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం, స్థానిక సంస్థల ప్రయత్నంతో గ్రామాలు పరిశుభ్రతతో, పచ్చదనంతో, సకల మౌలిక వసతులతో కళకళలాడుతున్నాయని తెలిపారు. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరును కలిగి ఉందన్నారు. డంపుయార్డు, వైకుంఠధామం వంటి మౌలిక వసతులు సమకూరాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గర్వకారణం అని అన్నారు. ‘పల్లెలను అపురూపంగా తీర్చిదిద్దిన సర్పంచులకు, పట్టణాల్లోనూ పరిశుభ్రతను, పచ్చదనాన్ని మెరుగుపరిచిన మున్సిపల్ ఛైర్మన్ లకు, అధికారులు అనధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

హరితహారంతో పచ్చదనం
హరితహారం పథకం ద్వారా చేసిన కృషి అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అడవుల పునరుద్ధరణ నిరంతరం జరుగుతుండటంతో సుందరవనాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా పచ్చదనం కనువిందు చేస్తోందన్నారు.

తెలంగాణ అభ్యర్థులకే 95 శాతం ఉద్యోగాలు
రాష్ట్రంలో ఇప్పటివరకు 1 లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని, ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగాలు తెలంగాణ అభ్యర్థులకే 95 శాతం దక్కేవిధంగా లోకల్ కేడర్ వ్యవస్థను రూపొందించుకున్నామని, దీనికోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించగలిగామన్నారు. తెలంగాణలో నెలకొన్న సర్వమత సామరస్య భావనను ప్రతి బింబిస్తూ బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ పండుగలను రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

దేశానికే దిక్సూచిగా కమాండ్ కంట్రోల్ సెంటర్
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు కావడం కోసం ఇటీవల ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి ఇనుమడించిందని అన్నారు. పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతిక విప్లవానికి ఈ సెంటర్ నాంది పలికిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల దృశ్యాలను ఈ సెంటర్ నుండి వీక్షించవచ్చన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటైన మల్టీ ఏజెన్సీస్ ఆపరేషన్స్ ప్లాట్ ఫాం ద్వారా అన్ని శాఖల ప్రతినిధులు ఒకేసారి కూర్చొని కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించవచ్చని చెప్పారు. ప్రకృతి ఉత్పాతాలు, ఇతర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సెంటర్ సమాచార సమన్వయానికి, సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్ వ్యవస్థను కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో దేశానికే దిక్సూచిగా నిలిచింది. 

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగిందని, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన ఫలితాలను సాధించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. పరిశ్రమల స్థాపనకు సులభతరంగా అనుమతులు అందిస్తుండడం వల్ల తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో పవర్ హాలిడేలతో పారిశ్రామికవేత్తలు ధర్నాలకు దిగే దుస్థితి ఉండేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాతో పారిశ్రామిక రంగ అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. సుస్థిర ప్రభుత్వం, శాంతిభద్రతలు, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో తెలంగాణ పరిశ్రమలకు స్వర్గధామంగా మారిందన్నారు. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్ళలో 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయని చెప్పారు. 16 లక్షల 50 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. 

ఐటీ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ 
ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ చెప్పారు. 1500కు పైగా పెద్ద, చిన్న ఐటీ పరిశ్రమలు నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయన్నారు. ఐటి రంగ ఉద్యోగాల సృష్టిలో రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాదిలో తెలంగాణ ఐటీ పరిశ్రమ 1 లక్ష 55 వేల ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించిందన్నారు. ఐటీ రంగంలో మొత్తం 7 లక్షల 80 వేల ఉద్యోగాల కల్పన సాగిందన్నారు. 2014లో ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ. 57,258 కోట్లు మాత్రమేనని, 2021 సంవత్సరంలో ఐటీ రంగ ఎగుమతుల విలువ లక్షా 83 వేల 569 కోట్లకు చేరుకుందని అన్నారు. గత సంవత్సరం ఐటి రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 శాతం ఉండగా, తెలంగాణ వృద్ధిరేటు 26.14 శాతంగా ఉందని, ఇది తెలంగాణ ఐటి రంగంలో సాధించిన గొప్ప ప్రగతికి నిదర్శనం అన్నారు. ఇటీవల ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రారంభించిన టి-హబ్ 2.0 ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆవిష్కరణల కేంద్రంగా నిలిచిందని తెలిపారు. భారతదేశంలోనే  అతి ఎక్కువ ఆఫీస్ స్పేస్ ను కల్పిస్తున్న రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం 
వైద్య ఆరోగ్యరంగంలో రాష్ర్టం అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని చెప్పారు. దేశంలో అత్యుత్తమమైన వైద్య సేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు. ప్రజలకు అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లను నెలకొల్పామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అన్ని బెడ్స్ నూ ఆక్సిజన్ బెడ్స్ గా మార్చామని, ప్రస్తుతం రాష్ట్రంలో  56 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ నగర వాసులతోపాటు ఇతర జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా నగరం నాలుగు వైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడున్న 1500 పడకలకు అదనంగా మరో 2000 పడకలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో రెండు వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతున్నాయన్నారు. 

రాబోయే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు చక్కని సేవలు అందిస్తున్నాయని, వీటి స్ఫూర్తితో పల్లె దవాఖానాలు ఏర్పాటవుతున్నాయని అన్నారు. కేసీఆర్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి పథకాల అమలుతో వివిధ ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 2014 లో 30 శాతం మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది 52 శాతానికి పెరిగిందన్నారు. ప్రసూతి మరణాల రేటు 2014లో ప్రతి లక్ష ప్రసవాలకు 92గా ఉండేదని, 2021 నాటికి అది 56కు తగ్గిందన్నారు. ప్రతి వెయ్యి జననాల్లో శిశు మరణాల రేటు 2014లో 39గా ఉండేదని, 2021 నాటికి అది 21కి తగ్గిందన్నారు. డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్న కిడ్నీ పేషెంట్లకు సైతం ఇక నుంచి ఆసరా పింఛన్ అందిస్తామని చెప్పారు.