కేంద్రం వడ్లు కొనకుంటే రాష్ట్రం ఏమీ చేయలేదు

కేంద్రం వడ్లు కొనకుంటే రాష్ట్రం ఏమీ చేయలేదు
  • వడ్లన్నీ కేంద్రమే కొనాలె
  • పెట్రోల్​, డీజిల్​పై సెస్​ తీసేయాలె: కేసీఆర్
  • కేంద్రం నుంచి బండి సంజయ్​ ఆర్డర్​ తెస్తే నేనే దగ్గరుండి రైతులతో వరి వేయిస్త
  • ఢిల్లీ బీజేపీది ఓ మాట..  రాష్ట్రంలో సిల్లీ బీజేపీదీ ఇంకో మాట
  • ఉత్తరాది రైతుల ఆందోళనకు మద్దతిస్తం
  • సంజయ్​.. నన్ను జైల్లో పెట్టే దమ్ముందా?
  • మీ మెడలు విరుస్తం, నాలుగు ముక్కలు చేస్తం
  • అడ్డదిడ్డంగా మాట్లాడితే నాల్కలు చీరేస్తం
  • బలుపుతో నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నరు
  • మేమిచ్చే పైసలతోనే కేంద్రం నడుస్తున్నదని కామెంట్

హైదరాబాద్​, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందని, బాధ్యతను విస్మ రిస్తోందని సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. రాష్ట్రంలో వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్​ చేశారు. కొనుగోళ్లలో వాటాను తేల్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేబినెట్​తో పాటు తాను ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తానని ఆయన ప్రకటించారు.  బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్​ మనిషే అయితే వడ్ల కొనుగోళ్లపై కేంద్రం దగ్గర్నుంచి ఆర్డర్​ తీసుకురావాలని, అప్పుడు తానే దగ్గరుండి రైతులతో వరి వేయిస్తానని  అన్నారు. పెట్రోల్​, డీజిల్​పై  కేంద్ర ప్రభుత్వమే సెస్​ను తీసేయాలని డిమాండ్​ చేశారు. బండి సంజయ్​కు తనను జైల్లో పెట్టే దమ్ముందా అని ఆయన సవాల్​ విసిరారు. తన మెడలు వంచుడు కాదని, సంజయ్​ మెడనే నాలుగు ముక్కలు చేస్తానని హెచ్చరించారు.  పిచ్చి కూతలు కూస్తే నాల్కలు చీరేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించారు. ఇకపై దేశంలో అగ్గిరాజేస్తామని, చీల్చిచెండాడుతామని, ఉత్తర భారతదేశ రైతుల ఆందోళనలకు మద్దతిస్తామని చెప్పారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో ఢిల్లీ బీజేపీ ఒక మాట, రాష్ట్రంలోని సిల్లీ బీజీపీ మరో మాట మాట్లాడుతున్నదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్​లో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై, రాష్ట్ర బీజేపీపై నిప్పులు చెరిగారు. బలుపుతో తనమీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

దళితబంధు అమలు చేస్తం

హుజూరాబాద్​ సహా రాష్ట్రమంతా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పథకం ఆగదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు, కల్యాణలక్ష్మి, రూ. 2వేల పెన్షన్​ లాంటివి ఉన్నాయా? అని ప్రశ్నించారు.  ‘‘ఒక వెదవ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు చట్టం అంటాడు..చట్టం అంటే గౌరవం లేదా?  కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు, దళితులకు ఏం చేసింది? దేశంలో నిరుద్యోగం అట్లనే ఉంది.  2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన్రా? ప్రజల అకౌంట్లలో రూ. 15లక్షలు వేసిన్రా” అని అన్నారు.

