
- జులై 15లోగా రాంపూర్ పంప్‌హౌస్ కావాలె
- ప్రాజెక్టులు కట్టేందుకు దశాబ్దాలు పడుతుండె
- మేం రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసినం
- ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నది
- ఈ ఏడాది 150 టీఎంసీలు ఎత్తిపోయాలె
- కాళేశ్వరం, పాలమూరు, సీతారామ పూర్తయితే రాష్ట్రంలో కరువే ఉండది
- రాంపూర్ పంప్‌హౌస్, మేడిగడ్డ పనుల పరిశీలన
- గోదారికి నాణేల మొక్కు చెల్లించుకున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం నీళ్లతో మొదట తడిసేది శ్రీరాంసాగర్ (పోచంపాడు) ఆయకట్టేనని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాదే గోదావరి నీళ్లను రివర్స్ పంపింగ్ చేసి పోచంపాడు ప్రాజెక్టును నింపుతామన్నారు. మంగళవారం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మిస్తున్న రాంపూర్ పంప్‌హౌస్‌ను సీఎం పరిశీలించారు. పంప్‌హౌస్ పనులను జులై 15లోగా పూర్తి చేయాలని, రోజు విడిచి రోజు ఈ పనులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని గేట్ల బిగింపు పనులను పరిశీలించారు. తర్వాత కాఫర్ డ్యాం మీదుగా గేట్లు నిర్మిస్తున్న ఐదు ప్రాంతాల్లో ఆగి పనులను పర్యవేక్షించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులను పలకరించారు. తర్వాత అక్కడే అధికారులతో సమీక్షించారు. పది రోజుల్లోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.
‘‘ప్రాజెక్టులు నిర్మించేందుకు గతంలో దశాబ్దాలు పట్టేది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో అట్లనే జరుగుతోంది. అలాంటిది రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను పూర్తి చేశాం. ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్లను పూర్తి చేస్తుండటంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. వలస పాలనలో నత్తనడక నడిచిన ప్రాజెక్టులు స్వయం పాలనలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి అవుతున్నాయి. సమష్టి కృషితోనే కాళేశ్వరం నిర్మాణం ముగింపు దశకు చేరుకున్నది. కొద్దిరోజుల్లోనే వర్షాలు పడతాయి కాబట్టి మిగతా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లను బీళ్లకు మళ్లించాలి’’ అని అధికారులు, వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు.
చుక్క నీరు కూడా లీక్ కావొద్దు
మేడిగడ్డ బ్యారేజీకి 85 గేట్లను బిగించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. బ్యారేజీ నుంచి చుక్క నీరు కూడా లీకేజీ కాకుండా రబ్బర్ సీలింగ్ పనులను వారం పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు 26 గేట్లకు సీలింగ్ చేశామని ఇంజనీర్లు వివరించారు. మిగతా 59 గేట్ల పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెలలోనే గోదావరి నీళ్లను ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రాణహితలో వచ్చే తొలి వరదను మేడిగడ్డ వద్దే ఆపి కన్నేపల్లి పంప్‌హౌస్ ద్వారా అన్నారం బ్యారేజీకి, అక్కడి నుంచి సుందిళ్లకు అట్నుంచి ఎల్లంపల్లికి తరలించాలన్నారు. కన్నేపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు 3 టీఎంసీల నీటిని తరలించే గ్రావిటీ కాల్వ పని పూర్తయిందని అధికారులు తెలిపారు.
కన్నేపల్లికి ఎగువన పనులన్నీ పూర్తి కావడంతో ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలన్నారు. నందిమేడారం పంప్‌హౌస్ నుంచి ఎస్సారెస్పీ వరద కాల్వకు, మిడ్ మానేరు డ్యాంకు, అక్కడి నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించాలని సీఎం సూచించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవంలో భాగంగా నిర్మిస్తున్న రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట, ముప్కాల్ పంప్‌హౌస్‌లను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఈ పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి నీళ్లను రివర్స్ పంపింగ్ చేసి ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మిడ్ మానేరు ద్వారా మల్లన్నసాగర్ వరకు చెరువులు, కుంటలను నింపాలన్నారు. ఈ ఏడాది 150 టీఎంసీల గోదావరి నీళ్లను ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టుల దగ్గరే శాశ్వత భవనాలు
చిన్న ఇల్లు కట్టుకుంటేనే చిన్న చిన్న మరమ్మతులు వస్తాయని అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. గోదావరిలో వరద మొదలు కాగానే ట్రయల్ రన్ చేసి లీకేజీలకు మరమ్మతులు చేయాలన్నారు. బ్యారేజీ టు బ్యారేజీకి నీటి తరలింపు సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ, సెల్‌ఫోన్లు, వైర్‌లెస్ వాకీటాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీటిని తరలించే క్రమంలో నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. ఇందుకుగాను ప్రాజెక్టుల దగ్గరగా శాశ్వత భవనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దేవుడు కరుణించి అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రాజెక్టులకు దేవతలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు పెట్టుకుందామని తెలిపారు. మంచిరోజు చూసుకొని ప్రాజెక్టును గొప్పగా ప్రారంభించుకుందామన్నారు.
రాంపూర్‌లో ఐదు పంపులు సిద్ధం చేయండి
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మిస్తున్న రాంపూర్ పంప్‌హౌస్‌లో ఎనిమిది మోటార్లకు గాను ఐదింటిని నెలరోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మిగతా మోటార్లను ఆగస్టు నాటికి బిగించాలని సూచించారు. వీటిని రన్ చేయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. గోదావరిలో అక్టోబర్, నవంబర్ నెలల వరకు నీటి ప్రవాహం ఉంటుందని, అప్పటి వరకు ఎస్సారెస్పీకి రివర్స్‌కు పంపింగ్ జరుగుతూనే ఉంటుందని చెప్పారు. శ్రీరాంసాగర్ ఆయకట్టుకు రెండో పంటకు నీళ్లందించాలనే లక్ష్యంతో పనులు చేయాలని సూచించారు. మరింత మంది సిబ్బందిని పెట్టి మూడు షిఫ్టుల్లో పనులు చేయించాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలు పూర్తయితే తెలంగాణాలో కరువన్నదే ఉండబోదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే 80 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమలకు నీళ్లందించే బృహత్తర ప్రాజెక్టు అన్నారు. ఇది పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్‌సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు తదితరులు ఉన్నారు.
గోదావరి మాతకు నాణేల మొక్కు
బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో పాయలా ప్రవహిస్తున్న గోదావరి నదిలోకి దిగి సీఎం కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. గోదావరి మాతకు మొక్కు పైసలను సమర్పించుకున్నారు. తన వెంట తెచ్చిన బస్తెడు పైసలను నీటిలో ఒదిలారు. నీటిని తలపై చల్లుకొని మొక్కారు. వెంట వచ్చిన నాయకులకు నాణేలు అందించి నదిలో జారవిడువాలని సూచించారు. కొద్ది రోజుల్లోనే బ్యారేజీ నిర్మాణం పూర్తవుతుందని, ఏడాది పొడువునా ఈ ప్రాంతంలో నీరు నిలిచి ఉంటుందని కాబట్టి ఇకపై ఇక్కడ ఎవరూ నిలబడలేరని సీఎం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గంటకు పైగా ఉండి పనులను పరిశీలిం చారు.