గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ హారతి

గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ హారతి

సిద్దిపేట : కొండపోచమ్మ రిజర్వాయర్ ‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. కొండపోచమ్మ జలాశయాన్ని చినజీయర్‌ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మర్కూక్‌ పంప్ ‌హౌస్‌ నుంచి ఈ రిజర్వాయర్ ‌లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుతఘట్టం ఆవిషృతమైంది. కొండపోచమ్మ సాగర్‌కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి కలిసి గంగపూజ నిర్వహించి గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌ లో కలిపారు. కొండపోచమ్మ సాగర్‌ లోకి నీరు చేరికతో ప్రాజెక్టులోని తుది.. 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయి.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్-పాములపర్తి గ్రామాల సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ ను నిర్మించారు. సిద్దిపేట జిల్లాలోని శ్రీరంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి 16 కిలోమీటర్ల సొరంగం ద్వారా మల్లన్నసాగర్ పంప్ హౌజ్ కు గోదావరి జలాలు చేరుకుంటాయి. అక్కడ ఎత్తిపోయడంతో అక్కారం పంప్ హౌజ్ కు .. అక్కడినుంచి మర్కూక్  పంపుహౌజ్ కు చేరిన తర్వాత మరోసారి ఎత్తిపోసి కొండపోచమ్మ రిజర్వాయర్ కు నీళ్లు పంపిస్తారు.

15 వందల 40 కోట్లతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్  తో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యదాద్రి భువనగిరి, మేడ్చల్  మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఐదుజిల్లాలో కలిపి మొత్తం 2 లక్షల 85 వేలకుపైగా ఎకరాలకు సాగునీరు అందనుంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట దగ్గర నిర్మిస్తున్న కేశవపూర్  రిజర్వాయర్ ద్వారా జంటనగరాలకు తాగునీరు అందించనున్నది.