యాదాద్రి పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు సీఎం కేసీఆర్. వచ్చే ఫ్రిబ్రవరిలో ప్రధానాలయ దర్శనాలను పునరుద్దరిస్తామన్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మహా సుదర్శన యాగం నిర్వహిస్తున్నామని.. దీనికి దేశంలోని మఠాధిపతులు, వేద పండితులు, వీఐపీలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. చినజీయర్ 64వ తిరునక్షత్ర వేడుకల్లో భాగంగా ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లారు సీఎం కేసీఆర్. చినజీయర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత సీఎంను ఘనంగా సన్మానించారు చినజీయర్ స్వామి. పెదజీయర్ పై రాసిన సత్య సంకల్ప పుస్తకాన్ని సీఎంకు బహూకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. హైందవ సంస్కారాలు ఎంతో గొప్పవని.. వాటికి వచ్చిన ఇబ్బందేమీలేదన్నారు కేసీఆర్. జీయర్ స్వాముల స్పూర్తితో ముందుకెళ్తామన్నారు. శంషాబాద్ లో రామానుజ విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు సీఎం. యాదాద్రి ప్రారంభోత్సవ పనుల బాధ్యతలను వికాస తరంగిణి సంస్థకు అప్పగిస్తామన్నారు.
యాదాద్రి ఆలయం ఒక మెగా ప్రాజెక్టన్నారు త్రిదండి చినజీయర్ స్వామి. కేసీఆర్ యాదాద్రిని ఉత్తమ క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. యాదాద్రి తర్వాత వేములవాడ, మట్టపల్లి క్షేత్రాలను అభివృద్ది చేసేందుకు సీఎం నిర్ణయించారన్నారు. తన జన్మదినం సందర్భంగా ఆశ్రమానికి సీఎం రావడం సంతోషంగా ఉందన్నారు.
