కాంగ్రెస్​ గెలిస్తే దళారుల రాజ్యం : కేసీఆర్​

కాంగ్రెస్​ గెలిస్తే దళారుల రాజ్యం : కేసీఆర్​
  • ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ పార్టీ అధికారంలోకి వస్తది : కేసీఆర్​ 
  • ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న కాంగ్రెస్​నే కలిపేయాలి
  • మా మేనిఫెస్టో అద్భుతం.. కుల, మత విభేదాల్లేకుండా రూపొందించినం
  • రాబోయే రోజుల్లో జనగామ వజ్రపు తునక అయితది
  • యాదాద్రికి కాళేశ్వరం నీళ్లు రప్పిస్తున్నట్లు ప్రకటన
  • జనగామ, భువనగిరిలో పర్యటన.. బీఆర్​ఎస్​లో చేరిన పొన్నాల

జనగామ/యాదాద్రి, వెలుగు :  కాంగ్రెస్ పార్టీకి సంస్కారం లేదని, దీంతోనే ఆ పార్టీ నుంచి పొన్నాల లక్ష్మయ్య బయటకు వచ్చారని బీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్​అన్నారు. ప్రజలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దీంతో దళారుల రాజ్యం వస్తుందని చెప్పారు. ‘‘మళ్లీ కాంగ్రెస్​ పవర్​లోకి వస్తే ఇప్పుడున్న దళితబంధు, రైతు బంధుతోపాటు, 24 గంటల కరెంట్, ధరణి పోర్టల్​ అన్నింటినీ రద్దు చేస్తరు..

’’ అని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టో అద్భుతమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపిస్తే మేనిఫెస్టో లోని పథకాలన్నింటినీ అమలు చేస్తామని, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. సోమవారం జనగామ, భువనగిరిలో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్​ పాల్గొన్నారు. జనగామ సభలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్​ఎస్​లో చేరారు. 

రెండు సభల్లో కేసీఆర్​ మాట్లాడారు. కులం, మతం, జాతి విభేదాలు లేకుండా తాము ఎన్నికల మేనిఫెస్టో రూపొందించామని, మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం భువనగిరిలో అరాచకశక్తులను పెంచిపోషించిందని, వాటిన్నింటినీ బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఏరిపారేసిందని, దాంతో భువనగిరి ప్రజలు శాంతియుత జీవనం సాగిస్తున్నారని కేసీఆర్​ చెప్పారు. ‘‘కాంగ్రెస్​ పార్టీ సంస్కారం లేకుండా తయారైంది. దాంతోనే ఆ పార్టీ సీనియర్​ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్​ఎస్​లో చేరారు” అని తెలిపారు. తాను వ్యవసాయ భూములపై సర్వ హక్కులను భూయజమానులకు ఇస్తూ ధరణిని తెచ్చానని, దాన్ని తొలగిస్తామని కాంగ్రెస్​ అంటోందని మండిపడ్డారు.

‘‘వ్యవసాయ భూమిని కౌలుకు ఇస్తరు.. అట్లనే బంజరాహిల్స్​లో ఇండ్లను కిరాయికి ఇస్తరు.. కిరాయి అంటే కౌలు అన్నట్లే.. మరి అక్కడ కూడా హక్కు కల్పిస్తరా..?’’ అని ప్రశ్నించారు. తన ప్రాణమున్నంత వరకు ధరణిని పోనియ్యనని చెప్పారు. ధరణిని కాంగ్రెస్​ పార్టీ బంగాళాఖాతంలో కలుపుతామంటున్నదని, ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. ఆపదమొక్కుల పార్టీలకే ఓటెయ్యొద్దని సూచించారు. 

