- ఎట్లనన్న గెలవాలె
- కేసీఆర్ ఫోకస్ అంతా గ్రాడ్యుయేట్ ఎన్నికలపైనే..
- 12 రోజులుగా ప్రగతిభవన్లోనే మకాం.. ఫామ్ హౌస్ వైపు తొంగిచూడని సీఎం
- రెండు సీట్లు కచ్చితంగా దక్కించుకోవాలని వ్యూహాలు
- క్యాండిడేట్ల ఎంపిక నుంచి ప్రచారం దాకా పర్యవేక్షణ
- ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలు
- ఉద్యోగుల ఓట్ల కోసం మళ్లీ తెరపైకి పీఆర్సీ అంశం
హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో ఆ పార్టీకి ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా మారాయి. రెండు సీట్లు కచ్చితంగా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకే క్యాండిడేట్ల ఎంపిక, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ సహా అన్ని విషయాలను స్వయంగా సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. వారంలో రెండు మూడు రోజులు ఫామ్ హౌస్లో గడిపే ఆయన.. గత పన్నెండు రోజులుగా ప్రగతిభవన్ లోనే ఉంటూ అంతా నడిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంపై మంత్రులు, లీడర్లకు సూచనలు చేస్తున్నారు. ఈ నెల 14న గ్రాడ్యుయేట్ సీట్లకు పోలింగ్ జరగనుంది. నాలుగు రోజులే ఉండటంతో కేసీఆర్ రోజులో ఎక్కువ టైమ్ ఈ ఎన్నికలపైనే ఫోకస్ పెడ్తున్నట్టు చర్చ జరుగుతోంది.
వరదలొచ్చినప్పుడు ఫామ్ హౌస్‌లోనే..
సీఎం కేసీఆర్ ఎక్కువగా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో గడుపుతుంటారు. అక్కడి నుంచే పాలనను పర్యవేక్షిస్తుంటారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు, కరోనా వైరస్ వ్యాప్తి టైమ్ లో కూడా ఎక్కువ రోజులు ఫామ్ హౌస్లోనే ఉన్నారు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన తర్వాత సీన్ మారింది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ స్థానం నుంచి పీవీ బిడ్డ వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసినప్పటి నుంచి కేసీఆర్ ప్రగతిభవన్ లోనే ఉంటున్నారు. గత నెల 26న ఎన్నికల ప్రచారం కోసం ఇన్ చార్జ్ మంత్రులను నియమించేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు. తర్వాతి రోజు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ కు పిలిపించుకుని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఈనెల 4న యాదాద్రి పనుల పర్యవేక్షణ కోసం అక్కడికి వెళ్లి, ఆ రాత్రి మాత్రం ఫామ్ హౌజ్ కు వెళ్లారు. కానీ తెల్లారే ప్రగతిభవన్ కు వచ్చారు.
కేసీఆర్ సూచనతోనే ఆత్మీయ సమ్మేళనాలు
సీఎం కేసీఆర్ సూచనల మేరకే టీఆర్ఎస్ లీడర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్స్కు వెళ్లాలంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీసర్లు ఆదేశాలు ఇస్తున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా బ్రహ్మణులు, వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, స్టూడెంట్లు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రైవేటు విద్యాసంస్థల ఓనర్లతో టీఆర్ఎస్ సమ్మేళనాలు నిర్వహించింది. సమావేశాలకు కావాల్సిన వనరులను ఆ పార్టీ లీడర్లే సమకూర్చినట్టు ప్రచారం ఉంది.
ఉద్యోగులకు పీఆర్సీ ఎర
రెండున్నరేండ్లుగా పీఆర్సీ అమలు చేయక ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎంప్లాయిస్ తమకు వ్యతిరేకంగా ఓటేస్తారని సీఎం కేసీఆర్ ఊహించారు. దీంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు పోలింగ్ కు ఐదు రోజుల ముందు ఉద్యోగ సంఘాల లీడర్లకు ఫోన్ చేసి ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. టీచర్ సంఘాలకు చెందిన పీఆర్టీయూ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. త్వరలో పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్టు మీటింగ్ తర్వాత ఉద్యోగ సంఘాల లీడర్లు చెప్పారు.
అందుకే ఇంత ఫోకస్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ టీఆర్ఎస్ భవిష్యత్ ను నిర్ణయిస్తాయని పార్టీ లీడర్లు భావిస్తున్నారు. రెండు స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని చెప్పుకోవడంతోపాటు ఆ పార్టీ దూకుడుకు కళ్లెం వేయొచ్చని అనుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఉనికే లేదని క్లారిటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం టీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ కరువైందనే వాదన బలపడుతుందని చెబుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. త్వరలో జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ముందే గ్రహించిన కేసీఆర్.. స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని చూసుకుంటున్నట్లు పార్టీ లీడర్లు చెప్తున్నారు.
ఏ మంత్రి.. ఎవరితో మాట్లాడాలి..
కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఎలక్షన్లను ఇంత సీరియస్ గా తీసుకోవడం ఇదే మొదటిసారి అని పార్టీలోని సీనియర్ లీడర్లు చెబుతున్నారు. గతంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్ల బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి.. అడపాదడపా సూచనలు మాత్రమే చేసే వారని అంటున్నారు. దుబ్బాక ఎన్నికల బాధ్యతను హరీశ్రావుకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలను కేటీఆర్కే అప్పగించారు. కానీ ఆ ఎన్నికల్లో ఊహించని రీతిలో పార్టీకి షాక్ తగిలింది. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేరుగా జోక్యం చేసుకుంటున్నట్టు పార్టీ లీడర్లు అంటున్నారు. మంత్రులకు ఇన్ చార్జులుగా బాధ్యతలు అప్పగించినా.. ఏ మంత్రి, ఏ రోజు, ఏ టైమ్ లో, ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మీటింగ్ పెట్టాలనేది ఆయనే స్వయంగా ఆదేశిస్తున్నారని చెబుతున్నారు.