కేంద్రం వడ్లు కొనకుంటే రాష్ట్రం ఏమీ చేయలేదు

ఖరీఫ్​లోనే ఇంకా ఎఫ్​సీఐ టార్గెట్​ ఇవ్వలేదని, యాసంగిలో వడ్లు కొనే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుందని, ఇప్పుడు తీసుకోబోమని స్పష్టం చేసిందన్నారు. కేంద్ర సహకారం లేకుండా వడ్లు కొనే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు.  ‘‘యాసంగి వడ్లలో నూకలు ఎక్కువగా వస్తయ్. అందుకే వాటిని బాయిల్డ్​ రైస్ చేయాల్సి వస్తుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్​ రైస్ తీసుకోం అంటోంది. గతేడాది 80 శాతం బాయిల్డ్​  రైస్, 20 శాతం రా రైస్ ఇవ్వాలని అడిగారు. 50 లక్షల టన్నుల్లో 45 లక్షల టన్నులు తీసుకుని, మిగతాది తీసుకోం అని అంటున్నరు. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు మొత్తం తీసుకోవాలని అడిగిన. భవిష్యత్‌‌లో బాయిల్డ్​ రైస్ ఇవ్వబోం అని రాసిస్తేనే, ఇప్పుడు మిగిలిన రైస్ తీసుకుంటాం అని కండిషన్ పెట్టిన్రు. దీంతో ఇక బాయిల్డ్​ రైస్ ఇవ్వబోం అని రాసి ఇచ్చేసినం. అయినా ఇంకో 5 లక్షల టన్నులు తీసుకోలేదు. గత యాసంగి వడ్లే ఇప్పటికీ ఉన్నయ్​. ఈ పరిస్థితుల్లో వరి వేయడం క్షేమదాయకం కాదు. ఈ సంవత్సరానికి ఎంత రైస్ తీసుకుంటరో చెప్పాలని అడిగితే.. ఇప్పటివరకూ చెప్పలేదు. వర్షాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి వేసిన్రు.. 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల రైస్‌‌ రాబోతున్నది. దాన్ని తీసుకునే దిక్కే లేదు. నేను నాలుగైదు రోజుల కింద కూడా ఫోన్ చేసిన.. రెండ్రోజుల్లో చెప్తం అన్నరు.. ఇప్పటికీ చెప్పలేదు. పైగా, 62 లక్షల ఎకరాల్లో వరి పంట లేనట్టుంది.. శాటిలైట్‌‌ పిక్చర్ చూపించడం లేదు అని అవమానించే విధంగా మాట్లాడుతున్నరు. అయినాసరే, ఈసారికి వడ్లు కొందాం అనే ధైర్యం చేసినం. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినం. ఇవి కొనే దిక్కేలుదుగానీ, యాసంగిలో వరి వేయండి అని బండి సంజయ్ చెబుతున్నడు. ఆయన మాటలు విని యాసంగిలో వరి వేస్తే, దెబ్బతింటాం. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నడు” అని కేసీఆర్​ అన్నారు. వరికి బదులు నువ్వులు, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఆ పంటలతో వరి కంటే ఎక్కువ లాభం వస్తుందన్నారు. యాసంగి సాగుకు అనుకూలంగా ఉండే పది రకాల పంటలను ఎంపిక చేశామని, అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిసి ఆ పంటల వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనబోం అని చెబుతుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు వరి పంట వేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘వాళ్ల మాటలు విని వరి పంట వేస్తే.. మంది మాట విని మార్వాణం పోయినట్టే అవుతుంది. కేంద్రం కొనుగోలు చేయకుండా రాష్ట్రం ఏమీ చేయలేదు” అని చెప్పారు. డిసెంబర్​ చివరి వరకు వరి వేసుకునే అవకాశం ఉందని, కేంద్రం నుంచి కొంటామని ఏమైనా వస్తే రైతులు వరి వేసుకోవాలని లేదంటే వద్దని ఆయన అన్నారు.

రెచ్చగొట్టుడే బీజేపీ పని

ఈ ఏడేండ్లలో దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని, చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘పాకిస్తాన్‌‌, బంగ్లాదేశ్‌‌ కంటే మన దేశ జీడీపీ తక్కువగా ఉంది. జీడీపీ నాశనమైంది. ప్రతి బావి వద్ద మీటర్‌‌ పెట్టాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నరు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నరు. రైతును ముంచి రాజకీయం చేయాలని చూస్తున్నరు. ఏడేండ్లు పోరాడితేగాని రాష్ట్రానికి హైకోర్టు ఇవ్వలేదు. రాష్ట్రానికి బండి సంజయ్​ ఏమైనా తెచ్చిన్రా?  కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి బాధ్యతగా మాట్లాడాలె. పాకిస్తాన్‌‌, చైనాను చూపి రెచ్చగొట్టడమే బీజేపీ పని.  సరిహద్దుల్లో చైనా వాడు ఊర్లకు ఊర్లే కడుతున్నడు. కొవిడ్‌‌ సమయంలో గంగానదిలో శవాలు తేలినయ్​” అని అన్నారు.

