ఫామ్​హౌస్​ ఫైల్స్ సీబీఐకి పంపినం : సీఎం కేసీఆర్

ఫామ్​హౌస్​ ఫైల్స్ సీబీఐకి పంపినం : సీఎం కేసీఆర్
  • జయప్రకాశ్​ నారాయణ్​ మాదిరి ఉద్యమిస్తం: కేసీఆర్​
  • మా ఎమ్మెల్యేలను కొంటమంటే, ప్రభుత్వాన్ని కూలుస్తమంటే ఊరుకోవాల్నా?
  • నిందితులు కేంద్ర హోంమంత్రి, ప్రధాని పేరు చెప్తున్నరు
  • మేం రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కలుపుకున్నం
  • రాజ్యాంగేతర శక్తుల వీరవిహారాన్ని అరికట్టకపోతే తీవ్ర ప్రమాదం
  • బీజేపీ చెప్పినట్టు చేస్తేనే ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్లా? అని ప్రశ్న
  • కొనుగోళ్ల వ్యవహారంలో పలు వీడియోలు విడుదల
  • మొన్నటి ఆడియోల్లోని వివరాలనే మళ్లీ ప్రస్తావించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్య జీవనాడిని బీజేపీ కలుషితం చేస్తున్నదని, అది చాలా ప్రమాదకరమని సీఎం కేసీఆర్  అన్నారు. తమ ఎమ్మెల్యేల కొనేందుకు  ప్రయత్నించిందని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని డిమాండ్​ చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్స్​ను సీబీఐ, ఈడీకి పంపించామని తెలిపారు. తాము అప్పట్లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను రాజ్యాంగబద్ధంగానే పార్టీలో కలుపుకున్నామని కేసీఆర్​ చెప్పారు. దేశంలో రాజ్యాంగేతర శక్తులు వీరవిహారం చేస్తున్నాయని, అరికట్టకపోతే అందరికీ ప్రమాదమని, జయప్రకాశ్ నారాయణ్ లాంటి ఉద్యమం తీసుకొస్తామని తెలిపారు. గురువారం రాత్రి ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. మొయినాబాద్ ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోని నలుగురు ఎమ్మెల్యేలను కూడా సమావేశానికి తీసుకువచ్చారు. కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఆడియోలను విడుదల చేసిన ప్రభుత్వం.. అందుకు కొనసాగింపుగా సీఎం కేసీఆర్​ కొన్ని వీడియోలను రిలీజ్​ చేశారు. ఆడియోల్లో వివరించిన అంశాలనే మళ్లీ ఇప్పుడు సీఎం తెలిపారు. మూడు గంటల నిడివి ఉన్న  వీడియోలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీంకోర్టు జడ్జిలందరికీ, అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలకు, సీఎంలకు, సీబీఐ, ఈడీకి, అన్ని రాజకీయ పార్టీల ప్రెసిడెంట్లకు పంపినట్లు కేసీఆర్​ తెలిపారు. ‘‘దేశాన్ని సర్వనాశనం చేస్తామంటే ఎవరూ క్షమించరు.. ఈ వ్యవహారాన్ని ఒక కేసు మాదిరిగా చూడవద్దు. ఇది ఇట్లనే కొనసాగితే శాంతిభద్రతకు విఘాతం కలుగుతుంది. దేశ న్యాయ వ్యవస్థకు దండం పెట్టి అడుగుతున్నా.. రెండు చేతులు ప్రణమిల్లి అడుగుతున్నా.. ఎప్పుడూ దేశం ప్రమాదంలో పడినా కాపాడింది జ్యుడిషియరీనే. కర్ణాటక, మహారాష్ట్రలో కూలగొట్టింది తామేనని కొనుగోళ్ల ముఠా నిస్సిగ్గుగా చెప్తున్నది. ఇంత స్వైరవిహారమా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్న’’ అని పేర్కొన్నారు.  

కేంద్ర హోంమంత్రికి తుషార్ సన్నిహితుడు

‘‘గత నెల లోపలనే ఇక్కడికి రామచంద్రభారతి అనేటాయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి.. విశ్వప్రయత్నం చేసి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి మాట్లాడిండు. వాళ్లు ఏం ప్లాన్ చేసిన్రో అర్థమైన తర్వాత.. రోహిత్ రెడ్డి మాకు చెప్పిండు. హోంమంత్రికి కంప్లయింట్ కూడా ఇచ్చిన్రు. ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరగాల్సిందే’’ అని కేసీఆర్​ అన్నారు. ఈ రాక్షస కుట్రను బద్దలు కొట్టాలని తమ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, పార్టీకి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ‘‘వచ్చిన ముఠాలో ఒక్కో వ్యక్తికి.. 3 ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఉన్నయ్​. నకిలీ ఆధార్‌ కార్డులు, పాస్‌పోర్టులు వీరికి ఎవరిచ్చిన్రు. ఇలాంటి ముఠాలు దేశంలో 24 పనిచేస్తున్నాయట” అని అన్నారు. ‘‘మా స్కానర్‌లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్లు హామీ ఇచ్చిన్రు. ఈవీఎంలు ఉన్నంతవరకు బీజేపీకి ఢోకా లేదని వాళ్లు చెప్తున్నరు. ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.100 కోట్లు ఇస్తుందన్నరు. రూ.వేల కోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చినయ్?. బీజేపీలో చేరితే.. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరగవని భరోసా ఇస్తున్నరు. క‌ర్ణాట‌క‌లో ఎమ్మెల్యేల‌ను కొన్నదీ వాళ్లేనట. 20 సార్లు అమిత్ షా పేరు, ఒక‌ట్రెండు సార్లు మోడీ పేరు చెప్పిన్రు. ఇప్పుడు జైళ్లో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఒకడు తుషార్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేసిండు. తుషార్ అనే వ్యక్తి వయనాడ్​లో రాహుల్ గాంధీ మీద పోటీ చేసిండు. తుషార్​ను డిక్లేర్ చేసిన వ్యక్తి కేంద్ర హోమంత్రి. ఏం దౌర్భాగ్యం ఇది. ఎవరు కాపాడాలి ఈ దేశాన్ని. ఇట్ల జరగాల్సిందేనా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. 

