- పేరుకుపోయిన నిల్వల్లో నుంచి రోజుకు 2 వేల టన్నులు తరలింపు
- అధిక రేటుతో కొనుగోళ్లకు బ్రేక్ పడటమే కారణం
- స్థానికులకు ఉచితంగా ఇవ్వాలన్న కేంద్రం ఆదేశాలు బేఖాతర్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కేటీపీపీ(కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు)లో బూడిద నిల్వలు టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయి. 1100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నుంచి రోజుకు 2 వేల టన్నుల బూడిదను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు తప్ప స్థానికులకు ఉచితంగా ఇచ్చేందుకు మొండికేస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్టు పరిసరాల్లోని దుబ్బపల్లి, చెల్పూరు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. స్థానికులకు బూడిద ఉచితంగా ఇవ్వాలన్న కేంద్రం ఆదేశాలను బేఖాతర్చేస్తున్నారు. మొదట్లో ఉచితంగా ఇచ్చినప్పటికీ బూడిదకు డిమాండ్ పెరిగిందన్న సాకుతో 2019 నుంచి టెండర్ ప్రక్రియ ద్వారా విక్రయాలు చేపడుతున్నారు.
బూడిదను లిఫ్ట్చేయని కాంట్రాక్టర్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ లో ని కేటీపీపీ కరెంట్ ఉత్పత్తికి బొగ్గు బర్న్ చేసే క్రమంలో ఆవిరి రూపంలో ఫ్లైయాష్, ఇసుక కన్నా తక్కువ పరిమాణంతో కూడిన బాటమ్ యాష్ వెలువడుతుంది. బూడిద ద్వారా ఏటా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది. గతేడాది వరకు బూడిద విక్రయాలకు వచ్చే బల్కర్లు లోడింగ్ కోసం బారులు తీరేవి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫ్లైయాష్టన్నుకు జీఎస్టీతో కలిపి రూ.347, బాటమ్యాష్టన్నుకు రూ.490 ఉండటంతో కొనుగోళ్లు మందగించాయి.
ఈ ఏడాది ఫ్లైయాష్కు సంబంధించి 4 సిమెంట్ కంపెనీలు సాగర్, మహా సిమెంట్, దక్కన్, ఐసీఎల్ టెండర్లు దక్కించుకోగా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి కేఎస్పీ ట్రాన్స్ పోర్ట్, సుధాకర్ రావు, ఎస్ఎస్జీ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఒక్కో కంపెనీ 100 టన్నులు లిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే కేటీపీపీకి రూ.2.5 లక్షల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 7 కంపెనీల నుంచి రూ.17.5 లక్షల ఆదాయం వస్తుంది. కంపెనీలు 100కు మించే టెండర్ వేస్తాయి తప్ప తక్కువగా వేసే అవకాశం లేదు.
దీంతో ఆదాయం కోట్లలోనే వస్తుందనే టాక్వినిపిస్తోంది. టెండర్లు దక్కించుకొని అగ్రిమెంట్ అయినవారికి కేటీపీపీ డీవో(డెలివరీ ఆర్డర్) బుక్కులను ఇస్తుంది. బల్కర్లు సైలో వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి డీవో చూపిస్తేనే లోడ్ చేస్తారు. బాటమ్ యాష్టెండర్లు దక్కించుకున్నా కాంట్రాక్టర్లు ఇప్పటివరకు బూడిదను లిఫ్ట్చేయలేని పరిస్థితి నెలకొంది. దాన్ని సింగరేణి యాజమాన్యం గనుల ఫిల్లింగ్ కు వాడుకుంటోంది.
