వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరు

వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరు

కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యాసంగి పంటను పంజాబ్ తరహాలోనే కేంద్రం కొనాలని తీర్మానం చేశామన్నారు. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎల్పీలో సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వె వెళ్లి కేంద్ర ఆహార మంత్రిని కలిసి మెమొరాండం ఇస్తారని చెప్పారు. 30 లక్షల ఎకరాల్లో వచ్చిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యతను కేంద్రం తప్పించుకోవద్దన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మెలిక పెట్టకూడదన్నారు. యాసంగి వరిని కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు. ఎమ్మెస్పీ ఇచ్చేది బియ్యానికి కాదని.. ధాన్యానికి అని అన్నారు.  ఇది రైతుల జీవన్మరణ సమస్య అని, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రానికో విధానం ఉండకూడదని, దేశమంతటికీ ఒకే పాలసీ ఉండాలని కేసీఆర్ చెప్పారు. బాయిల్డ్ రైస్  కొంటరా? రా రైస్ కొంటారా? కేంద్రం ఇష్టమన్నారు. తమ దగ్గర ధాన్యం తీసుకోవాలని.. ఏ రైస్ చేసుకుంటారో అది కేంద్రం బాద్యత అని అన్నారు. బియ్యం కథ, దయ్యం కథం తమకెందుకన్నారు.  కేంద్రం కొనేదాకా ఉద్యమం ఆగదన్నారు.  కేంద్రం వినకపోతే యాక్షన్ ఓరియంటెడ్ గా తమ పోరాటం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం స్థాయిలో కేంద్రంపై  తమ పోరాటం ఉంటుందన్నారు. రైతుల కోసం ఎంతకైనా పోరాటం చేస్తామన్నారు. రాజకీయంగా కూడా సమాజాన్ని డివైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.