కృష్ణా నీళ్లపై ఆంధ్రా దాదాగిరి

కృష్ణా నీళ్లపై ఆంధ్రా దాదాగిరి
  • ఏపీ అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రానికి ఇబ్బందులు.. హాలియా సభలో సీఎం కేసీఆర్​ 
  • ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు దళిత బంధు 
  • పోడు సమస్యను పరిష్కరిస్తం
  • హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండకు రూ. 15 కోట్లు
  • అదనంగా నాగార్జునసాగర్​ నియోజకవర్గానికి  రూ. 120 కోట్లు

దళితబంధుకు నేనే మేధోమథనం చేసిన
కేసీఆర్ చెప్తే చేస్తడు. దళిత బంధు పథకాన్ని సుమోటోగా నేనే తీసుకున్న. తెలంగాణ బిడ్డగా నేనే మేధోమథనం చేసిన. ఆరునూరైన ఈ పథకాన్ని అమలు చేస్తం. తెలంగాణ దళిత జాతిని దేశ దళిత జాతికి ఆదర్శంగా నిలుపుతాం. 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి తెలంగాణ అన్నం పెడుతోంది. పత్తిలో దేశంలో అగ్రగామిగా నిలిచింది.
‑ హాలియా సభలో సీఎం కేసీఆర్​

ఆ ప్రాజెక్టులు అక్రమం
కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరి కావొచ్చు. కృష్ణా నీళ్ల మీద ఏ రకంగా అక్రమ ప్రాజెక్టులు కడ్తున్నరో మీరందరూ చూస్తున్నరు. కృష్ణా నదిలో రాబోయే రోజుల్లో మనకు నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా జాగ్రత్త చేయాలని చెప్పి పాలేరు రిజర్వాయర్ నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు గోదావరి నీళ్లు తెచ్చి అనుసంధానం చేయాలనే దిశగా సర్వేలు జరుగుతున్నయ్​. అది కంప్లీట్ అయితే రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఆయకట్టు కూడా చాలా బ్రహ్మాండంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటది.

నల్గొండ, వెలుగు: కృష్ణా నీళ్లపై ఆంధ్రా దాదాగిరి చేస్తోందని, ఆ రాష్ట్రం కడ్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బందులు కలిగే అవకాశముందని సీఎం కేసీఆర్​ అన్నారు. అందుకే గోదావరి, కృష్ణా అనుసంధానంలో భాగంగా పాలేరు రిజర్వాయర్​ నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్​ వరకు  గోదావరి నీళ్లను తెచ్చేదిశగా సర్వేలు చేపడుతున్నట్లు తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. నాగార్జునసాగర్​ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సమస్యల పరిష్కారం కోసమే మరోసారి హాలియాలో మీటింగ్​ పెట్టినట్లు కేసీఆర్​ చెప్పారు. తనకు కరోనా రావడం వల్లే ఇంత ఆలస్యమైందన్నారు. నాగార్జునసాగర్​ నియోజకవర్గంపై ఆయన మరోసారి హామీల వర్షం కురిపించారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ. 15 కోట్ల చొప్పున రూ. 30 కోట్లు, వీటికి అదనంగా నియోజకవర్గానికి రూ. 120 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నాగార్జునసాగర్​లో రెడ్డి కల్యాణమండపానికి రెండున్నర ఎకరాల జాగ ఇస్తామని చెప్పారు. హాలియాలో షాదీఖానా, మినీస్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. నాగార్జునసాగర్​లో బంజార భవన్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ కాలేజీ సిబ్బంది నియామకం, భవనం ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. మూడు, నాలుగు మండలాల్లో భగీరథ నీళ్లు ఇయ్యాలని కోరుతున్నారని, ఆ పనులు కూడా పూర్తిచేస్తామన్నారు. నియోజకవర్గంలోని పీహెచ్​సీలను అప్​గ్రెడేషన్​ చేయిస్తామని చెప్పారు. 