బీజేపీ చెప్పినట్టు చేస్తేనే ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్లా?

‘‘తొలిసారి భారమైన మనసుతో, దుఃఖంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నా. చాలా బాధతో ఈ విషయాలు మాట్లాడుతున్నా. ఎనిమిదేండ్ల కిందట అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసింది. నిరుద్యోగం పెరిగింది, రూపాయి విలువ పడిపోయింది. దేశ పరిస్థితిని అనేక అంతర్జాతీయ సూచికలు తెలియజేస్తున్నయ్​. దేశాన్ని బీజేపీ ఆకలిరాజ్యంగా మార్చేసింది. విభజన రాజకీయాలు చేస్తున్నది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంయమనం అవసరం. చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిల్ అయిందని ఆరోపించడం దారుణం. బీజేపీ చెప్పినట్టు చేస్తేనే ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్లా?’’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.  ‘‘హుజురాబాద్​లో ఓడిపోయినం.. దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయినం.. నాగార్జున సాగర్​లో గెలిచినం. గెలుపు ఓటములు సహజం.. దేన్నాయినా గంభీరంగా స్వీకరించాలి. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి నన్ను కలిసినట్టు దుష్ప్రచారం చేసిన్రు. నాపై విచ్చల విడిగా అసత్య ప్రచారాలు చేసిన్రు” అని అన్నారు. పోలింగ్ కంటే ముందు మాట్లాడితే మునుగోడులో లబ్ధికోసమేనని ప్రచారం చేస్తారని భావించి ఇప్పటి వరకు ఆగినట్లు ఫాం హౌస్ వీడియోలపై ఆయన వివరించారు.

మేం డెఫినెట్​గా కలుపుకున్నం

‘‘ఒక కేంద్రమంత్రి.. మీరు కలుపుకున్నరు అంటడు. మేం కూడా కలుపుకున్నం డెఫినెట్​గా. మీలాగా దుర్మార్గం కలుపుకోలేదు. మేం 88 సీట్లతో గెలిచినం. కొందరు కాంగ్రెస్ మిత్రులు వచ్చి మేం కూడా అభివృద్ధి చేసుకుంటం.. చేరుతం అంటే.. రాజ్యాంగ నిబంధనకు లోబడి ఆ సంఖ్యతోటి వస్తే కలుపుకుంటం అని చెప్పిన.  3 , 4 నెలల దాకా ఒప్పుకోలేదు. వారు టూ థర్డ్ మెజార్టీతో వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా కలుపుకున్నమే తప్ప మీలాగా కొనుగోలు చేయలేదు. ఎమ్మెల్యేలను కొంటమని వచ్చి.. నిసిగ్గుగా మాట్లాడుతరు. ప్రభుత్వం పడగొడుతాం అని హైదరాబాద్​లో వచ్చి చెబితే ఊరుకోవాల్నా? నా ప్రభుత్వాన్ని కూలగొడతం అంటే భరించాల్నా? ’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. 

అన్నీ బయటకు రావాలి

‘‘ఎనిమిదేండ్లలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇటీవలే ఓ పత్రిక వాళ్లు రాసిన్రు. ఇవన్నీ బయటకు రావాలి. కొనుగోళ్లు సాగిస్తున్న ముఠా నాయకుడు.. వీళ్ల వెనక ఉన్నది ఎవరో బయటకు రావాలి. ఈ డబ్బులను ఎవరు తీసుకొచ్చిన్రు.. ఇవన్నీ కూడా బయటకు రావాలని డిమాండ్ చేస్తున్న. కర్ణాటక, మహారాష్ట్రలో కూలగొట్టింది తామే అని నిస్సిగ్గుగా చెప్తున్నరు’’ అని కేసీఆర్​ మండిపడ్డారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగితే అన్ హెల్తీ సిచువేషన్స్ వస్తాయని, తాగడానికి నీళ్లు దొరకవని, కరెంట్ దొరకదని అన్నారు. అనేక రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వీటన్నింటిని పక్కన పెట్టి,  ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీపై ఆరోపణలు చేశారు.