అన్ని శాఖలకు నిధులు కట్.. మంత్రులూ ఖర్చులు తగ్గించుకోవాలి: కేసీఆర్

అన్ని శాఖలకు నిధులు కట్.. మంత్రులూ ఖర్చులు తగ్గించుకోవాలి: కేసీఆర్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగలేదు.. కేంద్ర ప్రభుత్వ విధానమే కారణం
అధికారులు, మంత్రులు కూడా ఖర్చులు తగ్గించుకోవాలి: సీఎం

హైదరాబాద్, వెలుగు: అన్ని శాఖలకు సమానంగా నిధుల్లో కోత పెట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. అధికారులు, మంత్రులు కూడా ఖర్చులను తగ్గించుకొని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితిలో ఉందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడటమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. ‘‘పార్లమెంట్ లో మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితికి పోలిక లేదు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది.  ఇది ఇట్లనే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయిందన్నట్టు పరిస్థితి తయారైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్​ శనివారం ప్రగతిభవన్ లో అధికారులతో సమీక్షించారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, ఈ ఏడాది విడుదల చేసిన నిధుల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో లెక్కలు తీశారు. మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లే ఆర్థిక పరిస్థితి సంకటంలో పడిందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా భారీగా తగ్గిందని తెలిపారు. ఏదో ఒక డిపార్ట్ మెంట్ కు కాకుండా అన్ని డిపార్ట్ మెంట్స్ లో ఖర్చులు తగ్గించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

కేంద్రానివన్నీ గొప్పలు

ఆర్థిక మాంద్యం ప్రభావం లేదంటూ కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, కానీ వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని సీఎం అన్నారు. గత ఏడాది కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటాతో పోలిస్తే ఈ ఏడాదిలో విడుదల చేసిన పన్నుల వాటాకు చాలా తేడా ఉందని ఆయన తెలిపారు. ‘‘2018–-19లో రూ. 18,560 కోట్లు రాష్ట్రానికి పన్నుల వాటాగా కేంద్రం ఇచ్చింది.  2019–-20 ఆర్థిక సంవత్సరానికి  రూ.19,719 కోట్లు అందిస్తామని కేంద్రం బడ్జెట్ లో పెట్టింది. కానీ ఇందులో ఇప్పటివరకు రూ. 10,304 కోట్లు మాత్రమే విడుదల చేసింది. గత ఏడాది నవంబర్  చివరి నాటికి రూ. 10,528 కోట్లు విడుదల చేసింది. అంటే రూ. 224 కోట్లు తక్కువగా ఇచ్చింది” అని సీఎం తెలిపారు.

అదే జరిగితే రూ. 2,812 కోట్లు కోత

గత ఏడాదితో పోలిస్తే తక్కువగా నిధులు ఇచ్చారని ఇటీవల కేంద్రం దృష్టికి రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ రామకృష్ణారావు తీసుకెళ్లగా.. కేంద్ర అధికారుల ఇచ్చిన సమాచారం ఆశ్చర్యానికి గురి చేసిందని సమీక్షలో రాష్ట్ర అధికారులు అన్నారు. పన్నుల వాటాలో కోత వల్ల అనేక పథకాలకు ఇబ్బందిగా ఉందని, నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని రామకృష్ణారావు కోరారని తెలిపారు. అయితే.. పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయని, పన్నుల్లో కోత 8.3 శాతమే కాకుండా మరింత తగ్గి 15 శాతం దాకా చేరుకునే ప్రమాదం ఉన్నట్లు కేంద్ర అధికారులు చెప్పారని వారు వివరించారు. ఇదే జరిగితే కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రూ. 2,957 కోట్లు తగ్గే ప్రమాదం ఉందని సమీక్షలో అభిప్రాయపడ్డారు. 2017–-18 ఏడాదిలో  రావాల్సిన ఐజీఎస్టీ రూ. 2,812 కోట్లు కేంద్రం ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయం కాగ్ రిపోర్ట్ లో కూడా ఉందని అన్నారు.

పూర్తి రిపోర్టుతో కేబినెట్​కు రండి

ఈ నెల 11న జరిగే  రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారంతో రావాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్రం నుంచి  రావాల్సిన నిధులు ఏ మేరకు ఉన్నాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వంటి  పూర్తి నివేదిక తయారు చేసి మంత్రులు, అధికారులకు ఇవ్వాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీశ్​శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.