మస్తు చేసినం.. రైతులు కార్లు కొనుక్కుంటున్నరు

ప్రపంచంలో.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో స్కీంలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. ‘‘మిషన్ కాకతీయ చేపట్టి చెరువులు బాగు చేసినం. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి నిరంతరం నీళ్లు ఇస్తున్నం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నం. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దని రైతు బంధు తెచ్చినం. రైతు చనిపోతే కుటుంబం ఆగం కావొద్దని రైతు బీమా తెచ్చినం. ఇట్ల అనేక పథకాలు తెచ్చి.. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన వ్యవసాయాన్ని, ఈ ఏడేండ్లలో స్థిరీకరించినం.  రైతులకు లోన్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. వాళ్లే కార్లు కొనుక్కుంటున్నరు. ఏడేండ్ల కిందట ఎట్లున్నదో, ఇప్పుడు ఎట్లున్నదో రైతులకు తెలుసు. ఇన్నిరోజులు వడ్లు కొన్నం. కరోనా టైమ్‌‌లో కూడా పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించినం. ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.  తన బాధ్యతను విస్మరిస్తూ.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. ధాన్యం తీసుకోం అని మెలిక పెడుతున్నది. బాయిల్డ్ రైస్‌‌ అసలే తీసుకోబోం అని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా, వడ్లు కొనే స్థోమత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. మన దగ్గర ధాన్యం నిల్వకు గోడౌన్లు ఉండవు. ఎక్స్‌‌పోర్ట్ చేయాల్నంటే మళ్లీ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటది. ఢిల్లీకి పోయి అడిగితే పంట మార్పిడి చేయించండి, ఇతర పంటలు వేస్తే ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని చెప్పిన్రు” అని పేర్కొన్నారు. 

మీ మెడలు వంచుత బిడ్డా..!

బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. ‘‘యాసంగిలో వరి పంట వేయండి.. మెడలు వంచైనా కొనిపిస్తం అంటున్నడు.  సంజయ్‌‌కు నెత్తిలేదు.. నా కత్తిలేదు” అని దుయ్యబట్టారు. దమ్ముంటే ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్టు బయటపెట్టాలని సవాల్​ విసిరారు. ‘‘నన్ను జైలుకు పంపిస్తవా? నీకు బలుపా.. అహంకారమా? కండ్లు నెత్తికెక్కి సీఎం మీద, మంత్రుల మీద ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. నన్ను జైలుకు పంపి బతికి బట్టకడ్తవా? నన్ను టచ్ చేసి చూడు” అని బండి సంజయ్​ను  కేసీఆర్​ హెచ్చరించారు. ఇక మీదట ఊర్లలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదని వార్నింగ్​ ఇచ్చారు. ‘‘తెలంగాణ కోసం మీరు పది రూపాయల పనైనా  చేసిన్రా? మీ మెడలు వంచుత బిడ్డా..! ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అడుగడుగునా మిమ్మల్ని తరిమి కొట్టగలుగుతం.. దా.. రా .. నా మీద కేసు పెట్టి చూడు దమ్ముంటే. నీకు ఇంగ్లిష్​, హిందీ వస్తదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెటర్లు నీకు అర్థమవైతయా? అడ్డదిడ్డంగా మాట్లాడినా.. పిచ్చి కూతలు కూసినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటం. నాల్కలు చీరేస్తం” అని సంజయ్​ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.  ‘‘నాకు ఇంతెందుకు మంట మండుతుందంటే.. ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు. సంజయ్​.. ఎవరి మెడలు వంచుతవ్​​? నీ మెడలే నాలుగు ముక్కలు చేస్తం” అని మండిపడ్డారు.  ‘‘ఢిల్లీ బీజేపీ వరి కొనుగోలు చేయబోమని చెబుతుంటే ఇక్కడ సిల్లీ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​వరి వేసుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నడు. మితిమీరి, అడ్డదిడ్డంగా, చిల్లరగా, నీచంగా మాట్లాడుతున్నడు. నన్ను వ్యక్తిగతంగా నిందించినా పడ్డా. నాకంటే తక్కువ స్థాయి కదా అని పట్టించుకోలేదు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటయి కదా అని ఊరుకున్న. బండి సంజయ్​ మనిషి అయితే కేంద్రం దగ్గర్నుంచి ధాన్యం కొంటామని ఆర్డర్​ తీసుకురావాలి. నేనే దగ్గరుండి వరి సాగు చేయిస్త.. మంచి విత్తనాలు సప్లయ్​ చేయిస్తా.. నీళ్లు, ఎరువులు అన్ని ఇస్త. కేంద్రం వడ్లు కొంటుంటే నేను వద్దన్నానా? వరి కొంటామంటూ కేంద్రం నుంచి బీజేపీ నేతలు లేఖ తేవాలె. వానాకాలం ధాన్యం మొత్తం కొనే వరకు బీజేపీని నిద్రపోనివ్వకుండా వెంటపడుతా” అని కేసీఆర్​ హెచ్చరించారు.  ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పినందుకే, రాష్ట్రంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరుతున్నామన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు కేంద్రంతో పోరాడతామని చెప్పారు.  

