
అసెంబ్లీ సాక్షిగా తేల్చేసిన సీఎం
ఆరేండ్లలో ఇచ్చింది 6 వేల మందికే.. పంచింది 15 వేల ఎకరాలే
లక్షల మంది పేదల అర్జీలు ఆఫీసుల్లోనే
దళితులకు మూడెకరాల భూ పంపిణీ స్కీమ్‌కు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక భూములు పంచేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ‘వట్టి సంచికాడ కొట్లాట.. ఖజానా ఉంటే కదా పంచడానికి’.. అంటూ మాటల్లోనే పథకాన్ని తోసిపుచ్చారు. ఇప్పటికే అన్ అఫీషియల్‌గా ఆపేసిన ఈ స్కీమ్ భవిష్యత్‌లోనూ ఉండబోదని చెప్పేశారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్.. దళితులకు భూములు పంపిణీ చేస్తామని పదేపదే హామీ ఇచ్చారు. భూములు పంచడమే కాకుండా అభివృద్ధి చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఎకరం ఉన్నోళ్లకు రెండెకరాలు, రెండెకరాలుంటే ఇంకో ఎకరం.. ఇలా ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టి ఎన్నికల ప్రచార సభలన్నింటా ఇదే ఎజెండాపై ఫోకస్ చేశారు. ఎంతమందికైనా భూమి ఇచ్చేందుకు సిద్ధమంటూ సీఎం అయ్యాక అదే ఏడాది ఆగస్టులో స్కీమ్‌ను స్టార్ట్ చేశారు. కానీ ఆచరణలో స్కీమ్ అట్టర్ ఫ్లాప్ అయింది.
అప్లికేషన్లు 2 లక్షలు.. ఇచ్చింది 6 వేల మందికి
దళితులకు మూడెకరాల స్కీమ్‌ను 2014 ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సందర్భంగా గోల్కొండ కోట నుంచి కేసీఆర్ స్టార్ట్ చేశారు. భూముల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఎస్సీ కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ఆరేండ్లలో 6,199 మందికే ప్రభుత్వం భూమిని పంచింది. ఇప్పటివరకు 15 వేల ఎకరాలే పంపిణీ చేసింది. ఈ ఏడాది 128 మందికి 143 ఎకరాలే పంపిణీ చేసింది.
బిత్తరపోయిన అర్జీదారులు
ఎస్సీ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రంలో 3.30 లక్షల మంది దళిత కుటుంబాలకు భూములు లేనట్లు సర్కారు మొదట్లో గుర్తించింది. ప్రభుత్వ భూమి లేకపోతే భూములు కొని పంపిణీ చేసేందుకు స్కీమ్‌ను డిజైన్ చేసింది. అందుకు అనుగుణంగా స్కీమ్‌ను ల్యాండ్ పర్చేజ్ స్కీమ్‌గా పేరు మార్చింది. గత ఆరేళ్లలో రూ. 675 కోట్లను పథకం కోసం ఖర్చు పెట్టింది. కానీ దరఖాస్తు చేసుకున్న వాళ్లలో ఇప్పటికీ 97 శాతం మందికి పంచలేకపోయింది. ఇన్నాళ్లూ భూమి ఇస్తామని చెప్తూ వస్తున్న కేసీఆర్.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ చట్టంపై చర్చకు సమాధానమిస్తూ భూ పంపిణీ లేదని తేల్చేశారు. దీంతో అర్జీదారులు బిత్తరపోయారు. రాష్ట్రం వస్తే దళితుడిని తొలి సీఎం చేస్తామన్న కేసీఆర్.. ఆరేండ్లు ఊరించి దళితులను మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు.
దళితులకు మూడెకరాలపై సీఎం ఎప్పుడేమన్నరు..
2014 ఏప్రిల్ 24న ఎన్నికల ప్రచార సభలో..
దళిత కుటుంబానికి మూడెకరాల భూమిస్త. నీటి వసతి కల్పిస్త. అవసరమైన పెట్టుబడిని ఓ ఏడాది ఫ్రీగా ఇస్తనని చెప్పిన. కొంతమంది తెలివి తక్కువ తనంతో యాడికెళ్లి ఇత్తవ్ కేసీఆరూ అన్నరు. యాడికెళ్లి ఇత్తవ్. మనసుంటే మార్గముంటది.
2014 సెప్టెంబర్ 10న..
లక్ష దళిత కుటుంబాలకు రాబోయే నాలుగేండ్లలో కచ్చితంగా మూడెకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పిన.
2015 మార్చి 17న అసెంబ్లీలో..
మొత్తమే లేనోళ్లకు మూడెకరాలు కొనుమన్నం. ఎకరం ఉన్నోళ్లకు రెండెకరాలు కొనమంటం. రెండునోళ్లకు మూడు చేయమంటం. ఎన్ని అప్లికేషన్లు తెచ్చిచ్చినా ఇయ్యడానికి మేం సిద్ధం.
2020 సెప్టెంబర్ 11న అసెంబ్లీలో..
భవిష్యత్‌లో భూములు పంచుతమని అంటున్నరు. లేదు.. వట్టి సంచికాడ కొట్లాట. ఖజానా ఉంటే కదా పంచేది. భూములు పంచుతమని ఇంతకుముందు పార్టీలు చెప్పినట్టు మేం అబద్ధాలు చెప్పం. ఓట్లప్పుడు చెప్పి తర్వాత ఇంకోటి చెప్పే అల్వాటు మాకు లేదు.
For More News..