కృష్ణా నీళ్ల కోసం పోరాడుతం

కృష్ణా నీళ్ల కోసం పోరాడుతం
  • పార్లమెంటులో ఏపీ వైఖరిని ఎండగడుతాం
  • అన్ని వేదికలపై బలమైన వాదనలు వినిపిస్తం
  • రైతులకు సాగునీటి కష్టాలు రానివ్వం
  • ఇరిగేషన్‌‌ రివ్యూలో సీఎం కేసీఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణానదిలో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని సీఎం కేసీఆర్‌‌ చెప్పారు. కృష్ణా నదీ జలాల వినియోగం, ఏపీ ప్రభుత్వ వైఖరిపై మంగళవారం ప్రగతి భవన్‌‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ అనుసరిస్తున్న తీరు, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని వేదికలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు రానియ్యమని చెప్పారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవసరమైన కరెంట్‌‌ కోసం జలవిద్యుత్‌‌ ఉత్పత్తి కొనసాగిస్తామన్నారు. పార్లమెంట్‌‌ సమావేశాల్లో ఏపీ వైఖరిని ఎండగడుతామని తెలిపారు. ట్రిబ్యునల్స్‌‌, న్యాయస్థానాల్లో బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా తేల్చాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశామని, దీనికోసం కృష్ణా బోర్డు, ట్రిబ్యునల్‌‌ తదితర వేదికలపై బలంగా వాదించాలని అధికారులకు సూచించారు. నదీ జలాల్లో హక్కులు రాబట్టుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై వారికి దిశానిర్దేశం చేశారు. 

నదీ జలాల విషయంలో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న వివక్షను ఎలుగెత్తి చాటాలన్నారు.‘పాలమూరు’పై పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించండి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, ఇంజనీర్లను కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ ప్రాజెక్టుకు మొదటి దశ అనుమతులు ఇచ్చి, రెండో దశ పర్మిషన్‌‌లు పెండింగ్‌‌లో పెట్టిన విషయం గుర్తు చేసినట్టు సమాచారం. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జల వివాదం మొదలుకావడంతో పాలమూరుకు ఆటంకం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. గతంలోనే పర్యావరణ అనుమతుల కోసం పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌‌ జారీ చేసినా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రద్దు చేశారు. భూసేకరణపై రైతుల ఆందోళనలు, ఎన్‌‌జీటీ, సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్‌‌లో ఉండటంతో వాటివల్ల ప్రాజెక్టు పనులకు బ్రేక్‌‌ పడకుండా చూడాలని సీఎం సూచించినట్టు తెలిసింది. వీలైనంత త్వరగా ఈఎన్సీ నోటిఫికేషన్‌‌ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, వాటి ఆధారంగా భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ నుంచి తుది దశ పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించినట్టుగా సమాచారం. సీఎం ఆరు గంటలకు పైగా ఇరిగేషన్‌‌పై సమీక్షించగా, అందులో ఎక్కువ సమయం పాలమూరు పర్యావరణ అనుమతులు, పబ్లిక్‌‌ హియరింగ్‌‌, ఇతర అంశాలపైనే చర్చించినట్టు తెలిసింది. సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌‌శర్మ, సీఎస్‌‌ సోమేశ్‌‌కుమార్‌‌, స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌కుమార్‌‌, సీఎంవో ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ నర్సింగ్‌‌రావు, సీఎంవో సెక్రటరీలు స్మితా సబర్వాల్, భూపాల్‌‌రెడ్డి, ఓఎస్డీలు శ్రీధర్‌‌ దేశ్‌‌పాండే, ప్రియాంక వర్గీస్‌‌, ఈఎన్సీ మురళీధర్‌‌, అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ పాల్గొన్నారు.