ఫెడరల్​ ఫ్రంట్​పై ఇప్పుడు ఆలోచన లేదు

ఫెడరల్​ ఫ్రంట్​పై ఇప్పుడు ఆలోచన లేదని, బీజేపీ విధానాలను ఎండ గట్టడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే పనిగా ఉందని కేసీఆర్​ చెప్పారు. నీటి వాటాలపై  కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ లు డ్రామాలు అన్నారు. నీటి వాటా తేల్చేందుకు ఏడేండ్లు పడుతుందా అని ప్రశ్నించారు.

చుక్కలు చూపిస్తం.. నిద్రపోనియ్యం

కేంద్రానికి ఇక నుంచి చుక్కలు చూపిస్తామని, రాష్ట్రంలోనూ బీజేపీని నిద్రపోనివ్వబోమని కేసీఆర్ అన్నారు. అన్ని కుట్రలు బయట పెడుతామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇన్నాళ్లూ కేంద్రానికి అనేక రకాలుగా మద్దతిచ్చామని, ఇక సమస్యలపై పార్లమెంట్ దద్దరిల్లేలా చేస్తామని చెప్పారు. బార్డర్స్ ఇష్యూస్​ను ఎన్నికల్లో వాడుకుంటూ, మత రాజకీయాలు చేస్తూ  దేశాన్ని బీజేపీ ఆగం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ధర్నాలు చేయడం కాదని, ఇక తామే ధర్నాలు చేస్తామన్నారు. సాగు చట్టాల రద్దుకు ఢిల్లీలో ఆందోళన చేస్తామని చెప్పారు. పెట్రోల్​, డీజిల్​పై సెస్​ పూర్తిగా ఎత్తివేయాలని, ఇందుకోసం పార్లమెంట్​లో కొట్లాడుతామని చెప్పారు. ఈ విషయంలో ఏ రాష్ట్రం తమతో వచ్చినా కలుపుకుని పోతామన్నారు.

మమ్మల్ని వ్యాట్​ తగ్గించాలని ఏ సన్నాసి అడుగుతడు?

‘‘పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్​లో మేం నయా పైసా పెంచలేదు. మమ్మల్ని తగ్గించాలని ఏ సన్నాసి గాడు అంటడు. పెంచినోళ్లు తగ్గించాలి” అని కేసీఆర్​ అన్నారు. 2014లో క్రూడ్​ ఆయిల్​ ధర 105.52 డాలర్లు ఉండగా ఇప్పుడు ధర 83 డాలర్లే ఉందని,  బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి 105 డాలర్లు దాటలేదని  చెప్పారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్​లో ఆయిల్​ ధరలు పెరిగాయని అబద్ధం చెప్పిన్రు. సుంకం పెంచాల్సి ఉండగా సెస్ రూపంలో రాష్ట్రాల వాటా ఇవ్వకుండా లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లేలా చేస్తున్నరు. రాష్ట్రాల వాటాను కేంద్రం ఎగ్గొడుతూ సెస్‌ పెంచుకుంటూ పోయింది. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయనే.. కొండంత పెంచిన పెట్రో ధరలను పిసరంత తగ్గించింది” అని ఆయన విమర్శించారు. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. సెస్​ ఎత్తివేస్తే పెట్రోల్​ రూ.77 కే లీటర్​కు అమ్మొచ్చని చెప్పారు. ‘‘కేంద్రాన్ని సాదుతున్నది తెలంగాణ రాష్ట్రమని రిజర్వ్​బ్యాంక్​ చెబుతున్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఏడేండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు. ఇప్పటి దాకా రూ. 42 వేల కోట్లు మాత్రమే వచ్చినయ్” అని కేసీఆర్​ పేర్కొన్నారు.

ఒక ఎలక్షన్​ వస్తది, పీకుతది.. అది ఒక ఇష్యూనా?

‘‘రాజకీయపార్టీ అన్నంక గెలుస్తుంటం.. ఓడుతుంటం. హుజూరాబాద్​ లాంటి ఎలక్షన్లు ఎన్నో చూసినం. ఒక ఎలక్షన్​ వస్తది, పీకుతది.. అది ఒక ఇష్యూనా?” అని కేసీఆర్ ​ అన్నారు. ‘‘హుజూరాబాద్​ బైపోల్​లో బీజేపీ గెలిచిందని మాట్లాడుతున్నరు. నాగార్జున సాగర్​ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఎన్ని ఓట్లొచ్చినయ్​.. డిపాజిట్​ కూడా రాలేదు.  మొన్న వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో చాలా చోట్లా బీజేపీ ఓడిపోయిన సంగతి మరిచిపోయిండ్రా? పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ మా గురించి మాట్లాడ్తదా? 2018 ఎన్నికల్లో 103 ఎమ్మెల్యేలతో గెలిచిన మాది పవర్​ ఫుల్​ పార్టీ. మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి 11‌‌ 0మంది ఎమ్మెల్యేల బలం ఉంది” అని పేర్కొన్నారు.