యాదిలో.. మైసూరు నవాబు.. ఆయన చరిత్ర ఇదే..!

యాదిలో.. మైసూరు నవాబు.. ఆయన చరిత్ర ఇదే..!

మైసూరు చరిత్రకారుల ప్రకారం హైదర్​ అలీ మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందినవాడు. హైదర్​ అలీ1717లో మైసూర్​లోని బుడికోట్​లో పుట్టాడు. అతని తండ్రి పేరు ఫతే మహమ్మద్.1749లో హైదర్ మైసూర్​ సైన్యంలో తన అన్న షాబాజ్ పలుకుబడితో ఉద్యోగంలో చేరాడు. హైదర్​కు భయమంటే తెలియదు. అతని ధైర్యం మైసూర్ అమాత్యులైన నాన్​రాజ్​ దృష్టిని ఆకర్షించింది. దాంతో ఆయన హైదర్​కు మొదటి ప్రమోషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మైసూర్ దళంతో నసీర్ జంగ్​కు సాయం చేయడానికి వెళ్లాడు. 

అలా నసీర్ జంగ్, హైదరాబాద్​ నిజాం ఖాళీ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. కానీ, అతడిని ఫ్రెంచ్​వాళ్లు ఓడించి, చంపేశారు. దాంతో మైసూర్ దళాలు వెనుదిరిగాయి. కానీ, హైదర్​ అయోమయ పరిస్థితిలో నసీర్ జంగ్​ సంపదలో కొంతభాగం దోచుకునేందుకు సాయపడి, సొంత నిధులను సమకూర్చుకున్నాడు. ఆయన 1500 అశ్విక దళం, 3000 కాల్బలాన్ని సమకూర్చుకుని దక్కన్ బ్రాహ్మణుడైన ఖండేరావును కార్యదర్శిగా నియమించుకున్నాడు. 1755లో ఆయన దిండిగల్​ గవర్నర్​గా ఉద్యోగ ఉన్నతి పొందాడు. అతడు ఆ పదవిని వెంటనే పాండిచ్చేరి ఫ్రెంచి అధికారుల సాయంతో ఎంతో బలోపేతం చేశాడు. ఆ సమయంలోనే ఆయనకు ఫ్రెంచి భాష పట్ల అమితమైన ఇష్టం కలిగింది. 

1757లో కొత్త నిజాం సలాబత్​ జంగ్​, తన ఫ్రెంచి సలహాదారుడు ఎండి. బుస్సీతో కలిసి కప్పం వసూలు చేయడానికి మైసూర్​కు వెళ్లాడు. తన సోదరుడైన దేవరాజ్​శతృత్వం వల్ల ఆటంకం ఎదురైనప్పటికీ నాన్​రాజ్ దేవాలయాలన్నింటినీ దోచుకుని 18 లక్షలు చెల్లించి సలాబత్​ జంగ్​ను కొనేశాడు. ఆ నిజాం వెళ్లగానే 3వ పీష్వా అయిన బాలాజీ బాజీరావు నేతృత్వంలో మరాఠాలు వచ్చారు. వాళ్లను లక్షల రూపాయలు, విలువైన జిల్లాలను తాకట్టుపెట్టి కొనడంతో మైసూరు ఖజానా ఖాళీ అయింది. 

జీతాలు లేకపోవడంతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. నాన్​రాజ్ హైదర్​ అలీకి కబురు పంపాడు. అతని ఆజ్ఞతో ఖండేరావు జాగ్రత్తగా లెక్కలన్నీ తనిఖీ చేసి తిరుగుబాటుదారుల డిమాండ్లను కొంత మొత్తానికి తగ్గించి, 4 వేల మందిని తొలగించి, మిగతా వాళ్లకు, వాళ్ల నాయకులకు ఆస్తులను కొల్లగొట్టి చెల్లించాడు. సైన్యం విధేయత చూపింది. హైదర్​ అలీ, పీష్వాతో సంధిని రద్దు చేశాడు. 

గోపాలరావు పట్వర్థన్​ ఆధ్వర్యంలో మరాఠా దళం మళ్లీ వచ్చింది. హైదర్​ అలీ పట్వర్థన్​ మీదికి వెళ్లి, తన తెలివితేటలతో అతడు తాకట్టుపెట్టిన జిల్లాలను ఆక్రమించుకోకుండా విఫలం చేశాడు. దాంతో పట్వర్థన్ కొన్ని షరతుల మీద వెనుదిరిగాడు. హైదర్ సాహసాన్ని చూసిన రాజా చిక్కరాజ్​ అతనికి కృతజ్ఞత చూపిస్తూ ఫతే హైదర్ బహదూర్​ అనే బిరుదు ఇచ్చాడు. 

1763లో హైదర్​ అలీ బద్నూర్​కు తన సంస్థానంలో కలుపుకున్నాడు. ఆ తర్వాత కొత్త పీష్వా మాధవరావు హైదర్​ అలీ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఓడించాడు. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి హైదర్​ అలీ తన దృష్టిని మలబారు కోస్తా మీదికి మళ్లించాడు. ఆ తర్వాత1767 నుంచి 1769 వరకు మద్రాస్​లోని ఇంగ్లిష్​ వారితో, ఆర్కాబు నవాబు మొహమ్మద్ అలీతో యుద్ధం చేశాడు. బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న ఒక్కొక్క జిల్లాను ఆక్రమించుకుంటూ మద్రాసుకు ఐదు మైళ్ల దూరానికి చేరుకున్నాడు. ఈ సాహసానికి తగిన ప్రతిఫలంగా మద్రాసు ప్రభుత్వం రక్షణ ఒప్పందం చేసుకుంది. ఆ వెంటనే హైదర్​ అలీ మరాఠా దండయాత్రను మళ్లీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మరెన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ జయాపజయాలను విస్మరిస్తూ సాహసోపేతంగా ముందుకెళ్లాడు. 

1782 జూన్​ 2న హైదర్ అలీ చివరి యుద్ధం చేశాడు. అప్పటికే కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 7న చిత్తూర్ శిబిరంలో మరణించాడు.  హైదర్​ అలీ మైసూర్​కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టాడు. నిరక్షరాస్యుడైనా దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించాడు. వారసులకు గొప్ప ఖజానా, సమర్థవంతమైన సైన్యాన్ని ఇచ్చాడు. 

- మేకల మదన్​మోహన్​ రావు, కవి, రచయిత-

మరిన్ని వార్తలు