40 గ్రాముల గోల్డ్‌‌ పోతే.. 250 గ్రాములు పోయిందని ఫిర్యాదు..హనుమకొండ జిల్లా కేయూ పీఎస్‌‌ పరిధిలో ఘటన

40 గ్రాముల గోల్డ్‌‌ పోతే.. 250 గ్రాములు పోయిందని ఫిర్యాదు..హనుమకొండ జిల్లా కేయూ పీఎస్‌‌ పరిధిలో ఘటన
  •     అసలు దొంగ దొరకడంతో బయటపడిన నిజం
  •     210 గ్రాముల బంగారాన్ని ఇంట్లోనే దాచుకున్న ఫిర్యాదుదారులు  

వరంగల్‍, వెలుగు : నలభై గ్రాముల గోల్డ్‌‌ చోరీకి గురైతే.. 250 గ్రాముల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగ పట్టుబడడంతో అసలు విషయం బయటపడింది. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌ కమిషనరేట్‌‌ సెంట్రల్‌‌ జోన్‌‌ డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ కేయూ పీఎస్‌‌ పరిధిలోని వేంకటేశ్వర కాలనీలో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఈ నెల 12న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన దంపతులు తమ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తం రూ. 31.25 లక్షల విలువైన 250 గ్రాముల బంగారం చోరీకి గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో క్రైమ్స్‌‌ అడిషనల్‌‌ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు.. చోరీ చేసింది ఆసిఫాబాద్‌‌ జిల్లా తాండూర్‌‌ మండలం రేచిని గ్రామానికి చెందిన సబ్బాని రంజిత్‌‌గా గుర్తించారు. అతడి కదలికలపై ఫోకస్‌‌ చేసిన పోలీసులు.. శుక్రవారం కేయూ జంక్షన్‌‌ ఏరియాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చోరీ విషయమై ప్రశ్నించగా.. తాను వేంకటేశ్వర కాలనీలోని ఇంట్లో 40 గ్రాముల బరువైన నాలుగు బంగారు గాజులు మాత్రమే చోరీ చేసినట్లు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు... చోరీ జరిగిన ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా.. 210 గ్రాముల బంగారు అభరణాలు కనిపించాయి. 

40 గ్రాముల బంగారం చోరీకి గురైతే.. కావాలనే 250 గ్రాములు పోయిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించారని గుర్తించి దంపతులను నిలదీశారు. దీంతో వారు.. ఫిర్యాదు చేశాక మిగతా ఆభరణాలు దొరికాయని ఒప్పుకోవడంతో కేసు పెట్టకుండా వార్నింగ్‌‌ ఇచ్చి వదిలేశారు. చోరీ కేసుల్లో తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. కాగా, నిందితుడు రంజిత్‌‌ జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం చోరీలు ప్రారంభించాడని, 2020లో మంచిర్యాల పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని డీసీపీ తెలిపారు. 

ఇతడు ప్రస్తుతం కేయూ పీఎస్‌‌ పరిధిలోని వేంకటేశ్వర కాలనీలోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాడని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్‍, కేయూ, ఫింగర్‌‌ ప్రింట్‌‌ విభాగం ఇన్స్‌‌పెక్టర్లు రాఘవేందర్‍, రవికుమార్‍, దేవేందర్‍, కేయూసీ ఎస్సై శ్రీకాంత్‍, కిరణ్‍, ఏఏవో సల్మాన్‌‌ పాషా, హెడ్‌‌కానిస్టేబుళ్లు మహేశ్వర్‍, జంపయ్యను డీసీపీ అభినందించారు.