జైపూర్, రామగుండం, మణుగూరులో రేటు తక్కువ
విద్యుదుత్పత్తి కేంద్రాల సమీపంలో అడిగిన వారికి బూడిదను ఉచితంగా ఇవ్వాలని, వీలు కాకుంటే టన్నుకు కనిష్ఠ ధర రూపాయి చొప్పున నిర్ణయించాలని కేంద్రం 2021లో ఆదేశాలు జారీ చేసింది. అవి అమలకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో మిగతా విద్యుదుత్పత్తి కేంద్రాల కంటే జిల్లాలోని కేటీపీపీలో రేట్లు అధికంగా ఉండటం బల్కర్ యజయానులకు గుదిబండగా మారాయి. జైపూర్ టీపీపీలో టన్నుకు రూ.210, రామగుండం ఎన్టీపీసీలో రూ.110, మణుగూరులో రూ.120 ఉండగా.. కేటీపీపీలో మాత్రం రూ.347 ఉండటంతో మార్కెటింగ్ చేయలేకపోతున్నామని బల్కర్ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది బూడిద లోడింగ్ కోసం ఎదురుచూసేవాళ్లమని.. ఇప్పుడు తక్కువ రేటు ఎక్కడుంటే అక్కడ బల్కర్లు క్యూ కడుతున్నాయని అంటున్నారు. ప్రైవేట్వ్యాపారులు అక్కడే కొనుగోలు చేసి తక్కువ రేటుకు బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారని చెబుతున్నారు. వారితో పోలిస్తే ఇక్కడ రేటు ఎక్కువని, మార్కెట్లో రేటు తక్కువ ఉండటంతో భారమవుతోందని పేర్కొంటున్నారు. నెలవారీ కిస్తీలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీలు బల్కర్లను లాక్కెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊపిరాడనివ్వని బూడిద
కేటీపీపీ నుంచి వెలువడే బూడిదతో దుబ్బపల్లి, చెల్పూర్ ప్రజలకు ఊపిరాడటం లేదు. సైలోల కెపాసిటీ నిండటంతో రాత్రిపూట ఒక్కసారిగా డంపింగ్ యార్డుకు బూడిదను వదులుతున్నారు. దీంతో సమీప దుబ్బపల్లిని బూడిద కమ్మేస్తోంది. శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నామని, పంటలు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు. బూడిద నిల్వలు పేరుకుపోతే 2030 నాటికి విద్యుదుత్పత్తి కేంద్రాలకు జరిమానా విధిస్తామని కేంద్రం హెచ్చరించినా అవి పెడచెవిన పెడుతున్నాయి.
లెక్కలు చెప్పడం లేదు
బూడిద లెక్కలు చెప్పేందుకు సంబంధిత ఆఫీసర్లు వెనకడుగు వేస్తున్నారు. ఒక్కో ప్లాంట్‌కు లెక్కలు చూసేందుకు ఏడీఏ స్థాయి ఆఫీసర్లు ఉన్నారు. బూడిద ద్వారా కేటీపీపీకి ఎంత ఆదాయం వస్తుందో చెప్పమంటే దాటవేస్తున్నారు. ఇందులో ఆంతర్యమేమిటన్న చర్చ జరుగుతోంది. కొందరు కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకొని స్థాయికి నుంచి బూడిదను లిఫ్ట్ చేసేలా సహకరిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఆఫీసర్ల కనుసన్నల్లోనే బడా కాంట్రాక్టర్లు బూడిదను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఉపాధి పోయింది
బూడిదతో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు దాన్ని ఉచితంగానే ఇవ్వాలి. రాష్ట్రంలోని మిగతా విద్యుత్ ప్లాంట్లతో పోల్చితే ఇక్కడ రేటు అధికంగా ఉండటంతో వ్యాపారం దెబ్బతింది. బల్కర్లు నడవక ఉపాధి పోయింది. కిస్తీలు కట్టలేక బండ్లు అమ్ముకోవాల్సి వస్తోంది. మొత్తం 150 బల్కర్లకు ఇప్పడు 75 మాత్రమే ఉన్నాయి. – శ్రీపతి సదానందం, బల్కర్ అసోసియేషన్ ప్రెసిడెంట్
టెండర్ల ద్వారానే విక్రయాలు
ఆన్లైన్ టెండర్ల ద్వారానే బూడిద విక్రయాలు జరుగుతున్నాయి. రేట్ల ఖరారు కేటీపీపీ పరిధిలో లేదు. అగ్రిమెంట్ మేరకు విక్రయాలు జరుగుతున్నాయి. బూడిద రేటు తగ్గించడం, ఉచితంగా ఇచ్చే అంశాలు, స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. - శ్రీప్రకాశ్, కేటీపీపీ సీఈ
