మల్యాలపల్లి శివారులో పెద్దపులి.. భయాందోళనలో ప్రజలు

మల్యాలపల్లి శివారులో పెద్దపులి.. భయాందోళనలో ప్రజలు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి శివారులో శుక్రవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో పెద్దపులి కనిపించినట్లు కత్తెరమల్ల కొమురమ్మ అనే మహిళ గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే... కొమురమ్మ శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని బీపీఎల్‌‌ భూమిలోని ఎన్టీపీసీ పైప్‌‌లైన్‌‌ సమీపంలో మేకలను మేపుతోంది. ఈ క్రమంలో పెద్దపులి కనిపించడంతో అక్కడి నుంచి తప్పించుకొని గ్రామానికి వచ్చి స్థానికులకు విషయం చెప్పింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు జి.కొమురయ్య, పి.దేవదాసు, సయ్యద్‌‌ రహ్మతుల్లా, ఆర్.వరప్రసాద్​, రామగుండం ఎస్సై  సంధ్యారాణి ఎన్టీపీసీ పైప్‌‌లైన్‌‌ వద్దకు వచ్చి పులి పాదముద్రలను గుర్తించారు. పెద్దపులి మేడిపల్లి ఓపెన్‌‌ కాస్ట్‌‌ డంప్‌‌యార్డ్‌‌, లింగాపూర్‌‌ పంప్​హౌస్‌‌ సమీపంలో నుంచి రామునిగుండాల ప్రాంతం మీదుగా మల్యాలపల్లి శివారుకు చేరుకుని ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.