టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చిస్తున్నారు. స్టీరింగ్ కమిటీ, జిల్లా, నియోజకవర్గాల వారిగా ఇంచార్జుల నియామకంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఇంచార్జులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలకు పార్టీ సభ్యత్వం, పార్టీ కమిటీల ఎన్నికల నిర్వహణపై కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ సభ్యత్వం చేర్పించడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు కేసీఆర్. పార్టీ రాష్ట్ర కమిటీ ఎన్నిక, కమిటీ సభ్యుల నియామకంపై సమావేశంలో చర్చిస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వరుస ఎదురుదెబ్బల తర్వాత జరుగుతున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కావడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో కీలక అంశాలపై ఫోకస్ చేస్తారని సమాచారం. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు.. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారంపై ఇవాళ్టి సమావేశంలో క్లారిటీ రావొచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, ZP చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, DCCB అధ్యక్షులు, DCMS అధ్యక్షులు కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు.