పీహెచ్‌సీల అప్​గ్రెడేషన్​ చేస్తం
‘‘ఇక్కడ హాస్పిటల్స్ ఉండాల్సినంత బాగలేవ్. పోస్టుమార్టం సదుపాయం కూడా లేదు” అని సీఎం అన్నారు. ఈ మధ్యనే కొత్తగా 7 మెడికల్ కాలేజీలు కూడా శాంక్షన్​ చేశామని, రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని,  ఆ కాలేజీల్లో 500 పడకల ఆసుపత్రి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ తప్పకుండా అప్​గ్రెడేషన్​ చేయిస్తామని హామీ ఇచ్చారు.  ‘గుర్రంపోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్ పెట్టినట్లయితే ఐదారు గ్రామాలకు కలిపి పది వేల ఎకరాలు సాగులోకి వస్తుందని అంటున్నరు. వెంటనే గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని ఆదేశించినం’’ అని తెలిపారు. దీన్ని కూడా నెల్లికల్లు లిఫ్ట్​తో పాటు శాంక్షన్​ చేస్తామన్నారు. ఈ జిల్లాలో దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, కోదాడ, హుజూర్​నగర్ కలిపి మొత్తం 15 లిఫ్టులు శాంక్షన్​ చేశామని, ఈ పనులన్నీ ఏడాదిన్నరలోగా కంప్లీట్ చేస్తామని ఆయన తెలిపారు. 

జానారెడ్డి మాట తప్పిండు
‘‘ఓ సారి అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. జానారెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నరు. రెండేండ్లలో అన్ని వర్గాలకు కరెంట్ మంచిగా చేసి ముఖ్యంగా రైతాంగానికి క్లీన్ పవర్, స్టేబుల్ పవర్ 24 గంటలు ఇస్తాం అని చెప్పిన. దానికి జానా రెడ్డి ఎగతాళి చేస్తూ ..‘మీరు రెండేండ్లు కాదుకదా.. పదేండ్లయినా చేయలేరు.  రెండేండ్లకు చేస్తే నేనే గులాబీ కండువా కప్పుకుని టీఆర్ఎస్​కు  ప్రచారం చేస్తా’ అని  మాట్లాడిండు. ఆయన మాట తప్పి మొన్న కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీ చేసిండు” అని కేసీఆర్​ విమర్శించారు.  

దశలవారీగా దళిత బంధు 
ప్రతిపక్ష పార్టీల నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. ‘‘ఎన్నికల హామీ మేరకు అన్నింటిని నెరవేరుస్తున్నం. ఇదివరకు చేసిన మొఖాలు కాదు కాబట్టి వాళ్లకు మేమేం చేసినా ప్రతిసారి దాన్ని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నరు. దేవుడు నోరు ఇచ్చిండు కదా చాలా భ్రష్ట భాషలో మాట్లాడటం.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం చేస్తున్నరు. దళిత బంధు ప్రోగ్రాంపైనా అవమానంగా మాట్లాడుతున్నరు”అని ఆయన అన్నారు.  ‘‘రాష్ట్రంలో సుమారు 16 లక్షల నుంచి 17 లక్షల వరకు దళిత కుటుంబాలు ఉంటయ్​. దళిత బంధుకు అర్హులైనవాళ్లు 70 నుంచి 80 శాతం ఉంటారనుకుంటే.. సుమారు 12 లక్షల దళిత కుటుంబాలు అయితయ్‌​. అందరికీ  పది లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తది” అని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు రిలీజ్ చేస్తామని, ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు దళిత బంధు అందజేస్తామని తెలిపారు. దళితబంధును దశలవారీగా యేటా అమలు చేసుకుంటూ పోతామన్నారు.

