- జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో వార్డుల పునర్విభజనకు సంబంధించిన 300 డివిజన్ల వివరాలను పబ్లిక్ డొమెన్‌లో పెట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. జీహెచ్‌ఎంసీలోని రెండు డివిజన్ల వివరాలను మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని పేర్కొంది.
వార్డుల విభజన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లకు చెందిన 104, 134 డివిజన్ల మ్యాప్‌లు, జనాభా తదితర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. మొత్తం వార్డుల మ్యాప్‌లు, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలన్న అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సవరించింది. జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపుపై వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పొన్న వెంకట్ రమణ, ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు.
జనాభా వివరాలు, మ్యాప్‌లు పబ్లిక్ డొమైన్‌లో 24 గంటల్లో ఉంచాలని మూడ్రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సింగిల్ జడ్జి ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద శుక్రవారం ఈ అంశంపై అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై ప్రస్తుతం మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని చెప్పింది.
వార్డులు 104, 134 వివరాలను మాత్రమే సవాల్ చేసినందున సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఈ రెండు వార్డులకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది. సింగిల్ జడ్జి ఆదేశించిన విధంగా శనివారం ఉదయం 10 గంటల్లోగా పిటిషనర్లకు మాత్రమే వారి వార్డుల సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (వార్డుల పునర్విభజన) నియామకాల్లో నిబంధన 8 ప్రకారం తమ అభ్యంతరాలను తెలిపేందుకు ఆ వార్డులకు చెందిన పిటిషనర్లకు అభ్యంతరాలు చెప్పేందుకు 48 గంటల సమయం ఇస్తున్నట్లు పేర్కొంది.