జనగామ వజ్రపు తునక.. యాదాద్రికి కాళేళ్వరం నీళ్లు

‘‘ఒక్క చాన్స్​ అంటున్న కాంగ్రెస్​కు గతంలో 10 చాన్స్​లు ఇస్తే ఏం జేసిన్రు? కరువు, కరెంటు కొరత, మోటార్లు కాలుడు, కరెంటోళ్లకు లంచాలు, ఆగమాగం పరిస్థితులు ఉండేది. ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నం. పండిన ధాన్యాన్ని మేమే కొంటున్నం. లక్షల టన్నుల ధాన్యం పండుతుంటే లక్ష్మీ దేవత తాండవ మాడినట్లు ఉంది” అని కేసీఆర్​ చెప్పారు. ‘‘ఉద్యమ టైంలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు వస్తే కరువుతో యువకులంతా వలస పోయిన్రు. చెరువులు ఎండిపోయి ఉన్నయ్​. దుర్భర పరిస్థితి చూసి గొడగొడ ఏడ్చిన. కాళేశ్వరం నీళ్లతో మల్లన్నసాగర్​ నుంచి తపాస్​పల్లికి లింక్​ చేస్తున్నం. అక్కడి నుంచి ఇక్కడి రిజర్వాయర్​లకు నీళ్లిస్తం. దేవాదుల నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉండేలా గోదావరిపై సమ్మక్క బ్యారేజీని కట్టుకున్నం. ఎండలల్లో కూడా నీటిని లిఫ్ట్​ చేసుకోవచ్చు. ఎక్కడ కరువొచ్చినా జనగామకు రానివ్వం. యేడాది పొడవునా పంటలు పండించుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో జనగామ వజ్రపు తునక అవుతుందని అన్నారు. తాను బతికున్నంత కాలం దళిత బంధు ఉంటదని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహాస్వామి ఆశీస్సులతో యాదాద్రి జిల్లా కల సాకారమైందని కేసీఆర్​అన్నారు. ‘‘ఈ జిల్లాలో సాగు, తాగునీటి కొరత లేకుండా కాళేశ్వరం జలాలు రప్పించే ప్రయత్నం జరుగుతున్నది. నిర్మాణంలో ఉన్న కాల్వల పనులు త్వరలో పూర్తవుతయ్​. బస్వాపురం రిజర్వాయర్​ పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతది. ఎన్నికలయ్యాక రిజర్వాయర్​ ప్రారంభించడానికి మళ్లీ వస్త” అని చెప్పారు. హైదరాబాద్​కు సమీపంలో ఉన్న భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కేటీఆర్​కు చెప్పినట్లు పేర్కొన్నారు. 

పల్లా 24 గంటలూ నా ఇంట్లోనే ఉంటడు

జనగామ బీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఇంటి మనిషి అని, 24 గంటలు తన ఇంట్లోనే ఉంటారని కేసీఆర్​ చెప్పారు. పల్లాను లక్ష మెజారిటీతో గెలిపించాలని, ఆయనను గెలిపించుకుని వస్తే చేర్యాల రెవెన్యూ డివిజన్​ను నెల రోజుల్లో చేస్తానని, జనగామను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. భువనగిరిలో బీఆర్​ఎస్ పార్టీ 50 వేల మెజార్టీతో గెలుస్తుందని సర్వే రిపోర్ట్​ లు చెప్తున్నాయని, ఇక్కడ మూడోసారి ఎమ్మెల్యేగా ఫైళ్ల శేఖర్​ రెడ్డి ని ఆశ్వీరాదించాలని కోరారు.

కేసీఆర్​ను మళ్లీ సీఎం జెయ్యాలి: పొన్నాల

సీఎం కేసీఆర్​ను మూడోసారి సీఎంను చెయ్యాలని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామ సభకు ఆయన కేసీఆర్​ తో కలిసి హాజరయ్యారు. లక్ష్మయ్యకు కేసీఆర్​ గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. పొన్నాల మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కేసీఆర్​ పాటుపడుతున్నారని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమగ్ర కుటుంబ సర్వే చేయించి వెనకబడిన కులాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్​లో 45 యేండ్లు పనిచేసిన తాను అవమానాలకు గురయ్యానని ఆయన అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరులా పనిచేస్తానన్నారు.