అడిగినందుకు లాక్కెళ్లారు
పెద్దవూర మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన నాగపూరి లక్ష్మి అనే మహిళ స్థానికంగా సమక్కసారక్క గుడిని కట్టి దానికి పూజారిగా కొనసాగుతోంది. అయితే దేవుడి గుడికి సంబంధించిన భూములను ఫారెస్ట్​ అధికారులు తీసుకోవడంతో ‘మీరే న్యాయం చేయాలి సార్’ అంటూ  కేసీఆర్ ప్రసంగానికి అడ్డుపడింది. కొద్దిసేపు చూసిన పోలీసులు బలవంతంగా ఆమెను సభా ప్రాంగణం నుంచి బయటికి లాక్కెళ్లారు. మరో వ్యక్తి కూడా సభలో కేకలు వేయడంతో అందరూ కలవరపాటుకు గురయ్యారు.

సాగర్​లో అన్నీ సమస్యలే
నాగార్జునసాగర్​లో ఇంతకాలం అరకొర అభివృద్ధే జరిగిందని, ఇక్కడ చాలా సమస్యలు పెండింగ్​లో ఉన్నాయని కేసీఆర్​ అన్నారు. ‘‘నేను రెండు సార్లు హెలికాప్టర్​లో రావడం, గాల్లో పోవడం చేసిన.  హాలియా పట్టణం లోంచి ఎప్పుడూ రాలే. ఇప్పుడు వస్తుంటే చూసిన. చాలా సమస్యలున్నయ్​. అందుకే హాలియాకు రూ. 15 కోట్లు, నందికొండకు రూ. 15 కోట్లు, వీటికి అదనంగా మరో 120 కోట్లు సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు చేస్తున్నం” అని సీఎం అన్నారు. ‘‘నందికొండ మున్సిపాలిటీలో ఇరిగేషన్ ​శాఖకు సంబంధించిన ప్రభుత్వ క్వార్టర్లు, ఇరిగేషన్ జాగాలోని క్వార్టర్లలో నివసించే వాళ్లు ఉన్నా రు. ఇరిగేషన్ జాగాలో సొంత ఇండ్లు కట్టుకున్న వాళ్లు ఉన్నారు. వాళ్లందరికి పట్టాలు ఇయ్యాలె. తప్పకుండా నందికొండ మున్సిపాలిటీల్లో ఎంత మంది ఆక్యుపై చేశారో వాటిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆదేశిస్తున్నం. వాళ్లకు హక్కు పత్రాలు ఇచ్చేలా జిల్లా కలెక్టర్  అధ్యక్షతన ఒక కమిటీనీ ఏర్పాటు చేస్తం. కేవలం ఒక నెల రోజుల లోపల నందికొండ మున్సిపాలిటీ వాసులకు హక్కు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది’’ అని హామీ ఇచ్చారు. 

ఎవరికి ఏ సమస్య ఉన్నా వ్యక్తిగతంగా చెప్పండి
ఎవరెన్ని అవాకులు చవాకులు మాట్లాడినా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని కేసీఆర్​ అన్నారు. ‘‘మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా వ్యక్తిగతంగా చెప్పండి. పాత ప్రభుత్వం కాదు. పాత నాయకత్వం కాదు. ఎవరైనా సరే ఎమ్మెల్యేను కలవొచ్చు. అరిసి రంకెలేసి పిచ్చిడ్రామాలు వేయడం సరికాదు. మీ ఎమ్మెల్యేలకు అప్లికేషన్ ఇవ్వండి, బాధలు చెప్పండి” అని అన్నారు.  

పోడు సమస్యను పరిష్కరిస్తం
త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. ‘‘గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించి పోడు భూములకు కూడా 2005 వరకు కటాఫ్ డేట్ అని ఉంది. దీనిపైన కేబినెట్‌లో చర్చ చేసినం. త్వరలోనే ఈ రాష్ట్రంలో పాత చట్టం (కేంద్ర చట్టం) ప్రకారం కటాఫ్ డేట్‌లో ఉన్నవాళ్లందరికీ పోడు భూముల సమస్య తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని కేసీఆర్ అన్నారు.