అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది : సిరియాపై బాంబులతో విరుచుకుపడిన యుద్ధ విమానాలు

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది : సిరియాపై బాంబులతో విరుచుకుపడిన యుద్ధ విమానాలు

సిరియాలో అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిరియాలోని ఐసిస్ (ISIS) స్థావరాలపై అమెరికా గగనతల దాడులతో విరుచుకుపడుతోంది. 'ఆపరేషన్ హాకీ స్ట్రైక్' పేరుతో చేపట్టిన ఈ భారీ సైనిక చర్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గత వారం సిరియాలోని పాల్మిరా నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా నేషనల్ గార్డ్ సభ్యులు, ఒక సివిలియన్ అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రంప్, "మా వీర సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టేది లేదు" అంటూ హెచ్చరించారు. చెప్పినట్లుగానే, సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై వందలాది క్షిపణులతో దాడులు ప్రారంభించారు. ఇది కేవలం యుద్ధం ప్రారంభం కాదు.. ఇది ఒక ప్రతీకార ప్రకటన అంటూ దాడిపై స్పందించారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. శత్రువులను వేటాడి చంపాం.. ఇంకా చంపుతూనే ఉంటాం అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా సెంట్రల్ కమాండ్(CENTCOM) ఈ ఆపరేషన్ కోసం ఫైటర్ జెట్లు, ఎటాక్ హెలికాప్టర్లు, ఆర్టిలరీని రంగంలోకి దించింది. ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలు, ఆయుధ గిడ్డంగులు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా 100కు పైగా అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులను తాజాగా అమెరికా ప్రయోగించిందని సమాచారం. ఈ ఆపరేషన్‌లో జోర్డాన్ సాయుధ దళాలు కూడా తమ యుద్ధ విమానాలతో అమెరికాకు మద్దతుగా నిలిచాయి.

ALSO READ : మోదీ ట్వీట్లకు లైక్‌‌ల వర్షం..

2024 చివర్లో బషర్ అల్-అస్సాద్ పాలన పతనమైన తర్వాత.. సిరియాలో కొత్తగా ఏర్పడిన అహ్మద్ అల్-షారా ప్రభుత్వం అమెరికా దాడులకు పూర్తి మద్దతు ప్రకటించింది. గత నెలలో ట్రంప్‌తో వైట్ హౌస్‌లో భేటీ అయిన సిరియా కొత్త అధ్యక్షుడు అల్-షారా..ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనిపై సిరియా విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమ దేశంలో ఐసిస్‌కు ఎక్కడా సురక్షిత స్థావరాలు లేకుండా చేస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం సిరియాలో సుమారు 1,000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అస్సాద్ నియంతృత్వం నుంచి విముక్తి పొందిన సిరియాను ఒక సార్వభౌమ దేశంగా నిర్మించే క్రమంలో ఐసిస్ వంటి ఉగ్రవాదుల ముప్పులను తొలగించడం అత్యవసరమని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతీకార దాడులు ఐసిస్ వెన్ను విరిచాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇది ఇంకెన్ని రోజులు ఈ దాడులు కొనసాగుతాయనే ఆందోళనలు అంతర్జాతీయంగా కొనసాగుతున్నాయి.